పుట:Abaddhala veta revised.pdf/378

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకేరోజు ఒకే విధమైన జ్యోతిష్యాన్ని ప్రచురించడంలేదు. జ్యోతిష్యానికి ప్రత్యేక పత్రికలు వెలువడుతున్నాయి. జ్యోతిష్యం అంచనాలు ఎన్నివిధాల తప్పిపోయాయో, చూపినా, జనం ఇంకా గుడ్డిగా నమ్ముతూనే వున్నారు. తప్పిపోయిన అంచనాలకు జ్యోతిష్యులు బాధ్యత వహించడం లేదు. జనం మాత్రం మా కర్మ అనుకుంటూ, మరో ముహూర్తం కోసం, ఇంకో జ్యోతిష్యుణ్ణి వెతుక్కుంటూ పోతున్నారు.

జ్యోతిష్యం పూర్వకాలం నుంచీ వున్నది. అన్ని దేశాల్లోనూ వివిధ రీతుల్లో పాటిస్తున్నారు. మన దేశ జ్యోతిష్యానికి అమెరికా జ్యోతిష్యానికీ చాలా తేడాలున్నాయి. అలాగే మిగిలిన చోట్ల కూడా. జ్యోతిష్యం పూర్వంనుండి ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలపై ఆధారపడింది. వాటి చలనం, అక్కడ నుండి వచ్చే వెలుగు, ఆకర్షణ మన జీవితాల్ని ప్రభావితం చేస్తాయనే నమ్మకమే జ్యోతిష్యానికి మూలం. శాస్త్రంలో పరిశీలన ఒక భాగం. అది రానురాను ఖగోళ శాస్త్రానికి దారితీసింది. ఖగోళశాస్త్రం శాస్త్రీయంగా, జ్యోతిష్యం నమ్మకంగా మిగిలిపోయింది.

పూర్వం రాజులు జ్యోతిష్యుల్ని పెట్టుకునేవారు. జ్యోతిష్యం తప్పిపోతే, చెప్పిన జ్యోతిష్యుణ్ణి వురితీసేవారట చైనాలో! అలా కాకపోయినా, జ్యోతిష్యంచనాలకు బాధ్యత వహించేటట్టు చేయడం అవసరం. అప్పుడు కొంత అయినా అదుపు వస్తుంది. అమెరికాలో అధ్యక్షుడుగా రీగన్ జ్యోతిష్యులను పెట్టుకొని, వారి ప్రకారం నడుచుకున్నాడు.

అలెగ్జాండ్రియా, ఈజిప్టు, బాబిలోనియా, గ్రీక్, రోమన్ నాగరికతలలో జ్యోతిష్యం వుండేది. దేశభవిష్యత్తును అంచనావేస్తూ చెప్పే జ్యోతిష్యం, వ్యక్తిపరంగా చెప్పే జ్యోతిష్యం వుండేది. మరణాలకు,ఉపద్రవాలకు గ్రహాలు కారణం అని నమ్మేవారు. పూర్వం నుండి వస్తున్న ఆ నమ్మకం అలా అంటురోగంలా ప్రబలుతూ వచ్చింది.

తెలుగు రచయిత చలం కూడా రమణాశ్రమంనుండి అందరికీ వుత్తరాలు రాసి, అష్టగ్రహ కూటమికి ప్రపంచం అంతమౌతున్నదనీ రమణాశ్రమానికి వస్తే బ్రతికిపోతారని జోస్యం చెప్పాడు. అలాంటిదేమీ జరగలేదు. చలం రాసింది నిజమేనని నమ్మి వెళ్ళినవారున్నారు. అలా రాసినందుకు చలానికి శిక్షలేదు. బెంగుళూరులో రామన్ అనే జ్యోతిష్యుడు చెప్పినవి ఎన్ని విధాల తప్పిపోయాయో శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. హెచ్.నరసింహయ్య యీ విషయమై ఒక సంచలనం ప్రచురించారు. అయినా రామన్ పట్ల శిక్షలు లేవు. అందుకే జ్యోతిష్యులు బాధ్యతారహితంగా రాస్తున్నారు. అంచనాలు వేస్తున్నారు. దీనివలన జరిగే నష్టాలు అనూహ్యం. జోతిసష్యులు సాంఘిక నేరస్తులు. వీరిపట్ల చట్టం అవసరం.

చాలా జోతిష్యాలు అందరికీ వర్తించేటట్లు అస్పష్టంగా వుంటాయి. నెల మొదటివారంలో జీతాలు వస్తాయి గనుక, సంతోషంగా వుంటారని, నెల చివరలో కష్టాల్లో వుంటారని స్థూలంగా సూచించడం యిందులో భాగమే. అలాగే రుతువులు, శీతోష్ణస్థితిని బట్టి అంచనాలు చెప్పడం ఒక వ్యూహం మాత్రమే.