పుట:Abaddhala veta revised.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయస్కాంత రాళ్ళకు తిలోదకాలిచ్చాడు. ఆ తరువాత తమ మాటల మూటలతోనే చికిత్సకు ఉపక్రమించి కొనసాగించాడు.

ఆనాటి శాస్త్రజ్ఞుడు మెస్మర్ చికిత్సను శాస్త్రీయం కాదని ఖండించారు. అయస్కాంత ప్రభావ పరిమితులు శాస్త్రజ్ఞులకు తెలుసు. కాని నయమైనదని చెప్పే రోగుల సాక్ష్యాలను మెస్మర్ వాడుకొని, తన చికిత్సను అలాగే చనిపోయేవరకూ చేశాడు. కనుకట్టు విద్యగా అది ప్రచారంలోకి వచ్చింది.

అయస్కాంత ప్రభావం శరీరంలోని అన్ని భాగాలలో వ్యాపింవి ఉంటుందనీ, నరాలపై దీని ప్రభావం పడుతుందనీ 1775లో మెస్మర్ ఒక వైద్యుడికి రాశాడు. పశువుల అయస్కాంతం కూడా వున్నదని మెస్మర్ నమ్మాడు. మూర్చలు, ఉదాశీనత, మంకు మొదలైన లక్షణాలు నయంచేసే అయస్కాంత పరిశోధనలు చేస్తున్నట్లు మెస్మర్ పేర్కొన్నాడు. సూచన (Suggestion) అనేది వైద్యంలో భాగంగా మారిందన్నమాట. నిజమైన శారీరిక రుగ్మతలు వుంటే మెస్మర్ చికిత్సకు స్వీకరించేవాడు కాదు. తనకేవో జబ్బు లక్షణాలున్నాయని భ్రమించేవారినే మెస్మర్ తీసుకునేవాడు. నరాల జబ్బున్న వారినే తాను చికిత్సను చేర్చుకుంటానని మెస్మర్ స్పష్టం చేశాడు. అక్కడే అతడి కిటుకు పనిచేసింది. ఇదే మెస్మరిజంలో ఆకర్షణ. శరీరాన్ని బాధిస్తూ పైకి కనిపించే రోగలక్షణాలు అయస్కాంత చికిత్సకు పనికి రావన్నాడు. మాటలు, ఉపమానాలు సూచనలుగా పనిచేస్తాయని, అవి నరాల జబ్బున్న మానసిక రోగులకే పరిమితం అని మెస్మర్ వాదన!

హస్తలాఘవం, కనికట్టు, మాటల ఉపమానాలు అనేవి మెస్మర్ ప్రయోగించిన ఆయుధాలన్నమాట. రోగంతో బాధ వున్నట్లు చెప్పే శారీరిక బాగాల్ని మెస్మర్ తాకి నిమిరేవాడు. ఆ విధం నయమైతే అది వైద్యమే ననేవాడు. అదే చేతి చలవ (అయస్కాంత ప్రభావం) అనేవాడు. తన అబద్ధాలను తానే నమ్మడం, ప్రచారం చేయడం, రోగుల్ని నమ్మించడం మెస్మర్ పనిగా కొనసాగించాడు. ఖనిజ సంబంధమైన అయస్కాంతం రోగిని నయం చేస్తుందనకుండా, అయస్కాంత ప్రభావం వేరే వుందని మెస్మర్ అనేవాడు. మనుషుల్లో మార్మికంగా అయస్కాంతశక్తి గర్భితమై వుందన్నాడు.

ఆనాటి శాస్త్రజ్ఞులు మెస్మర్ ను తీవ్రంగా ఖండించారు. పశు అయస్కాంతం అనే పేరిట మెస్మర్ ప్రచారంలో పెట్టిన భావనకు ఆధారాలేవీ లేవన్నారు. అయస్కాంత రాళ్ళకు బదులు, అయస్కాంత ప్రభావం గల చేతిస్పర్శ మెస్మర్ ఆకర్షణగా ప్రచారంలోకి వచ్చింది.

నమ్మకంతో నయం అవుతుందనే వారికి మాటల ఆకర్షణ ప్రధాన లక్షణం. మెస్మర్ ఆనాడు ప్రయోగించింది అదే, మతపరంగా చేస్తున్నవారి ఆయుధమూ అదే. హోమియోవారు నేడుచేస్తున్నదీ ఇదే. కొంతవరకు ఆ నమ్మకం చికిత్సకారుల విచిత్ర వేషధారణ కూడా పనిచేస్తుంది. వారు వాడే కొన్ని వింత పరికరాలు కూడా దోహదం చేస్తాయి. నమ్మకం, భయం రోగిలో వుండగా అవే వైద్యుడికి అక్కరకు వస్తాయి.