పుట:Abaddhala veta revised.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుండలినీయోగం ప్రకారం ముడ్డి దగ్గర వెన్నెముక చివరి భాగంలో మనిషి శక్తి వుంటుందని నమ్మకం. ఆ శక్తిని ప్రకోపింపజేసి క్రమేణా వెన్నెముక ద్వారా పైకి తెచ్చి మెదడు గుండా తీసుకురావడం ఆ పద్ధతి. ఇలాంటి శక్తి అనేది వూహాజనితమేగాని,ఆధారాలకు నిలవదు. నమ్మకం అన్నప్పుడు ఆధారాలు అడగరాదు.

హఠ యోగం చమత్కారాల మాయం. నీటిపై నడుస్తామని, గాలిలో తేలగలమని గొప్పలు చెప్పిన వారున్నారు. ఇవేవీ ఎన్నడూ నిజం కాలేదు.

ఇక యోగాభ్యాసంలో ఫాషన్ మారిన ప్రాణాయామం కొన్నిసార్లు ప్రమాదకారి అని గ్రహించాలి. ఊపిరి బిగబట్టి వదలడం ఇందలి ముఖ్యాంశం. 45 సెకండ్ల వరకూ వూపిరి బిగబడితే చిక్కులు రావు. కొందరు అలవాటుగా రెండు మూడు నిమిషాలు వూపిరి పీల్చి బిగబడతారు.మనం పీల్చిన ప్రాణవాయువు(ఆక్సిజన్) శరీరానికి ఉపయోగపడిన తరువాత బొగ్గుపులుసు వాయువుగా(కార్బన్-డయాక్సైడ్) బయటకు వస్తుంది. అంటే బొగ్గుపులుసు వాయువును శరీరం అట్టిపెట్టుకోదు. బలవంతంగా వుంచితే చిక్కులు వస్తాయి. ఈ చిక్కులలో పేర్కొనదగినవి మూర్చ రావడం, స్పృహ తప్పడం, పగటి కలలు రావడం, వింత దృశ్యాలు కనిపించడం,భ్రమలు కలగడం వున్నాయి.

బొగ్గుపులుసు వాయువు ఎక్కువసేపు అట్టి పెడితే వచ్చే పరిణామాలను శాస్త్రీయంగా పరిశీలించారు. ఇందులో ఒక అంశం ఏమంటే, రక్తంలో టెన్షన్ 40 ఎం.ఎం. వుండాలి. బొగ్గుపులుసు వాయువు వుండడం ఎక్కువైతే టెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది. 80-90 వరకూ టెన్షన్ పెరిగిందనుకోండి. భ్రమలు, కలలు, వింత ఆలోచనా ధోరణులు వస్తాయి. వాటినే దైవాంశాలుగా, విపరీత వ్యాఖ్యానాలు చేసి చూపుతారు. రామకృష్ణ పరమహంస యిలానే చెప్పేవాడు. ఆయన తరచు ముర్ఛలకు గురయ్యేవాడు. ఈ విధమైన స్థాయి కొనసాగిస్తే సమాధి అని చెప్పే స్థాయి వస్తుంది. అంటే స్పృహ కోల్పోవడం అన్నమాట. తిరిగి యధాస్థితి రావడానికి చాలాసేపు పడుతుంది. ఆ స్థితిని దైవసాన్నిధ్యంగా చిత్రించే వారున్నారు. కాని మెదడుపై యిలాంటి వత్తిడి వలన ప్రమాదకర స్థితి ఏర్పడుతుంది. దేహం శుష్కించిపోతుంది. యోగం పేరిట. తెలిసీ తెలియక కొందరు యీ దశలకు చేరుకుంటుంటారు. ఇందులో యిమిడిన ప్రమాదాలు తెలుసుకోలేరు.

ఇప్పుడు చాలా చోట్ల వెలసిన యోగ కేంద్రాలలో అసలు విషయం చెప్పరు. చెబితే జనం రాకపోవచ్చు, భయపడవచ్చు. కనుక కేవలం ఆరోగ్యం కొరకు, మానసిక ఉల్లాసం కోసం, టెన్షన్ తగ్గించడానికి అని మాత్రమే చెబుతారు. ఇది ఒక రకంగా మోసం చేయడం, మభ్యపెట్టడమే. డబ్బు కోసం కక్కుర్తిపడి మూలవిషయాలను దాచడం మన సంప్రదాయంలో వుంది. వాస్తులో కుల ప్రసక్తి వున్నా, నేడు ఆ విషయం దాచి పెడుతున్నారు గదా. అలాగే యోగం కూడా.