పుట:Abaddhala veta revised.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీటన్నిటిని నియమానియమాలన్నాడు. ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి మెట్టు మెట్టుగా సాధిస్తూ మోక్షాన్ని పొందాలి.

పతంజలి యోగంలో మూలసూత్రం చిత్తవృత్తి నిరోధం. ఆలోచన స్తంభింప జేసి, ముందు ఒక వస్తువుపై మనస్సు లగ్నం చేయాలి. తరువాత నిరాకారంపై దృష్టి పెట్టాలి. ఆలోచన చంపేయడం చాలా ముఖ్యమైన అంశంగా యోగం పాటిస్తుంది. ఇదంతా గురువు వద్ద నేర్చుకొని పాటించాలే గాని సొంతంగా ఆచరించరాదన్నారు.

వివేకానంద యోగాన్ని గైడ్ పుస్తకాలుగా రాసేసి, పాపులర్ చేశాడు. ముఖ్యంగా అమెరికాలో ఆయన గైడ్ చిట్కాలు బాగా అమ్ముడుపోయాయి ఆత్మ-పరమాత్మ విలీనం కావడమనే లయ మార్గాన్ని వివేకానందుడు రాజయోగం అని పేరు బెట్టి ప్రచారంలోకి తెచ్చాడు.

ఒకప్పుడు గురుకులాల్లో ఆశ్రమాలకు పరిమితమైన యోగం నేడు వీధి వ్యాపారంగా ధనార్జనకు అక్కర కొస్తున్నది. చాలా మంది ఆరోగ్యంతో యోగాన్ని ముడిపెట్టి అసలు విషయాన్ని దాచేశారు.

గురువు దగ్గర యోగం నేర్చుకొని అభ్యసించాలి అనే సూత్రాన్ని వదలేసి, వివేకానందుడు మొదలు అనేక మంది రాసి బజార్లో అమ్ముతున్న గైడ్ల ఆధారంగా యోగ స్కూళ్ళు,కేంద్రాలు వచ్చేశాయి.

పైగా కొందరు యోగం శాస్త్రీయమని చెప్పేటంత వరకూ సాహసిస్తున్నారు. శాస్త్రీయ పద్ధతికి యోగం ఎన్నడూ పరీక్షకు పెట్టలేదు. సైంటిఫిక్ విధానానికీ, యోగానికీ సంబంధం లేదు. కేవలం మూడ నమ్మకంగానే యోగం నాడూ నేడూ ప్రచారంలో వుంది. ఆ విషయంలో స్పష్టత అవసరం.

కసరత్తు, వ్యాయామం ఆరోగ్యం కొరకు చేసే అభ్యాసాలు వేరు. యోగం ఉద్దేశం అదికాదు. అందుకే అసలు విషయం దాచిపెడుతున్నారని చెప్పవలసి వస్తున్నది. చిత్తవృత్తి నిరోధం యోగం పాటించవలసిన సూత్రమైతే, మోక్ష సాధన లక్ష్యం మార్గాన్నీ-లక్ష్యాన్నీ యోగం అరమరికలు లేకుండా చెప్పిందని మరచిపోరాదు.

యోగంలో చాలా రకాలున్నాయి. అందులో కుండలినీ యోగం ఒకటి కాగా, తాంత్రిక యోగం మరొకటి. తాంత్రిక యోగంలో సెక్స్ కూడా అమలుపరిచాడు. స్త్రీని సాధనంగా చేసుకుని యీ యోగాన్ని అమలుపరచాలన్నారు. క్రమేణా తాంత్రిక యోగం సెక్స్ షాపులుగా మారాయని, కేంద్ర ప్రభుత్వం దీనిని నిషేధించింది. ఒకప్పుడు గుజరాత్, అస్సాం, బెంగాల్ లో పాటించిన తాంత్రిక కేంద్రాలు నేడు మూతపడ్డాయి.

స్త్రీ బదులు వస్తువును పెట్టి తాంత్రిక విద్య అమలుచేసే రీతుల్ని కేరళలో పాటిస్తున్నారు.