పుట:Abaddhala veta revised.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్ని దీవులలో, సముద్రం మధ్య లంకలలో పరిమిత ఆహారం లభిస్తుంది. ఆకు అలములు తినే సముద్ర ఆవులలో వుండే కాలేయం(లివర్)లో ఎ విటమిన్ సమృద్ధిగా వుంటుంది. ఇది రెటినోల్ గా వుంటుంది. అది తిన్నవారికి పుట్టుకలో వ్యాధులు వస్తాయి. దీవులలో బాగా వెడల్పాటి పాదాలతో పుట్టిన పిల్లలు యిలాగే లోపాలతో వుండగా,మెర్ మెయిడ్ కథలొచ్చాయి. పుట్టుకలో వికృతాల వల్ల దవడలలో వచ్చిన రూపం మారుతున్నది. అలాంటి వారిని చూసి అడవితోడేలు మనిషిగా చిత్రించారు. హింసాయుతంగా ప్రవర్తించడానికి మానసికశక్తి సక్రమంగా లేకపోవడం కూడా ఒక కారణం.

నరసింహావతారం మన కథల్లో సుప్రసిద్ధమే. అలాగే చాలా జంతు ఆకారాలు మన గాథల్లో పవిత్రతను, రాక్షసత్వాన్ని సంతరించుకున్నాయి. ఇలాంటి వికృతాకారాలు పుట్టుక దోషాల కారణంగా వచ్చినవే. పరిణామ క్రమంలో అక్కడక్కడా దారితప్పి, వికృతాకారాలు రావడం జరిగింది. పరిసరాల ప్రభావం కూడా దీనిపై వుంది. అకడక్కడా చిన్న సమూహాలు ఇతరులతో సంబంధం లేకుండా, కుంచించుకుపోయి, తమలోతామే వివాహాలు చేసుకొని, పుట్టుకలో అనేక లోపాలకు చోటు యిచ్చారు.

నేపాల్ లో 'యతి' అనే వింత ఆకారాన్ని చూసినట్లు కొందరు చెప్పగా, దీనిపై చాలా కథలు వచ్చాయి. పాశ్చాత్య దేశాలలో మంచుమనిషి మొదలైనవి వున్నాయి. పరిణామంలో అకక్డక్కడా వచ్చిన వికృతాలు,దారి తప్పిన తీరుకు యీ వింత ఆకారాలే నిదర్శనం. ఇవన్నీ అధ్యయనం చేసెలోగా కథలు అల్లేశారు. పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలించిన డార్విన్ తొలుత వివరణ యిస్తూ మనకూ కోతులకూ పూర్వీకుల సాధారణ లక్షణాలను చెప్పాడు. అంతేగాని కోతిలోనుండి మానవుడు వచ్చాడని చెప్పలేదు. ఈ విషయం కొందరు తెల్సీతెలియక కోతి నుండి మనిషి వచ్చినట్లు చెబుతుంటారు. పరిణామవంశంలో ఉభయులకూ ఒకే లక్షణాలు వుండడం. ఒక దశలో వేరుపడిన జీవులు మానవులు గావడం అనేది జరిగింది. అందులో జన్యువిభాగం అధ్యయనం చేసి వికృతాకారాల కారణాలు చెబుతున్నారు. భూమిపై వున్న మనుషులు ఒకరికొకరు తెలియకముందు ఆకారాల వికారాలపై కథలు వచ్చాయి. ఏమాత్రం తేడా వచ్చినా కథ అల్లారు. ఇందులో రంగు, రూపం బాగా చోటు చేసుకున్నాయి. విడమరచి అధ్యయనం చేస్తే కారణాలు తెలుస్తాయి.

అప్పుడు పరిష్కారాలు సాధ్యపడతాయి. ఆశ్చర్యంలో అద్భుతాల్ని ఆరాధిస్తుంటే అన్వేషణ కుదరదు. జిజ్ఞాసతో తెలుసుకోదలిస్తే క్రమంగా పొరలు విప్పవచ్చు.

- వార్త, 24 మార్చి,2002