పుట:Abaddhala veta revised.pdf/326

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యంగా చనిపోయినవారి పేరు చెప్పుకుని బతికేవారికి నిశితపరిశీలన అంటే బొత్తిగా గిట్టదు. టంగుటూరి ప్రకాశం గారి విషయంలో ఇదే జరుగుతోంది.

1872లో నేటి ప్రకాశం జిల్లా కనపర్తి గ్రామంలో సనాతన కుటుంబానికి చెందిన నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ప్రకాశం. ఒక విధంగా వీరిది "బతికిచెడిన" కుటుంబం. తాతతండ్రులు బాగా ఆస్తిపాస్తులు అనుభవించినా ప్రకాశం మాత్రం చిన్ననాటినుండీ పేదరికం చవిచూచాడు. నాయుడుపేట, ఒంగోలులలో ప్రకాశం మాత్రం చిన్ననాటినుండీ పేదరికం చవిచూచాడు. నాయుడుపేట, ఒంగోలులలో ప్రకాశం చదువుకుంటున్న రోజుల్లో రౌడీల స్నేహంతో దొంగతనం చేసే వరకూ సాహసించాడు కాసూరి రంగడు, నవులూరి రమణయ్య మొదలైన రౌడీలే ఆనాడు ప్రకాశానికి స్నేహితులు. బజార్లో అమ్ముకునేవాళ్ళ దగ్గరా, పంటపొలాలమీదా దొంగతనాలు చేసేవారు. దీని వలన ప్రకాశానికి ఆ వయసులోనే సాహసం, నిర్భీతి అనే లక్షణాలు వచ్చాయి. డబ్బుకు ఎప్పుడూ ఎవరో ఒకరిని కొట్టితెచ్చుకుంటే సరిపోతుందనే భావం చిన్ననాడే ఏర్పడింది.

గాంధీజీకి హైస్కూలు చదువు రోజుల్లో ముస్లీం రౌడీ స్నేహితుడు తగిలినట్లే, ప్రకాశం గారికి నాటక వేషాల సందర్భంగా ఉండదల్లీ సాహేబుతో సహా అనేక మంది ముస్లిం మిత్రుల సాంగత్యం అబ్బింది. అనేక నాటకాలలో ఆడ పాత్రలు కూడా ధరించిన ప్రకాశం ఆ అలవాట్లను రాజమండ్రిలో కూడా కొనసాగించాడు. ఆ కారణంగా 15వ ఏట మెట్రిక్ తప్పాడు. ప్రైవేటుగా మెట్రిక్ పాస్ అయినా చెడిపోతున్నాడనే భయంతో 18వ ఏట హనుమాయమ్మతో అద్దంకిలో పెళ్ళి చేశారు. కాని "స్త్రీ చాపల్యంవల్ల సంసారజీవితంలో సౌఖ్యంలేద"ని ప్రకాశం నిజం ఒప్పేసుకున్నాడు. (నా జీవితయాత్ర పేజీ 126) ప్రకాశం 19వ ఏట ఎఫ్.ఎ.పాసై మద్రాసు వెళ్ళి 'లా' చదివాడు. 1894లో రాజమండ్రి లో ప్రాక్టీసు మొదలుపెట్టి, మూడుసార్లు ప్రయత్నించి ఓడిపోయి,1899లో తొలిసారిగా నెగ్గాడు. మునిసిపాలిటీ రాజకీయాలు నాడూనేడూ ఒకేరీతిలో వున్నాయి. 30ఏళ్ళకు రాజమండ్రి మునిసిపల్ ఛైర్మన్ అయిన ప్రకాశం, ప్లీడర్ వృత్తి సాగిస్తూ క్రిమినల్ కేసులలో రాణిస్తుండేవాడు.

రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం అప్పటికే సంస్కరణోద్యమంలో, సమాజ ఛాందసాలకు ఎదురీదుతూ అష్టకష్టాలు పడుతుండేవాడు. ప్రకాశం అక్కడేవున్నా, వీరేశలింగంపై గౌరవం వుందని వ్రాసుకున్నా, ఆచరణలో అందు కనుగుణమైన పనులు చేసినట్లు ఎక్కడా గోచరించదు. పైగా తమ్ముడు శ్రీరాములు కోసం వీరేశలింగంపై కేసులో వాదించి, వృత్తిధర్మం అని చెప్పుకున్నాడు,ప్రకాశం.

మునిసిపల్ రాజకీయాలకూ, సంస్కరణవాదానికీ పొత్తు కుదరలేదు. కాని ఇంగ్లండ్ లో బారిస్టర్ చదివి తిరిగివచ్చినప్పుడు మాత్రం అందరిలా ప్రాయశ్చిత్తం చేసుకోడానికి నిరాకరించిన ప్రకాశం, మొండిధైర్యం ప్రదర్శించాడు.