పుట:Abaddhala veta revised.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మానవుడికి మెదడు పెద్ద సాధనం. మెదడు పనిచేసే తీరు పూర్తిగా యింకా తెలియలేదు. మెదడు కూడా శరీరంలో భాగమే, శరీరం ప్రకృతిలో భాగమే. ఆ విధంగా మెదడు కూడా ప్రకృతి నియమాలకు లోబడి పనిచేస్తుంది. ప్రకృతి మనలో ప్రతిబింబిస్తుంది.

ప్రకృతి అంతా నియమబద్ధమా? మనకు తెలిసిన మేరకు అలా కనిపిస్తున్నది. తెలియంది చాలావుంది. అది క్రమేణా తెలుసుకుంటున్నాం. ఇలా తెలుసుకునేటప్పుడు నియమం తప్పిన సందర్భాలు ఎదురౌతున్నాయి. కొత్త సాధనలు, ఆయుధాలు కావలసి వచ్చాయి. తెలియని రంగం ఎదురైనపుడు నమ్మకస్తులు ఆగిపోతారు, ప్రార్ధిస్తారు. సైన్స్ అలాగాక,మన పరిమితుల్ని గ్రహిస్తూనే, కొత్త విషయాలను కొత్త రీతులలో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. తార్కికంగా తెలుసుకునే ప్రయత్నంలో ఆగమనం అనీ, నిగమనం అనీ వచ్చాయి. ఆ తరువాత ఆ రెండిటినీ కలిసి, ప్రతిపాదనల నుండి రాబట్టే సిద్ధాంతాలు వచ్చాయి. శాస్త్రీయపద్ధతి వీటన్నిటినీ వాడుకున్నది. ఇలా శాస్త్రీయంగా చూస్తే, ప్రకృతి నియమబద్ధంగా కనిపించింది. అంటే జరుగుతున్న సంఘటనల మధ్య కార్యకారణ సంబంధం వున్నదన్న మాట. తెల్లవారడం-చీకటిపడడం రోజూ చూచి, అందులో క్రమత్వాన్ని గ్రహించి దీని వెనుక కార్యకారణ సంబంధాలు తెలుసుకున్నారు. అలవాటు చొప్పున సూర్యోదయం పొద్దుగూకడం అంటున్నా, భూమి తిరగడం ఇందుకు ప్రధాన కారణం అని రుజువైంది. కారణాలు అన్వేషిస్తుంటే, ప్రకృతిలో ఒకదానికి మరొకటి సంబంధం వున్నట్లు కనుగొంటూ పోయారు. పరస్పరం యీ సంఘటనలు ఆధారపడుతున్నాయి. ఇలా జరగకపోతే, ప్రపంచమంతా గందరగోళం, క్రమరాహిత్యం అవుతుంది. ఒక సంఘటన మరో సంఘటనకు దారితీస్తుండగా,ఇవి పరస్పర ఆధారాలు కాగా, ఇలా నియమబద్ధంగా జరగడం ముందే నిర్ధారితమై పోయిందా? అంటే నియతివాదం వుందా? జరగబోయేదంతా నిర్ణయమై పోయిందా? సైన్స్ ప్రకారం న్యూటన్ చలన సిద్ధాంతాలు, లాప్లాస్ సూత్రాలు కూడా నియతివాదాన్ని సమర్ధించాయి.

ఒక వస్తువు ఎక్కడ వుందో తెలిస్తే అది ఎలా పయనిస్తుందో చెప్పవచ్చు. ఎటు పోతున్నదో తెలిస్తే ఎక్కడ ఆగుతుందో, భవిష్యత్తులో దాని మనుగడ ఏమిటో తెలుసుకోవచ్చు అని లాప్లాస్ అన్నాడు. సైన్స్ యీ నియతివాదాన్ని చాలాకాలం అంగీకరించింది. నియమం తప్పినట్లు కనిపించే సంఘటనలు తెలుసుకోవడంలో మనకు చేతగాక, నియమరాహిత్యం అంటున్నామని నియతివాదులు చెప్పారు.

సైన్స్ లో నియతి అనియతివాదుల సంఘర్షణ చాలా కాలంగా(70 సంవత్సరాలుగా) సాగుతున్నది. క్వాంటం సిద్ధాంతం వచ్చినప్పటినుండీ యీ వాదోపవాదాలు విజృంభించాయి. ఈ దృష్ట్యా సైన్స్ ఇప్పుడేమి చెబుతుందో చూద్దాం.

విశ్వాన్ని ఎవరు సృష్టించారు?
తనంతట తానే సృష్టించుకోగలదా?