పుట:Abaddhala veta revised.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామమోహన్ కులాన్ని, కులాచారాలను పాటించాడు. చనిపోయే వరకూ జంధ్యం వేసుకున్నాడు. ముగ్గురు భార్యలను, అందులోనూ బాల్యవివాహాలను చేసుకున్నాడు.

అనాటి హేతువాది, శాస్త్రీయ ఆలోచనాపరుడు అయిన డిరోజియోను రామమోహన్ వ్యతిరేకించాడు.

ఆంగ్లేయులను, ముస్లిం మాజీపాలకులను దృష్టిలో పెట్టుకుని జీవితమంతా ఫ్యూడల్ గా బ్రతికిన రామమోహన్ రాయ్ విశేషాలు ఇటీవల చాలా వెలుగులోకి వచ్చాయి. ఆయన ఇంగ్లీషు విద్య కావాలన్నా, సతీసహగమనం పోవాలన్నావాటి వెనుక ఇలాంటి ఉద్దేశాలున్నవి. అయినప్పటికీ సనాతనులపై పోరాడి కొంతవరకైనా కృషి సాగించాడని సరిపెట్టుకోవాల్సిందే.

ఉన్న మతాలు, దేవుళ్ళు చాలవన్నట్లు, బ్రహ్మసమాజాన్ని స్థాపించి, మానవుడిని సాంతంగా ఆలోచించే అవకాశం కోల్పోయేటట్లు రామమోహన్ చేశాడు. చరిత్రను నిశితంగా పరిశీలిస్తే ఇలాంటి సత్యాలు బయటపడుతున్నవి. అయినప్పటికీ గతంపట్ల మనం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించకపోతే, పునర్వికాసంరాదు, మనం ముందుకు పోలేం.

(నిరంజనధర్ కు కృతజ్ఞతతో)

- హేతువాది, ఏప్రిల్ 1987
మతరాజకీయ వ్యాపారంలో మదర్ తెరిసా

కేన్సర్ బాధ భరించలేక మూలుగుతుంటే, జీసస్ క్రీస్తు నిన్ను ముద్దెట్టుకుంటున్నాడని మదర్ తెరిసా అన్నది. అందుకు బదులుగా ఆ వ్యాధిగ్రస్తుడు, దయచేసి నన్ను ముద్దెట్టుకోవద్దని సిఫారసు చేయమని ఆమెను అడిగాడట.

ఇది జరిగింది కలకత్తాలోని మదర్ తెరిసా "పిల్లల ఆశ్రమం" లో. ఆమె నిర్వహించిన అనాథపిల్లల గృహాలలో పిల్లలకు రోగాలొస్తే, నయం కావడానికి మందులు వాడేవారు కాదు. ప్రార్థనలు చేసేవారు. అది వారి విశ్వాసం.

సుప్రసిద్ధ బ్రిటిష్ మెడికల్ మ్యాగజైన్ "లాన్సెట్" ఎడిటర్ రాబిన్ ఫాక్స్ స్వయంగా 1991లోనే కలకత్తాలో ఈ దృశ్యాలు చూచారు. అలాగే విశ్వవిఖ్యాత జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచెన్స్ కూడా స్వయంగా మదర్ తెరిసాను కలసి ఇలాంటి సంఘటనలు గ్రహించారు.

అయితే మదర్ తెరిసాకు గుండెపోటు వస్తే, ప్రార్థన చేస్తూ, జీసస్ క్రీస్తు ముద్దుపెట్టుకున్నాడని అనుకుని సరిపెట్టుకున్నారా? స్టార్ హోటళ్ళ వంటి కార్పొరేట్ ఆస్పత్రులలో చేర్చారు. ఏమిటీ విచక్షణ? అలాంటి ప్రశ్నలు "భారతరత్న" మదర్ తెరిసా గురించి వేయకూడదంతే.

మదర్ తెరిసా పేరుమార్చి,ఊరుమార్చి పోప్ దృష్టి ఆకర్షించి, నోబెల్ ప్రైజ్ గ్రహించింది.