పుట:Abaddhala veta revised.pdf/340

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు సాహిత్యాన్ని, రచయితల్ని తెలుగేతరులకు అందించడం ఆయన విశిష్టత. ఇందులో భాగంగా గ్లింప్సెస్ ఆఫ్ తెలుగు లిటరేచర్ రాయగా, కలకత్తా రైటర్స్ వర్క్ షాప్ వారు వెలువరించారు.

వృత్తిరీత్యానూ, వ్యక్తి దృష్ట్యా ఆంజనేయులుగారికి ఎందరో సన్నిహితులయ్యారు. వారిలో నార్ల వెంకటేశ్వరరావు, సంజీవదేవ్, బి.ఎస్.ఆర్.కృష్ణ, కె.శ్రీనివాస అయ్యంగార్, వామనరావు, పట్టాభిరాం, ఎ.ఆర్.బాజీ, భావరాజు నరసింహారావు ప్రభృతులెందరో వున్నారు. నార్ల వెంకటేశ్వరరావు తన ఇంగ్లీషు రచనల్ని ముందుగా ఆంజనేయులు పరిశీలించిన తరువాత ప్రచురించేవారు.

సాహిత్య అకాడమీ ప్రచురించిన కట్టమంచి రామలింగారెడ్డి, కేంద్ర ప్రచురణ సంస్థ వెలువరించిన కందుకూరి వీరేశలింగం పేర్కొనదగిన ఆంజనేయులు రచనలు.

విశ్వనాథ సత్యనారాయణ, గోపీచంద్, బైరాగి, పాలగుమ్మి పద్మరాజు, శ్రీశ్రీ, సి. నారాయణరెడ్ది, దాశరధి, దేవులపల్లి కృష్ణశాస్త్రి మొదలైన వారిని తెలుగేతరులకు చక్కగా మదించి పరిచయం జేయడం ఆంజనేయులు కృషిలో భాగమే. ఆయన రెండో భార్య హేమలత హిందీ విద్వాంసురాలు. ఆమె కూడా ఆంజనేయులుగారి రచనల్లో,సమాచార సేకరణలో తోడ్పడుతుండేది. ఆంజనేయులు గారికి పుస్తకాల సేకరణ మంచి అభ్యాసం. ఆయన 1999లో చనిపోయిన తరువాత శాంతిశ్రీ, ఆ గ్రంథాలయాన్ని పూనాకు తరలించారు.

ద్వివేదుల విశాలాక్షి రచన "గ్రహణం విడిచింది" ఇంగ్లీషులోకి అనువదించారు.

ఆంజనేయులు రిటైర్ అయిన తరువాత మద్రాసులో స్థిరపడి,హిందూలో బిట్వీన్ యు అండ్ మి అనే శీర్షిక 10 సంవత్సరాలు (1981-91) నిర్వహించారు. సున్నిత హాస్యం,విమర్శ ఆయన రచనల్లో కనిపించేది. ఆంజనేయులు సెక్యులర్ జీవితం గడిపారు. కుమార్తె వివాహం రిజిస్టర్ చేయించి,కన్యాదాన పద్ధతి నిరసించారు. సంగీతం, సంస్కృతం, సాహిత్యం అంటే ప్రత్యేకాభిమానం.

మద్రాసు ప్రెస్ క్లబ్ లో 30 సంవత్సరాలు అధ్యక్షులుగా వున్నారు. సాహిత్య విమర్శ, సాంఘిక సంస్కరణలపై కూడా రచనలు చేశారు. చిట్టచివరగా ఖాసాసుబ్బారావు జీవితచరిత్ర రాశారు. అది ఇంకా వెలుగు చూడాల్సివుంది. వీరబ్రహ్మేంద్రను సెక్యులర్ రుషిగా అభివర్ణించి రచన చేశారు కూడా. ఆంజనేయులుగారితో చర్చించడం చక్కని అనుభవం. అలాంటి అనుభవం నేనెప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను.

- వార్త, 4 నవంబరు,2001