పుట:Abaddhala veta revised.pdf/303

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విధానమే. శాస్త్రీయ రుజువుల జోలికి పోకుండా పద ప్రయోగంతో మెదడులోని రీతుల్ని వర్ణించడమే ఫ్రాయిడ్ శాస్త్రీయ పద్ధతి. ప్లయిస్ కు రాసిన ఉత్తరాలలో ఫ్రాయిడ్ తన వైద్యరంగపు అసంతృప్తిని కప్పిపుచ్చి,పెద్ద మాటలతో నరాల జబ్బుల్ని చిత్రించడాన్ని గమనించవచ్చు. ప్రాక్టీస్ అంతగా లేని తనకు, చార్కాట్ పేరు బాగా అక్కరకొచ్చినట్లు ఫ్రాయిడ్ 1888 ఫిబ్రవరి 4న ప్లయిస్ కు రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు. రోగుల దగ్గరకు వెళ్ళడం, మాట్లాడడం అనేది నా వృత్తిలో ముఖ్య అంశం కాగా, నా కాలమంతా అలానే వృధా అవుతున్నదన్నాడు. వైద్యవృత్తిలో మరే రంగానికీ తాను అర్హుడిని కాదు గనుక నరాల జబ్బు చికిత్సకు పరిమితం గాక తప్పలేదన్నాడు. జనరల్ ప్రాక్టీసు చేయడానికి వయస్సు మించిపోయిందని అదంతా నేర్చుకునే వ్యవధి లేదన్నాడు. ఈ దృష్ట్యా నరాల జబ్బులపై ఫ్రాయిడ్ ద్రు ష్టి కేంద్రీకరించి, తన విధానాన్ని వ్యాప్తిలోకి తెచ్చాడు.

నరాల జబ్బుకు మూలం సెక్స్(లైంగిక)అని ఫ్రాయిడ్ అభిప్రాయపడడానికి చార్కాట్, బ్రాయర్, ప్లయిస్ లు తొలుత కారణం. ఒక్కసారి అలాంటి నిర్ధారణకు వచ్చిన తరువాత ఫ్రాయిడ్ యీ రంగంలో యింకా సాగదీశాడు. అతిగా సెక్స్ జీవనం గడపడం వల్ల న్యూరస్తేనియా అనే జబ్బు వస్తుందన్నాడు. ఫ్రాయిడ్ ఎప్పుడూ పోలికలు ఉపమానాలతో తప్ప, శాస్త్రీయ పరిశోధనతో నిర్ధారణకు రాలేదు. అతడి ఉపమానాలే జనాన్ని ఆకర్షించాయి. పురుషులలో న్యూరస్తేనియా అనే నరాల జబ్బు రావడానికి హస్తప్రయోగం ప్రధాన కారణం. కాగా, ఇది యవ్వనంలో బయటపడుతుందని ఫ్రాయిడ్ చెప్పాడు. హస్తప్రయోగం వలన పిచ్చి వస్తుందని ఆనాటి సైకియాట్రీ చెప్పింది. ఫ్రాయిడ్ ఇది పట్టించుకోలేదు. యవ్వనంలో స్త్రీతో సంబంధం వున్న పురుషులకు నరాలజబ్బు రాదన్నాడు. స్త్రీలలో యవ్వనంలో లైంగిక సంబంధాలు నరాల జబ్బుకు దారితీస్తుందన్నాడు. అంటే స్త్రీలకు ఒక రకంగానూ పురుషులకు మరో విధంగానూ అతడు రోగనిర్ధారణ చేశాడన్న మాట. లైంగిక సంబంధమైన విషయాలలో ఫ్రాయిడ్ తన అనుభవాల రీత్యా సిద్ధాంతీకరించినట్లు కూడా రాసుకున్నడు. నరాల జబ్బుకు మరో కారణం కూడా ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. సంభోగం సంతృప్తిగా జరిగినప్పుడు నరాల జబ్బుకు దారితీస్తుందని, ఇది పూర్తిగా నయం చేయలేకపోయినా, కొంతవరకు ఆపవచ్చునన్నాడు. సుఖరోగాలైన సిఫిలిస్, గనేరియాను దృష్టిలో పెట్టుకొని యిలా చెప్పాడు. లైంగిక కారణాలుగా నరాల జబ్బు వస్తుందని ఫ్రాయిడ్ చెప్పడంలో ఉపమానాల ప్రాధాన్యతే తప్ప, శాస్త్రీయా పరిశోధన, నిర్ధారణ ఏదీ లేదు.

సైకో ఎనాలసిస్ పేరిట ఫ్రాయిడ్ రాయదలచిందంతా 1906 లోపు రాశాడు. హిస్టీరియా, కలలు, అణచిపెట్టే భావాలు, చిన్నప్పటి లైంగికం, అచేతన అవస్త గురించి ఫ్రాయిడ్ అభిప్రాయాలు లోకానికి తెలిశాయి. ప్రపంచం వీటిని చర్చించింది. ఫ్రాయిడ్ కు వ్యతిరేకత,అనుకూలత వెల్లడైంది. ఫ్రాయిడ్ పేర్కొన్న రంగంలో శాస్త్రీయ పరిశోధన జరగనందున క్రమపద్ధతిలో భిన్న భావాలు వ్యక్తమయ్యే అవకాశం అప్పట్లో లేదు కనుక ఫ్రాయిడ్ చెప్పింది జనాకర్షణ పొందింది.