పుట:Abaddhala veta revised.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెద్దవారయిన తరువాత కూడా ఒక పట్టాన వదలవు. అప్పుడు సైన్స్ చదువుకున్నా, నమ్మకాలు ఒక పక్కన సైన్స్ మరోవైపు అట్టిపెడతారు. చాలా సందర్భాలలో సైన్స్ ను బడికి, పుస్తకాలకు, పరిశోధనాలయానికి పరిమితంచేసి, నమ్మకాలను పాటిస్తుంటారు. చదువుకున్నవారే అలా చేస్తుంటే మిగిలినవారు ఇంకా సులభంగా నమ్మకాల వూబిలో వుండిపోతారు.

ఇంత జరుగుతున్నా మానవులుగా మనం సైన్స్ వలననే ఎంతో పరిణామం చెందాం. ఇంకా మానసికంగా ఎదిగే అవకాశం వుంది. సైన్స్ మనకు చేసిన చేకూరుస్తున్న ప్రయోజనం ఇంతా అంతా కాదు.

నేను చెప్పిందే ఆఖరిమాట ఇంతకు మించిందిలేదు అని సైన్స్ అనదు. ఇప్పటికి వున్న ఆధారాలు, రుజువులు, పరిశీలనల వలన యీ పరిస్థితికి వచ్చాం అంటుంది. కొత్త విషయాల వలన పరిస్థితి మారవచ్చు. అప్పుడు మన అభిప్రాయాలు మార్చుకుంటాం.

సైన్స్ లో వ్యక్తి అరాధన పూజ వుండదు. ఫలానావ్యక్తి గొప్ప సైంటిస్టు గనుక అతడు ఏ విషయం చెప్పినా అదే ప్రమాణం అనరు. రుజువుకు నిలబడడం ఒక్కటే సైన్స్ లో గౌరవాన్ని పొందే విషయం మార్పుకు, చేర్పుకు సైన్స్ ఎప్పుడూ సిద్ధమే.

తెలుసుకోవలసింది చాలావుంది, తెలుసుకున్నది పరిమితం అనే విచక్షణ వలన, మానవుడు వినయంగా ప్రవర్తిస్తాడు. సర్వజ్ఞుడు. సర్వాంతర్యామి అనేవి లేవు. అన్నీ తెలిసినవారు అనేది తప్పు. గ్రంథాలలో ఇలాంటి మాటలు రాసినా వాటికి అర్థంలేదు. ఇది గ్రహించడం అవసరం. ఇన్నాళ్ళూ యీ మాటలతో చాలామంది బయలుదేరి మనుషుల్ని మానసికంగా,తరువాత ఇతరత్రా దోపిడీ చేశారు. ఇంకా చేస్తున్నారు. మనకు తెలియని విషయాలు వున్నాయంటే, వాటిని పూజించమని, అర్థంకాదు. తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకు సైన్స్ తోడ్పడుతుంది. నువ్వు అజ్ఞానివి, పాపివి అని సైన్స్ మనిషిని తిట్టదు. నీకు తెలుసుకునే శక్తివుంది, ప్రయత్నించు అంటుంది.

సైన్స్ ఏం చెబుతుంది? యెప్పటికప్పుడు యీ విషయం తెలుసుకోవడం అవసరం. చిన్నప్పుడు సైన్స్ చదువుకున్నాం గదా అని సరిపెట్టుకుంటే పొరపాటే. సైన్స్ నిత్యనూతనం, నిత్యయవ్వనం గలది. సైన్స్ యెప్పుడూ "శాశ్వతం" అనదు "తాత్కాలికం" అంటుంది. కనుక ఏ రంగంలోనైనా ఇప్పుడు సైన్స్ ఏమంటున్నదనేది ముఖ్యం. సైన్స్ ఏమైనా చెప్పనీ,నా నమ్మకం నాది అని మూర్ఖంగా విశ్వసించే వారున్నారు. వారి వల్లనే మతాలు బతికి,వ్యాపారం చేసుకోగలుగుతున్నాయి.

మానవుడిని సైన్స్, ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయికి తీసుకుపోడానికి తోడ్పడుతుంది. మానవ విలువల్ని కాపాడడానికి సైన్స్ గొప్ప సాధనంగా నిలచింది. మతాలన్నీ మనిషిని కించపరచాయి. చిన్నచూపు చూచాయి. మనిషికి గౌరవం యివ్వకపోగా, విశ్వాసాలతో