పుట:Abaddhala veta revised.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమాటల్ని ప్రధానంగా ప్రచురించడంతో, సంజీవయ్య స్పందించి వెంటనే కార్యక్రమం వేసుకొని దళిత హాస్టల్ సందర్శించడమేగాక, ఎజికెకు మెచ్చుకోలు లేఖ రాశాడు.

తిమ్మారెడ్డి : పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి వ్యవసాయ మంత్రిగా దిగిపోయినప్పుడు తెనాలిలో ఎజికె పూనుకొని ఘనంగా ఆయన్ను సన్మానించి,ఒక సంచిక ప్రచురించి బహుకరించారు. పదవిలో లేనప్పుడు గుర్తించడం, వ్యక్తికి గౌరవమని ఎ.జి.కె.స్పష్టం చేశారు. అది ఎజికె హేతుపద్ధతికి, మానవ విలువలకు పట్టంగట్టే తీరు.

విద్యామంత్రితో : ఎస్ బిపి పట్టాభిరామారావుకు రవాణ, విద్యాశాఖలు ఆంధ్రప్రదేశ్ తొలిమంత్రి వర్గంలో యివ్వగా "విద్య కదలబారుతుందన్నమాట" అని ఎజికె చేసిన వ్యాఖ్యానం ఆకట్టుకున్నది. చలన రహితంగా వున్న విద్యాశాఖపై అదొక చురక. అప్పుడే పాఠ్యగ్రంథాల జాతీయకరణ చేయడం, విశ్వనాథసత్యనారాయణ రాసిన పాఠంలో బుద్ధుణ్ణి రాక్షసుడుగా, పాపాల్నిపెంచేవాడుగా చిత్రించడం జరిగింది. దీనిపై ఎజికె తన రచనల ద్వారా ధ్వజమెత్తి, ఆ పాఠాన్ని ఉపసంహరించేవరకూ పోరాడారు. ఎజికె విమర్శలకు పట్టాభిరామారావు వుక్కిరిబిక్కిరైపోయారు.

మాకినేని బసవపున్నయ్య : చదువుకునే రోజులలో (2వ ప్రపంచ యుద్ధ సమయం) గుంటూరు ఎసి కాలేజిలో కమ్యూనిస్టు నాయకుడు మాకినేని బసవపున్నయ్య, ఎజికె మిత్రులే. ఎం.ఎన్.రాయ్ అనుచరులతో మాట్లాడవద్దని కమ్యూనిస్టు పార్టీ రహస్య తీర్మానం చేసింది. ఆనాటి రాజకీయ కారణాలతో చేసిన ఆ నిర్ణయం ఎజికెకు తెలిసింది. రోడ్డుమీద అనుచరులతో వెడుతున్న బసవపున్నయ్యను ఉద్దేశించి "విప్లవాలు పరిగెత్తిపోవడం లేదు లేవోయ్ ఆగి మాట్లాడు కాసేపు" అని ఏడిపించాడు. చుట్టూ చూస్తున్న కమ్యూనిస్టు అనుచరులు గిలగిల్లాడిపోయారు కాసేపు! తీర్మానం అలా అమలుజరుగుతున్నందుకు.

రాజాజీమెప్పు : రాజ్యాంగ 17వ సవరణ వలన రైతు లోకానికి నష్టం వాటిల్లుతుందని, నియంతృత్వ ధోరణులు ప్రబలుతాయని రాజగోపాలాచారి, ఎన్.జి.రంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా బాపట్లలో పెద్దసభ జరిగింది. ఆ విషయంపై ముందుగా ఎజికె మాట్లాడారు. అది విన్న తరువాత రాజాజీ వ్యాఖ్యానిస్తూ, యిక తాను మాట్లాడవలసిందేమీ లేదని, చాలా విడమరిచి లోతుపాతులతో ఎజికె ప్రసంగించారన్నారు. రాజాజీ అలా శ్లాఘించడం ఎజికె విషయ పరిజ్ఞానానికి, పరిపక్వ విమర్శకు సర్టిఫికెట్. ఆస్తులను ప్రభుత్వం స్వాధీనపరచుకోవడానికి జవహర్ లాల్ నెహ్రూ తలపెట్టిన సవరణ విషయం. ఇదంతా(1957) స్టడీకాంపులలో ఎజికె ఆధ్వర్యం, ఆచార్య నిర్వహణ, కొత్తవారిని ప్రోత్సహించే తీరు, విషయాన్ని విపులీకరించడం ఒక అద్భుత ప్రక్రియగా వుండేది. అందులో పాల్గొని ఎజికె పట్ల ఆకర్షితులుకాని వారు లేరు.