పుట:Abaddhala veta revised.pdf/400

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వానికి, హద్దులు కూడా లేవు అని స్టీఫెన్ హాకింగ్ అన్నాడు. (ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పేజి 149) క్వాంటం సిద్ధాంతం ప్రకారం అంచనాలన్నీ వుజ్జాయింపుగా(సుమారుగా) చేసేవేగాని, కచ్చితంగా కాదు. ఈ సూత్రాన్నే విశ్వానికి అన్వయించాలన్నమాట.

విశ్వం పెద్ద ప్రేలుడు సంభవించినప్పటినుండీ విస్తరిస్తూ పోతున్నది. అలాంటి విశ్వంలోనే మనుషులు పరిణమించారు. విశ్వం కుంచించుకపోతే మనుషులు వుండరు. మనం జీవించడానికి ఆహారం స్వీకరిస్తాం గదా. అది మనకు శక్తిని యిస్తుంది. దీనిని క్రమపద్ధతిలో శక్తిని స్వీకరించడం అనొచ్చు. ఆ శక్తిని శరీరం ఉష్ణంగా మార్చుకుంటుంది. అప్పుడు క్రమం తప్పి, శక్తి క్రమరాహిత్యంగా పనిచేస్తుంది. ఇదే సూత్రం విశ్వంలోనూ పనిచేస్తున్నది. విశ్వం విస్తరిస్తున్నందువలన క్రమరాహిత్యత పెరగడంలేదు. విశ్వానికి అవధులు లేనందువలన యిది సాధ్యపడుతున్నది.

పరిణామం ఇలా జరుగుతోంది

మనిషి బ్రతకడానికి అవసరమైన కొన్ని ముఖ్య లక్షణాలు భూమి మీద వున్నాయి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, కాల్షియం, ఫాస్ఫరస్,ఇతర గ్రహాలలో వున్న అమ్మోనియా, మిథేన్ భూమి మీద లేనందున, ప్రాణానికి హాని కలగడం లేదు. ఉష్ణోగ్రత 5 సెంటిగ్రేడ్ నుండి 40 సెంటిగ్రేడ్ వరకూ వున్నది. అంతకు మించితే మనిషికి కష్టం. సూర్యరశ్మి సమృద్ధిగా లభిస్తున్నది. భూమి సూర్యుని చుట్టూ తిరగడం,ఇంచుమించు సూర్యుని నుండి స్థిరంగా ఉష్ణోగ్రత రావడం ప్రాణానికి అనుకూలంగా వుంది. భూమి గురుత్వాకర్షణ శక్తి బలంగా వున్నందున యిక్కడ వాతావరణం హరించకుండా వుంది. మనల్ని పడిపోకుండా పట్టివుంచే మోతాదులో యీ భూమి గురుత్వాకర్షణ వుంది. భూమిపైన కొంత దూరంలో ఓజోన్ పొర కప్పివుండడంతో సూర్యుని నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ మనల్ని కాల్చివేయడం లేదు. విశ్వంలో యెంత సంక్షోభం వున్నప్పటికి, భూమి ప్రశాంతంగానే కొనసాగుతున్నది.

ఇలాంటి అనుకూల స్థితిలో భూమిపైన వాతావరణానికి యిమిడిపోతూ, ప్రాణం పరిణమించింది. అలా పొందికగా యిమడలేని ప్రాణులు హరించిపోగా, యిమడగలిగినవి పెరిగిపోయాయి. భూమి మీద వున్న వాతావరణం చంద్రుడిమీద లేదు. కనుక అక్కడ ప్రాణం మనుగడ సాగించలేదు. అనేక నక్షత్రాలు అనూహ్యంగా పేలిపోతుంటాయి. అలాంటిచోట ప్రాణం వుండడానికి వీల్లేదు.

స్ఫటికం ఉదాహరణగా చూస్తే వాటంతట అవే చక్కని రూపాలుగా పెరుగుతూ పోతాయి కాని వాటికి మనవలె ప్రాణం లేదు. నక్షత్రాలు క్రమపద్ధతిలో వున్నాయి. అయినా వాటిలో ప్రాణంలేదు మన శరీరంపై విద్యుదయస్కాంతం ప్రభావం చూపుతున్నది. ప్రకృతిలోని నాలుగు శక్తులలో విద్యుదయస్కాంతం (ఎలక్ట్రో మాగ్నటిక్) ఒకటి మాత్రమే అయినా మిగిలిన మూడుశక్తుల ప్రభావం ప్రాణంపై ఏ మేరకు వున్నదీ తెలియదు. అంటే, గురుత్వాకర్షణ శక్తి, నూక్లియర్ స్ట్రాంగ్ ఫోర్స్,నూక్లియర్ వీక్ ఫోర్స్ అనేవాటి ప్రభావం మనపై పనిచేస్తున్నదా లేదా అనేది తెలియదు.