పుట:Abaddhala veta revised.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాశ్చాత్యులు యీ పనిచేశారు. త్రిశంకుస్వర్గంవలె రాశులు కూడా మానవ సృష్టికి నిదర్శనమే. రాసులు నిజంకాదు. జ్యోతిష్యాన్ని శాస్త్రీయమని చూపాలనే ప్రయత్నంలో ఫ్రెంచి గణిత శాస్త్రజ్ఞుడు మైకెల్ గాక్విలిన్ చాలామంది పుట్టిన తేదీలు రాశిచక్రాలకు పొందిక వున్నట్లు పేర్కొన్నాడు. అయితే అన్ని సందర్భాలలో ఇది రుజువు కాలేదు. ఎవరు ఎన్ని తిప్పలు పడినా శాస్త్రీయం అని మాత్రం నిక్కచ్చిగా నిర్ధారించలేకపోయారు.

మన రాష్ట్రాంలో తెలుగు విశ్వవిద్యాలయం తెలుగుదేశం హయంలో దోణప్ప వైస్ ఛాన్సలర్ గా వుండగా, డిగ్రీ, డిప్లోమా జ్యోతిష్య కోర్సులు పెట్టింది. ఆ తరువాత సి.నారాయణరెడ్డి వైస్ ఛాన్సలర్ గా వుండగా హేతువాద సంఘం పక్షాన నేను అభ్యంతర పెట్టగా, నాకూ కొత్తపల్లి వీరభద్రరావుకూ ఒక సమావేశం ఏర్పరచారు. వాదోపవాదాలు విన్న తరువాత, శాస్త్రీయమని రుజువుపరచడం యూనివర్శిటీ బాధ్యత అని నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. డిగ్రీస్థాయిలో జ్యోతిష్యం తొలగించారు. రామన్ అనే బెంగుళూరు జ్యోతిష్కుడు అభ్యంతరపెట్టి, రాజకీయవత్తిడి తీసుకరావడానికి ప్రయత్నించినా, నారాయణరెడ్డి లొంగకుండా, శాస్త్రీయమనే ఆధారాలు చూపమన్నారు. రామన్ చూపలేకపోయారు. డిప్లోమా కోర్సు నుండి జ్యోతిష్యాన్ని తొలగించమని వైస్ ఛాన్సలర్ పేర్వారం జగన్నాధంను కోరగా, ఆయన సెనెట్ లో చర్చకు పెట్టారు. సెనెట్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. శాస్త్రీయమని రుజువు చేయటానికి ముందుకు రాలేదు. యూనివర్సిటీల స్థాయి అలా వుంది. ఒక ఆస్పత్రిని పరిశోధనా కేంద్రంగా స్వీకరించి, పుట్టినవారిపై ఎలాంటి ప్రభావం వుంది, ఉత్తరోత్తరా జ్యోతిష్యం చెప్పినవి వారిపట్ల రుజువు అయ్యాయా, పరిశీలించే బాధ్యత యూనివర్సిటీపై వుంది. కేవలం కొందరికి ఉద్యోగాలు కల్పించే నిమిత్తం యిలాంటి కోర్సులు పెడితే, ఆ కోర్సుల డిగ్రీలు పట్టుకొని, వారు మరికొందరికి హానిచేయవచ్చు. యూనివర్శిటీలు బాధ్యతారహితంగా, రాజ్యాంగవిరుద్ధంగా వున్నాయనడానికి (51Ah నిబంధన) ఇదొక ఉదాహరణ.

జ్యోతిష్యంలో చంద్రుడిని గూర్చి చిలవలు పలవలుగా పేర్కొంటారు. భూమికి ఉపగ్రహమైన చంద్రుడిలోకి యంత్రాల్ని పంపడం, మానవులు వెళ్ళి అక్కడి పదార్ధం తేవడం, పరిశీలించడం జరిగింది. అయినా చంద్రుడిపట్ల కట్టుకథలు చెబుతూనే వున్నారు. చంద్రుడి ప్రభావం పెద్ద స్థలాలపైనా, సముద్రాలపైనా వుంటుంది. చిన్నస్థలాల మీద నదులు, చెరువుల మీద వుండదు. మనుషులపై ఎలాంటి ప్రభావం లేదు. గురుత్వాకర్షణ శక్తి పెద్దవాటిపైనే వున్నట్లు స్పష్టంగా రుజువైంది. అమావాస్య, పున్నమి పేరిట చెప్పే చంద్రుడి ప్రభావ కథలన్నీ వినోదించేవిగాని, నమ్మవలసినవి కావు. మనుషులు వెళ్ళి వచ్చిన చంద్రుడు వేరు. మత గ్రంథాలు పేర్కొనే చంద్రుడు వేరనే మూర్ఖ నమ్మకస్తులూ వున్నారు.

మనపై మనకు విశ్వాసం, ధైర్యం లేనప్పుడు జ్యోతిష్యం వంటి బలహీనతలు చోటుచేసుకున్నాయి.

- హేతువాది, మార్చి 1994