పుట:Abaddhala veta revised.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రజ్ఞుడు ప్రశ్నిస్తే సమాధానం రావడం లేదు! అంచులు లేని పరిమిత విశ్వం గురించి ఐన్ స్టీన్ చెప్పాడు. తాబేలు చివరకు వెడితే పడిపోతాంగదా? బెర్ముడా సముద్ర గర్భంలోకి పోతామా? అని హాకింగ్ అడిగాడు.

విశ్వాన్ని గురించి పూర్వకాలం నుండి నేటి వరకూ యెందరో తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు భిన్న సిద్ధాంతాలు చెబుతూ వచ్చారు. విశ్వం యెక్కడ నుంచి వచ్చింది? దీనికి మొదలు చివర వున్నాయా? కాలం అంటే ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నాలు జరిగాయి. సైన్స్ పేర్కొన్న సిద్ధాంతాలన్నీ తాత్కాలికమే. యావత్తు ప్రపంచాన్ని వివరిస్తూ ఒకే సిద్ధాంతం వస్తే బాగుండునని సైన్సు కలలు కంటున్నది. కాని అది కలగానే మిగిలిపోయింది. విశ్వాన్ని పడగొట్టి, సైన్సు వివరణ యిస్తున్నది. ప్రపంచం ఎలా మారుతున్నదో చెబుతున్నది. ప్రపంచం ఎలా ప్రారంభమైందో తెలుసుకుంటున్నది. పరిణామక్రమం చెబుతున్నది.

ప్రస్తుతం రెండు పెద్ద సిద్ధాంతాల దగ్గర సైన్సు ఆగింది. ఒకటి సాపేక్షితా సిద్ధాంతం. ఐన్ స్టీన్ పేర్కొన్న యీ విశిష్ట సిద్ధాంతం విశ్వాన్ని వివరిస్తున్నది. ఇది స్థూల ప్రపంచం ఇందులో కార్యకారణ సంబంధాలున్నాయి.

మరో సిద్ధాంతం సూక్ష్మ ప్రపంచంలోని అణువులు, కణాలు, పరమాణువులు గురించి పేర్కొంటున్నది. ఇక్కడ కార్యకారణ సంబంధాలు విఫలమయ్యాయి. నిర్ధారణగా చెప్పే స్థితి లేదు. ఉజ్జాయింపుగా అంచనాలు వెయ్యాలే తప్ప నిక్కచ్చిగా చెప్పే స్థితిలేని సూక్ష్మ ప్రపంచాన్ని గురించి క్వాంటం సిద్ధాంతం యెంతో కనిపెట్టింది.

సాపేక్షతా సిద్ధాంతానికి క్వాంటం సిద్ధాంతాన్ని జోడించగలిగితే, విశ్వాన్ని వివరించగల పొందికైన సిద్ధాంతం సాధ్యమే. దీనికోసం ఐన్ స్టీన్ ప్రయత్నించి విఫలమయ్యాడు. స్టీఫెన్ హాకింగ్ అలాంటి ప్రయత్నం సాధ్యమేనంటున్నాడు. యెలాగ? అంటే డార్విన్ పేర్కొన్న పరిణామ సూత్రంలో సహజంగా యెంపిక చేసుకునే పద్ధతిని హాకింగ్ సూచించాడు. లోపాలున్న జీవులు నశించడం, పరిణామానికి తట్టుకొని బ్రతకగల జీవులు మాత్రమే కొనసాగినట్లే, సాపేక్షతా సిద్ధాంతం క్వాంటం సిద్ధాంతం కలిపి ఒకే సిద్ధాంతంగా రూపొందించవచ్చని హాకింగ్ ఆశిస్తున్నాడు.

మనం రోడ్డుపై వెడుతుంటే కార్ల శబ్దాలు వింటుంటాం. కారు సమీపిస్తుంటే శబ్దం యెక్కువగానూ దూరంగా పోతుంటే శబ్దం సన్నగిల్లుతుండడం సర్వసాధారణమే. అలాగే ఆకాశంలో నక్షత్రాలు మనకు దగ్గరగా వస్తుంటే వాటి కాంతి నీలంగానూ,దూరంగా జరుగుతుంటే ఎర్రగానూ కనిపిస్తాయి. దీన్ని డాప్లర్ ప్రభావం అంటారు. ఆకాశంలో పాలపుంతలు, అనేక తారలు ఒకదాని నుండి మరొకటి రోజురోజుకూ దూరంగా వెళ్ళిపోతున్నాయి. హబుల్ అనే శాస్త్రజ్ఞుడు జీవితమంతా వీటిని పరిశీలించి అన్నీ దూరంగా జరిగిపోతున్నట్లు కనుగొన్నాడు. విశ్వం స్థిరంగా లేదు. విస్తృతమౌతూ వుంది. న్యూటన్ కాలంనుండే విశ్వమంతా స్థిరంగా వున్నదనే నమ్మకం పటాపంచలైంది. హబుల్ ఒకవైపున, ఫ్రైడ్ మన్ మరోపక్క విశ్వం విస్తృతమయిపోతున్నట్లు