పుట:Abaddhala veta revised.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసిన ఆంజనేయులు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా ఎలవర్రులో పుట్టారు. (1924 జనవరి 10) స్కూలు చదువు అంతా కింగ్ జార్జి పాఠశాల తురుమెళ్ళలో జరిగింది. ఆనాడు జిల్లాలోనే అది ప్రతిష్టాత్మకమైన స్కూలు. దక్షిణామూర్తి అనే క్రమశిక్షణ సైనికుడుగా హెడ్మాస్టర్ ఆధ్వర్యాన పేరొందిన ఆంజనేయులు విద్య ముగించారు. తరువాత మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో ఎం.ఎ. చదివి, లా కోర్సు పూర్తిచేశారు. తొలుత నుండే జర్నలిస్టు జీవితాన్ని ఎంపిక చేసుకున్న ఆంజనేయులు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో సబ్ ఎడిటర్ గా, మద్రాసులో ఆరంభించారు.ఇది 1948 నాటి మాట. 5 ఏళ్ళ తరువాత అక్కడే "హిందూ" పత్రికకు మారారు.

మరో 5 ఏళ్ళపాటు హిందూ సబ్ ఎడిటర్ గా సాగిన ఆంజనేయులు, ప్రభుత్వ ఉద్యోగంలో జర్నలిస్టుగా అడుగుపెట్టారు. 1959లో మద్రాసులో 'వాణి' ఆకాశవాణి పత్రిక ఎడిటర్ గా మరో రకమైన జర్నలిజం ప్రారంభించారు. అప్పటికే ఆంజనేయులు వివాహం చేసుకున్నారు. ఆయన భార్య ఆదిలక్ష్మి తెలుగు, తమిళ భాషాచార్యులు. ఆమె రష్యాలోని లెనిన్ గ్రాడ్ (సెయింట్ పీటర్స్ బర్గ్) వెళ్ళి 1958 నుండి 1962 వరకూ వున్నారు. అదే కాలంలో ఆంజనేయులు రష్యా, యూరప్ దేశాలు పర్యటించారు. తన అనుభవాలను 'విండో టు ది వెస్ట్' అని పుస్తకంగా ప్రచురించారు. ఉత్తమ ట్రావలాగ్ గా ఆ రచన మెప్పు పొందింది.

1962లో శాంతిశ్రీని కన్న ఆదిలక్ష్మి, ప్రసవించిన 15 రోజులకే లెనిన్ గ్రాడ్ లో చనిపోగా, సోవియట్ ప్రభుత్వం 16 మాసాలపాటు బిడ్డను పెంచి, ఇండియాలో తండ్రికి అప్పగించారు. 18 సంవత్సరాల అనంతరం శాంతిశ్రీ సోవియట్ పౌరసత్వం వదులుకోగా, రష్యా ప్రభుత్వం ఆమె పేరిట వుంచిన భరణం అందజేసింది. ఇప్పుడు పూనా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ లో ప్రొఫెసర్ గా వున్న శాంతిశ్రీ తండ్రికి సహాయపడుతూ వచ్చింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగరీత్యా ఆంజనేయులు ఢిల్లీ, హైదరాబాద్, మద్రాసులో వుంటూ సమాచారశాఖలో జర్నలిస్టుగా వృత్తిధర్మం నిర్వర్తించారు. ఉద్యోగంలో వున్నా వివిధ పత్రికలకు రాస్తూ ఆంజనేయులు మంచి పేరు తెచ్చుకున్నారు. అంతకుమించి,చక్కని రచనలు ప్రచురించారు. ఆయన రాసిన పత్రికలు క్వెష్ట్, ఇండియన్ రివ్యూ,థాట్, ఇండియన్ లిటరేచర్, త్రివేణి, ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, ఇండియన్ రైటింగ్ టుడే పేర్కొనదగినవి.

తెలుగు పత్రికలకు ఇంగ్లీషులో రాసి పంపగా, అనువదించి వేసుకునేవారు. స్వతంత్ర టైమ్స్, డక్కన్ హెరాల్డ్, న్యూస్ టుడే, ఇండియన్ బుక్ క్రానికల్ పత్రికలు కూడా ఆంజనేయులు వ్యాసాలు ప్రచురించాయి. భవాన్స్ జర్నల్ లో ఎన్నో విలువైన వ్యాసాలు ఆంజనేయులు రాశారు. వృత్తిచేస్తూనే అనేక సెమినార్లకు, చక్కని వ్యాసాలు రాయడం ఆంజనేయుల జర్నలిస్ట్ కృషిలో భాగం అయింది. దీనిఫలితంగా జీవితచరిత్ర, కళ గురించేగాక, నెహ్రూ, రాధాకృష్ణన్, అంబేద్కర్, నిరాద్ చౌదరి మొదలైనవారిపై లోతైన పరిశీలనా వ్యాసాలు రాశారు.