పుట:Abaddhala veta revised.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుజరాత్ లో భూకంపం వచ్చి అనేక భవనాలు కూలి ఎందరో చనిపోతే, మేం ముందే చెప్పాం అనేవారున్నారు.

భవిష్యత్తు చెప్పడానికి మనకు వూళ్ళలో సోది వుంది. ఇళ్ళ వెంట వచ్చి చేటలో బియ్యం పోయమని, ఆడవాళ్ళను కుర్చోబెట్టి సోది చెప్పడం గమనించవచ్చు. చిలకలతో పెట్టెలోని కార్డులు తీయించి, అందులోవున్న విషయంచదివి, అది భవిష్యత్తుగా చెప్పే చిన్న వ్యాపారస్తులు వున్నారు. నాడీశాస్త్రం ప్రకారం తాటాకులపై మన భవిష్యత్తు, గతం అంతా రాసిపెట్టి వున్నదని నమ్ముతున్నారు.

ఇలా వివిధ రూపాలలో గతాన్ని, భవిష్యత్తును చెప్పి ఆకర్షించి, డబ్బు చేసుకొనే పద్ధతులు అన్ని దేశాల్లోనూ వున్నాయి. భవిష్యత్తును ఎలా చెబుతారు? తాము మనోశక్తితో చూడగలుగుతున్నామంటారు. నిద్రలో కలలుగా వచ్చే వాటిని నమ్మి అదే భవిష్యత్తువాణి అని భావిస్తున్న వారున్నారు. సంఘటన జరిగిన అనంతరం అనేక సందర్భాలలో కొందరు ముందుకు వచ్చి తాము ముందే చెప్పామని, ఊహించామని అనడం సర్వసాధారణంగా వుంది.

కాల ప్రవాహాన్ని ముందే పసిగట్టడం సాధ్యమని సైన్స్ లో క్వాంటం సిద్ధాంతాల ఆధారంగా చెబుతున్నారు. వాంహాల్స్ అనే విధానం ప్రకారం కాంతి వేగంతో,ప్రయాణం చేసి,ముందు జరుగనున్నది చూడగలమని సిద్ధాంత పరంగా చెబుతున్నారు. ఇందులో ఒకవైపు కాంతివేగంతో ప్రయాణం చేస్తుంటే మరోవైపు నెమ్మదిగా పయనిస్తుంది. అప్పుడే భవిష్యత్తు చూడటం కుదురుతుంది. ఇది సైన్స్ లో యింకా రుజువుకాని ప్రతిపాదన అని మరచిపోకూడదు.

ఇంతవరకూ వివిధరకాలుగా భవిష్యత్తు చెప్పడంలో స్పష్టత ఎక్కడా లేదు. అస్పష్టంగా చెప్పి, ఏదన్నా జరిగినప్పుడు మా అర్థం అదే అంటారు. ఇది బ్రహ్మంతత్త్వాలలో బాగా కనిపిస్తుంది. అలాగే నోస్ట్రాడమస్ (1503-1566)లో కూడా. క్వాంటం సిద్ధాంతంలో వూహించినవి, పరిశోధించినవన్నీ మన ప్రపంచానికి అన్వయించవీల్లేదు. అస్థిరత్వం అనేది క్వాంటంలో వున్నా, ఆచరణలో ఫలితాలు కలిపించి, నిర్ధారణగా రుజువయ్యాయి.

క్వాంటం సిద్ధాంతం వల్ల ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్లు, లేజర్లు,టెలివిజన్, కంప్యూటర్లు, ఆకాశంలో ప్రయాణం,అలా ఎన్నో వచ్చాయి. కనుక అందులో నిర్ధారణ వుంది. కార్ల్ యూంగ్ వంటి మనోశాస్త్రజ్ఞులు కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించి, భవిష్యత్తు చెప్పడానికి వీలుందనే ఆశలు కల్పించారు. మానవుడి చైతన్యత భవిష్యత్తులోకి తొంగి చూడగలదన్నా డాయన. కాని భవిష్యత్తుకు సంబంధించిన సిద్ధాంతాలేవీ రుజువుకు నిలబడలేదు. అంటే సోది, నాడి, జోస్యం వంటివి రుజువు కావన్నమాట. కేవలం నమ్మకమే వీటికి బలం.

సైన్స్ లో వచ్చే సిద్ధాంతాలను జోస్యం చెప్పేవారు అడ్డం పెట్టుకోవడంలో అర్థం లేదు. సైన్స్ తననుతాను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ సాగుతుంటుంది. పాతనే అంటిపెట్టుకోదు.