పుట:Abaddhala veta revised.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనకు తెలిసిన మేరకు భూమిపై ప్రాణం అనేది సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం ఆరంభమైంది. క్రమేణా ప్రాణుల పరిణామం జరిగింది. ఈ పరిణామంలో భిన్న జీవులు వచ్చాయి. పరిణామం చాలా నెమ్మదిగా జరిగింది. కోతి నుండి మానవుడు పరిణమించడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పట్టింది. అలా వెనక్కు వెళ్ళి పరిశీలిస్తుంటే విశ్వం 15 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక్కసారిగా బద్దలై పరిణామం మొదలైందని తెలుస్తున్నది. అప్పటినుండీ విశ్వం విస్తరిస్తూ పోతున్నది. హీలియం వంటివి ఉత్పత్తి కాకుండా ఆరిపోయాయి. వేడితగ్గుతూ అణువులు ఏర్పడ్డాయి. విస్తరిస్తున్న విశ్వంలో కొన్నిచోట్ల గురుత్వాకర్షణ శక్తి యెక్కువై, విస్తరణ మందగించింది. నక్షత్ర సముదాయాలు ఏర్పడ్డాయి. సూర్యుడివంటి నక్షత్రాలు హైడ్రోజన్ ను హీలియంగా మార్చేశాయి. ఆ విధంగా జనించిన శక్తినే మనం వేడి అని, కాంతి అని పిలుస్తున్నాం. సూర్యుడు 5 వేల మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు అంచనా వేశారు. దీని చుట్టూ బరువైన కణాలు కలసి గ్రహాలు, భూమి ఏర్పడ్డాయి.

భూమి ఏర్పడినప్పుడు చాలా వేడిగా వుండేది. వాతావరణం లేదు. క్రమేణా చల్లారుతూ వాతావరణం ఏర్పడింది. అప్పటి వాతావరణం ప్రాణులకు అనుకూలం కాదు. ప్రాణహాని కలిగించే వాయువులు వుండేవి. అందుకు తట్టుకోగల ప్రాణి సముద్రాలలో మనగలిగింది. వాటిలో తమను తాము పెంచుకోగలవి మాత్రమే మిగిలి, తతిమ్మావి నశించాయి. అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ స్వీకరించి, ఆక్సిజన్ వదిలే జీవులనన్మాట! క్రమంగా వాతావరణం మారుతూ జీవపరిణామంలో చేపలు, ప్రాకే జంతువులు, పాలిచ్చేవి, తరువాత మనుషులు వచ్చారు.

అత్యంత ఆధునిక విశేషాలు

కవల పిల్లల్లో ఒకరు కొండమీద, మరొకరు సముద్రమట్టంలో వున్నారనుకోండి. కొంతకాలం తరువాత వారిద్దరూ కలుసుకుంటే కొండమీద పెరిగిన వ్యక్తి పెద్దవాడిగా కనిపిస్తాడు. అయితే యీ తేడా అంతగా కొట్టొచ్చినట్టనిపించదు. కాని కాంతి వేగంలో కవలలో ఒకరు ప్రయాణం చేస్తే భూమ్మీదున్న వానికంటే అతను చాలా చిన్నవానిగా కనిపిస్తాడు. సైన్సు ఇలాంటి అద్భుతాలెన్నో పేర్కొంటున్నది. మనం చూస్తున్న ప్రపంచానికీ, సైన్సు పరిశోధించి చెప్పే ప్రపంచానికీ ఎంతో తేడా వుంది. (ఈ విషయంపై వివరంగా ఈ వ్యాసం చివర)

స్టీఫెన్ హాకింగ్ చిన్న పుస్తకం రాసి ఇలాంటి విషయాలను విడమరచి చెప్పాడు. సైన్స్ లో అద్భుతాలు చెప్పిన హాకింగ్ కూడా ఒక అద్భుత వ్యక్తే. అతడి శరీరంలో చాలాభాగం పనిచేయడం లేదు. మెదడు మాత్రం గొప్పగా కృషిచేస్తున్నది. దాని ఫలితమే అతడి పుస్తకం (ఎ బ్రీఫ్ హిస్టరి ఆఫ్ టైం.)

మనం చూస్తున్న విశ్వాన్ని గురించి యెన్నో కథలు, గాథలు వున్నాయి. దీన్నంతటినీ పెద్ద తాబేలు మోస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే తాబేలు దేనిమీద వున్నట్లు అని ఒక