పుట:Abaddhala veta revised.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దెబ్బ తగిలేచోట వాడుకోబోమని అంటే కుదరదు. హ్యుమనిస్టులు, హేతువాదులు తెలిసో తెలియకో హోమియో వైద్యం చేబట్టారనుకోండి అది శాస్త్రీయం అవునా కాదా అని ప్రశ్నించినప్పుడు వారు కూడా ఆ పరీక్షకు నిలవాలి. అదొక్కటే మినహాయించి మిగిలిన వాటిలో మానవవాదం అంటే కేవలం అవకాశవాదులుగా మిగులుతాం. వృత్తి లాభసాటిగా వుంది గనుక, ఏమైనాసరే హోమియోను సమర్ధిస్తామనడం హేతువాదంకాదు. రుజువులు చూపి శాస్త్రీయ పద్ధతి అని నిరూపించడం. లేదంటే హోమియో తప్పు అని యితరులకు చెప్పి, తాము వృత్తి మానడం హ్యుమనిజం.

- హేతువాది, జనవరి 1994
పెట్టుబడి లేని గిట్టుబాటు వ్యాపారం యోగ

యోగ విద్యను అమెరికాలో ప్రచారం చేసిన వివేకానంద 39వ ఏట చనిపోయాడు. యోగవిద్యను పాటించిన ఆదిశంకరాచార్యుడు 33వ సంవత్సరంలో మరణించాడు. కనుక యోగం వలన ఆయువు పెరిగి, చాలాకాలం ఆరోగ్యంగా వుంటారనేది అందరికీ చెందిన సత్యం కాదేమో!

ఇప్పుడు ఎక్కడ చూచినా యోగ బోర్డులు వెలిశాయి. మానసిక ఆరోగ్యం పేరిట, రకరకాల చికిత్సలు చేస్తున్నారు. యోగంలో అనేక పేర్లు వచ్చాయి. రాజయోగం, సిద్ధయోగం మొదలైనవి జనాన్ని ఆకర్షిస్తున్నాయి. విదేశాలకు ఎగుమతి అవుతున్న యోగం వలన కొందరు బాగా ఆర్జిస్తున్నారు. ప్రాచీన భారత సంస్కృతి పేరిట యోగం వీధిన బడింది. యోగం పెట్టుబడి లేని మంచి గిట్టుబాటు వ్యాపారంగా మారింది. బాబాలు, మాతలు తలెత్తినట్లే యోగం కూడా పాపులారిటీ సంతరించుకున్నది.

అసలు విషయం మభ్యపెట్టి యోగం వలన ఆరోగ్యంగా వుంటారని, ధనార్జన చేస్తున్న నేపధ్యంలో కొంచెం పూర్వాపరాలు చూద్దాం.

ఏది యోగం?

యోగం, భారతదేశం కనుగొన్న ప్రాచీన దర్శనం. మొత్తం ఆరు దర్శనాలలో యోగ ఒకటి. మోక్షం సాధించాలంటే లోగడ ఎవరి మార్గం వారు సూచించారు. మాది మాత్రమే మోక్షాన్ని సాధించగలదు అని చాటారు. అలాంటి ఆరు దర్శనాలు : న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంసలు.

యోగం కనుగొన్న ఆద్యుడుగా పతంజలి పేరు చెబుతారు. అతని ప్రకారం మోక్ష సాధనకు ఎనిమిది మార్గాలు సూచించాడు. ఇందులో తొలిమెట్టు మాత్రమే ఆసనాలు.