పుట:Abaddhala veta revised.pdf/321

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రామస్వామి పద్యాలు వినిపించి, విప్లవబీజాలు నాటి ఒకనాటి రాత్రి పిలక కత్తిరించిన చిలిపి గోపాల కృష్ణమూర్తి. యధార్థ సాహిత్య సమితి స్థాపించి గ్రాంధిక వాదానికి మద్దత్తుగా రచనలు సాగించాడు. ఆ తర్వాత, సిద్ధాంతంలో వ్యతిరేక సిద్ధాంతం పుట్టినట్లు, పచ్చి వాడుకభాషా వాదిగా, తన పేరును 'క్రుష్నమూర్తి' అని వ్రాసుకున్నాడు. ఆ తర్వాత ఎం.ఎన్.రాయ్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, 'ఇండిపెండెంట్ ఇండియా' దినపత్రిక తెప్పించి, గుంటూరులో అమ్మిన ఘట్టాలు కేవలం తలపులుగా నిలిచిపోయినయ్. లక్నోలో ఎం.ఏ., ఎల్.ఎల్.బి., చదువుతుండగా రాయ్, బోస్ ప్రభృతులతో పరిచయమైంది. ఆవుల దృష్టిలో బోస్ 'సోషల్ ఫాసిస్టు' కాగా, రాయ్ తాత్త్విక విప్లవమూర్తిగా సన్నిహితత్వం వల్ల గ్రహించగలిగాడు. నేషనల్ హెరాల్డ్ లో వ్యాసాలు వ్రాయటంతో పత్రికా రచనలోకి దిగాడు. అప్పటి గోపాలకృష్ణమూర్తి తేడాగల రాయిస్టు. చివరివరకూ అలాగే వున్నాడు. తేడా గల రాయిస్టుగా వుండగలగటమే ఆయన వ్యక్తిత్వ విశిష్టత.

విద్యాభ్యాసానంతరం కొద్దిమాసాలు మాత్రం మద్రాసులో, తర్వాత గుంటూరులో న్యాయవాదవృత్తి అభ్యసిస్తూ, చివరకు తెనాలిలో స్థిరపడ్డాడు. ఆంధ్ర రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా సన్నిహితులనుండిగూడా ఫిర్యాదులు తెచ్చుకొని, విచారణకు ధైర్యంగా నిలబడి, వ్యక్తి స్వేచ్ఛను నిలబెట్టుకున్నాడు. ఆనాటి గోపాల కృష్ణమూర్తి ఉద్రేకి, వుద్వేగి. తీవ్రంగా వ్రాసేవాడు. కరకుగా ఉండేవి. గాంధీని గురించి వ్రాస్తే, ఆప్తమిత్రులే సహించలేకపోయారు. 1942లో రాడికల్ పత్రిక స్థాపించి, పార్టీ పత్రికగా నడిపారు. సమకాలీన సిద్ధాంతాల్ని వెంటనే అర్థం చేసుకుని, అన్వయీకరణ గావించి, తెలుగులో విడమరచి చెప్పగలగటం గోపాల కృష్ణమూర్తికి అబ్బిన విద్య. అందుకే ఆంధ్రలో ఎం.ఎన్.రాయ్ కు భాష్యకారుడు కాగలిగాడు. బహుశ అధ్యయన శిబిరాల్లో 'పీఠాధిపతి'గా యితరులు ముద్రవేయటానికి కూడా యిదే కారణమనుకోవచ్చు. త్రిపురనేని రామస్వామిచేత రాయ్ గ్రంథాలు చదివించి, మెప్పించాడు. ఆంధ్ర నుండి వచ్చిన ఫిర్యాదుల నాధారంగా రాయ్ ఎడముఖంగా వుంటే, తానూ పెడముఖం పెట్టి, చివరకు రాయ్ రాజీకి వచ్చేట్లు ప్రవర్తించిన పట్టుదల; కొరియా యుద్ధం వంటి సమస్యలలో 'నీకింకా కమ్యూనిస్టు మనస్తత్వం వదలలేదని' రాయ్ ని ముఖాన కొట్టినట్లు అనగల సాహసోపేత భావుకుడు మూర్తి. అందుకే తేడాగల రాయిస్టు. రాయ్ పార్టీని రద్దుచెయ్యాలనే తీర్మానాన్ని బలపరచి భావగమన వేగాన్నందుకున్న ఆలోచనాపరుడు. క్రమేణా పలుకులో పరుషం సడలించి, మాధుర్యం పెంచి, వ్రాతలలో 'పోలీసు దెబ్బల' తీరును సాగించాడు. వివిధ రంగాలలో పునర్వికాసోద్యమాన్ని నడిపే యత్నంలో నిర్విరామ కృషి చేసి, అనారోగ్యానికి పునాదులు వేసుకున్నాడు. అవసరమొచ్చినప్పుడు జారుకునే మిత్రులనబడే వారిమధ్య, ఆషాడభూతులుచుట్టూ క్రమ్మిన వాతావరణాన్ని నిబ్బరంగా ఆకళింపుజేసుకొని, ఎన్నో మానసిక వైవిధ్యాల నెదుర్కొంటూ,గజ గమనం సాగించాడు. 1954లో తెనాలి పురపాలక సంఘాధ్యక్షుడుగా కొద్దికాలంపాటు నిర్మాణాత్మక ప్రజాస్వామ్యం ఆచరించ ప్రయత్నించి,కొంత సఫలత కొంత విఫలత పొందాడు. మానసికంగా ఒక్కొక్క మెట్టెక్కుతూ, తామర తంపరగా మాజీ మిత్రులను తయారుచేసాడు. ఆయన 'చుట్టూ ప్రపంచంలో' పత్రికా