పుట:Abaddhala veta revised.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సృష్టి ఎలా జరిగింది? అనే విషయమై మతాలు యెన్నో కథలు, గాధలు అల్లాయి. మతం చెప్పింది నిజమని నమ్మి, వెనక్కు వెళ్ళి, కార్యకారణ వాదాన్ని అంగీకరించినా, ఒక చోట ఆగిపోతున్నారు. ఒక స్థితిలో దేవుడు సృష్టించాడంటున్నారు. సైన్స్ పేర్కొనే పెద్ద ప్రేలుడు (బిగ్ బాంగ్) అదేనంటున్నారు. కార్యకారణ వాదాన్ని అక్కడ ఆపేయమంటున్నారు. దేవుడి మనస్సు మనకు తెలియదు గనుక. ఆ విషయాన్ని తరచిచూడడం అనవసరం అంటున్నారు. దేవుడికి కారణం ఏమిటి అని అడగరాదంటున్నారు. ప్రశ్న ఆపేయమనడం, దేవుడే అన్నిటికీ మూలం అనడం సరైన వాదమైతే, ప్రకృతికి ఆ వాదాన్ని యెందుకు అన్వయించరాదు?

పెద్ద ప్రేలుడుతో యీ విశ్వం ఆరంభం అయిందని, సైన్స్ కనుగొంటున్నది. అంటే ప్రేలుడుకు ముందు ఏమున్నదో ప్రశ్నించరాదనిగాని, తెలుసుకోరాదనిగాని సైన్స్ అనడం లేదు. ఇంతవరకు తెలిసిన దానిని బట్టి బిగ్ బాంగ్ వరకూ వెనక్కు వెళ్ళగలిగాం. 15 బిలియన్ సంవత్సరాల క్రితం పెద్ద ప్రేలుడుతో యిప్పుడున్న విశ్వం ఆరంభమైంది.

ఐన్ స్టీన్ రూపొందించిన సాపేక్షతా సిద్ధాంతం ఆధారంగా, గురుత్వాకర్షణ సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని, స్టీఫెన్ హాకింగ్, రోజర్ పెన్ రోజ్ పెద్ద ప్రేలుడు విషయం చెప్పారు. దీనితో విశ్వం యెప్పుడూ స్థిరంగా వుంటుందనే (Steady State) సిద్ధాంతం ప్రక్కకు పెట్టారు. అయితే పెద్ద ప్రేలుడుకు కారణం ఏమిటి అంటే, అలాంటిదేమీ కనబడడం లేదంటున్నారు. కారణం లేకుండా సంఘటన సాధ్యమా అనేది చిక్కు సమస్య అయింది. ఇక్కడే క్వాంటం సిద్ధాంతాన్ని సాపేక్షతా సిద్ధాంతానికి జోడిస్తే సమస్యకు పరిష్కారం వస్తుందంటున్నారు.

క్వాంటం సిద్ధాంతం ప్రకారం లోగడవున్న కారణాలు ఆధారంగా, జరగబోయేది నిర్ధారించి చెప్పలేం. అనూహ్యమైన మార్పులు సూక్ష్మ ప్రపంచంలో సాధ్యమే. స్థూల ప్రపంచానికి సూక్ష్మ ప్రపంచ అనూహ్య మార్పును అన్వయిస్తే, సరిపోతుంది. విశ్వం తలవని తలంపుగా వచ్చిందన్నమాట. క్వాంటం లోకంలో పదార్ధం నిర్దిష్ట కారణాలు లేకుండానే ఆవిర్భవిస్తున్నది. విశ్వం కూడా అలా వచ్చిందనుకోవాలి. రేడియోధార్మిక అణువులు ఎలా క్షీణిస్తున్నాయో తెలియనట్లే. ఇది కూడా యెలా ఆవిర్భవించిందో తెలియదు. అతీత శక్తి ఏదో వుందనుకోనక్కరలేదు. అలా అనుకుంటే మళ్ళీ మొదటికే వస్తాం. ఆ శక్తికి మూలం ఏది అనే ప్రశ్న వస్తుంది.

విశ్వం పెద్ద ప్రేలుడుతో ఆరంభమైనప్పుడు, యావత్తు పదార్ధం బాగా కుంచించుకొని వుండి వుండాలి. అంటే గురుత్వాకర్షణ శక్తి, పదార్ధ సాంద్రత, ఒకే కేంద్రంగా అణగి వుండేదన్నమాట. దీనినే ఏకస్థానంగా (Singularity) శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

పెద్ద ప్రేలుడుతో విశ్వం ఆరంభం కావడమంటే, కాలం-ఆకాశం కూడా అందులోనే యిమిడి వున్నట్లు గ్రహించాలి. మళ్ళీ ఐన్ స్టీన్ సిద్ధాంతం స్వీకరించి, విశ్వానికి పరిమితి వున్నా హద్దులులేవు అన్నారు. విశ్వం దానంతట అది వున్నది. దీనికి సృష్టికర్త లేడు. ఆది, అంతం లేని