పుట:Abaddhala veta revised.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధరించటానికీ, సుష్టుగా భోంచేయటానికీ వెనుక పెద్ద గాధ ఉన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే గోదావరిని అదుపులోపెట్టి, ప్రజావసరాలు తీర్చే నదిగా మార్చటానికి మూలపురుషుడు సర్ ఆర్ధర్ కాటన్. ఆయన కేవలం గోదావరి ప్రజలకే గాక అన్నదాతగా భారతీయులకు చిరస్మరణీయుడు.

గోదావరి ప్రజల కన్నీటి గాధ

పశ్చిమ కనుమల్లో పుట్టిన గోదావరి తెలంగాణాలో ప్రవహిస్తే భద్రాచలం వద్ద గోదావరి జిల్లాలో ప్రవేశిస్తున్నది. నాడు యీ జిల్లా పేరు గోదావరి కాదు. రాజమండ్రి పాపికొండల మధ్య ప్రవహించి, ధవళేశ్వరం వద్ద రెండుగా చీలి, బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ విధంగా ప్రవహిస్తున్న గోదావరిని ప్రజలు అనాదిగా పూజించారు. పవిత్రంగా చూశారేగాని, నిస్సహాయంగానే ఉండిపోయారు. 1831లో అతివృష్టి,1832లో తుఫాను వచ్చి అల్లకల్లోలం చేయగా 1833లో గుంటూరు కరువు వచ్చి ప్రజల్ని మాడ్చేసింది. ఆ కరువులో తాళలేక గోదావరి-ప్రజల్లో చాలామంది మూటాముల్లె కట్టుకొని దక్షిణాదికి తరలివెళ్ళారు. ఉన్నవారు లేనివారినే తరతమ భేదం లేకుండా సాగిన యీ ప్రయాణాల్లో జిల్లా మొత్తం మీద ప్రతి నలుగురిలో ఒక్కరు గతించారు. ఎంత దారుణమైన కరువంటే ఆడపిల్లల్ని కొందరు హైదరాబాద్ కు అమ్ముకున్నారు. ఊళ్లోగుండా ధాన్యం పోవాలంటే పోలీస్ బందోబస్తుతో తప్ప సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వం ఏదో పేరుకి చెరువులు త్రవించే పనులు చేయించినా అవి అంతగా ఉపకరించలేదు. రోడ్లన్నీ శ్మశానాలుగా మారిన నాటి దృశ్యాలు బ్రిటిష్ చరిత్రకారులు సైతం ప్రస్తావించక తప్పలేదు. (మోరిస్ వ్రాసిన హిస్టరీ ఆఫ్ గోదావరి చూడండి.) ఈ కరువునుండి కొంచెం తేరుకునేసరికి 1839లో మళ్ళీ పెనుతుఫాను వచ్చి దెబ్బతీసింది.

మూతపడిన ప్రత్తి మిల్లులు

గోదావరి ప్రాంతంలో నాడు ప్రత్తి విరివిగా పండించేవారు. మిల్లులు స్థాపించారు. కాని యింతకంటే చౌకగా బట్టలు ఉత్పత్తిచేసే పద్ధతుల్ని బ్రిటిష్ వారు కనుగొన్నందున యిక్కడ మిల్లులు మూతపడ్డాయి. దీనితో ప్రత్తి జీవనాధారంగా కూడా పోయింది. అంతవరకు మిల్లులపై ఆధారపడేవారు కూడా భూముల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. భూముల ఫలసాయం దైవాధీనంగా ఉన్నది. జిల్లాలో ప్రభుత్వాదాయం కూడా క్షీణించింది. ప్రజలు క్షీణించారు. 1821 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,38,308 అయితే, రెండు దశాబ్దాల తరువాత 1841 లెక్కల ప్రకారం 5,61,041 అని తేలింది. దీన్ని బట్టి కరువుల బారికి ఎందరు గురైనారో వూహించవచ్చు. గ్రామాల్లో అమరకపు వ్యవసాయ పద్ధతి ననుసరించి, భూమి అంతా ఎవరో ఒక పెద్దమనిషి స్వీకరించి, కౌళ్ళకిచ్చి శిస్తు వసూలు గావించి ప్రభుత్వానికి యిస్తుండేవారు. అందుకెవరూ సాహసించటం లేదు. తహసిల్దారు బలవంతముగా ఎవరో ఒకరికి అంటగడుతుండేవాడు.

ఆ పరిస్థితిని పరిశీలించమని మద్రాసునుండి మౌంట్ మోరి అనే అతన్ని పంపించారు.