పుట:Abaddhala veta revised.pdf/314

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దిట్ట. ముప్పయ్యవయేట నరాల జబ్బులను కుదిర్చే డాక్టర్ గా జీవితాన్ని ఆరంభించిన ఫ్రాయిడ్ అనువాదాలు, పుస్తక సమీక్షలు చేసేవాడు. విద్యుత్ చికిత్స, హిప్నాసిస్ (మోహనిద్ర) చికిత్సలు క్రమంగా విరమించి, కొత్త సిద్ధాంతంతో, సరికొత్త పదజాలంతో ఫ్రాయిడ్ తన ప్రాక్టీసు అవతారాన్నే మార్చేశాడు.అతన్ని ప్రపంచం గుర్తించింది. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం రావడానికి ముందు జోసఫ్ బ్రాయర్(1842-1925) చికిత్స ప్రభావం వుండేది. దీనిని కథార్ సిస్ అనేవారు. ఇది కేవలం రోగితో సంభాషించడం.గ్రీక్ పదం కథార్ సిస్ కు చికిత్సలో చేర్చుకున్నారు.

రోగిని ఒక పడక కుర్చీపై ఆసీనులయ్యేటట్లు చేసి, మాట్లాడుతూ, వింటూ పోవడం యీ కథారసిస్ చికిత్స ప్రత్యేకత. పడుకున్న రోగి పక్కనే డాక్టరు కూర్చొని, ఒకానొక లక్షణంపై ఆలోచన నిలిపి, అందుకు సంబంధించిన పాత జ్ఞాపకాలన్నిటినీ చెబుతూ పొమ్మంటారు. ఆలోచనలకూ రోగానికీ సంబంధం చూడడం యీ చికిత్సలో ప్రధానాంశం. ఈ విధంగా వివిధ పద్ధతులు ప్రయోగిస్తూ ఫ్రాయిడ్,1896లో మొదటిసారిగా సైకోఎనాలసిస్ అనే మాట వాడాడు. ఆ మాటే ప్రపంచ ప్రసిద్ధి చెంది, వాడుకలోకి వచ్చింది. దీనికి పితామహుడుగా ఫ్రాయిడ్ సుప్రసిద్ధుడయ్యాడు. సైకోఎనాలసిస్(మనోవిశ్లేషణ) ఒక ఉద్యమంగా తలెత్తింది. వివిధ దేశాలలో ఎందరో యీ చికిత్సను అనుసరించారు.

ఫ్రాయిడ్ జీవితంలో విలియం ప్లెస్(1858-1928)చాలా ముఖ్యుడు.అతనితో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాల వల్ల ఎన్నో లోతుపాతులు బయటపడ్డాయి. నరాల జబ్బుకు లైంగిక సంబంధమైన మూలం వున్నదని అతనివద్దే ఫ్రాయిడ్ గ్రహించాడు. సెక్స్ కారణాలుగా జబ్బులు వస్తాయని ఫ్రాయిడ్ అనేక ఉపమానాలు,కథలు,గ్రీకుగాథలు ఉదహరించి, విస్తారంగా వివరించాడు. పురుషులలో నరాల జబ్బు(న్యూరస్తేనియా) రావడానికి హస్తప్రయోగం కారణమని యిది యవ్వనారంభదశలో వస్తుందని అన్నాడు. యవ్వనదశలో స్త్రీలతో సంపర్కంగల పురుషులకు ఈ జబ్బు రాదన్నాడు. హస్తప్రయోగం వల్ల పిచ్చి వస్తుందనే నమ్మకం వైద్యరంగంలో ఫ్రాయిడ్ కాలం నాటికే బలపడి వుంది.

స్త్రీలలో హిస్టీరియాకు, నరాల జబ్బులకు యవ్వనారంభ దశలో బలవంతపు సెక్స్ ప్రయోగాలు కారణమని ఫ్రాయిడ్ అన్నాడు. పురుషులలో యవ్వనదశలో సెక్స్ ప్రయోగం రోగాన్ని రాకుండా చేస్తుంటే అదే సెక్స్ ప్రయోగం స్త్రీలలో రోగానికి దారితీస్తుందని ఫ్రాయిడ్ పరస్పర విరుద్ధనిర్ణయాలు చేశాడు.

ఫ్రాయిడ్ సెక్స్ సిద్ధాంతాలు ప్రపంచాన్ని బాగా ఆకర్షించాయి. తన సెక్స్ సిద్ధాంతాలకు తన సొంత అనుభవాలే కారణమని ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. సంభోగంలో రేతస్సు ముందుగానే పడిపోవడం, తృప్తిగా సంభోగం జరగకపోవడం రోగ లక్షణాలకు దారితీస్తున్నట్లు ఫ్రాయిడ్ చెప్పాడు. సుఖరోగాలను కూడా ఫ్రాయిడ్ తన సిద్ధాంతంలో స్వీకరించాడు. అలాంటి రోగాలను ఆపవచ్చుగాని, పూర్తిగా నయం చేయలేమన్నాడు. గనేరియా, సిఫిలిస్ వంటి లక్షణాలు దృష్టిలో