పుట:Abaddhala veta revised.pdf/287

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రంగపూర్ లో వుండగా ఒక ముస్లిం స్త్రీతో రామమోహన్ తాంత్రిక విద్యను ఆచరించాదడు. హరిహరానందుడి ప్రభావం క్రింద యిది జరిగింది. తాంత్రిక విద్యలో రామమోహన్ కు దీక్ష యిచ్చింది హరిహరానందుడే.

ఫోర్డ్ విలియం కాలేజీలో రామమోహన్ చదువుతుండగా డిగ్ బీ అనే ఆంగ్లేయుడు పరిచయమైనాడు. రాంపూర్ లో డిగ్ బీ అధికారిగా నియమితుడై రామమోహన్ కు ఉద్యోగం యిచ్చాడు. రెవిన్యూ శాఖలో దివాన్ గా చేరిన రామమోహన్, డిగ్ బీ లైబ్రరీ ఆధారంగా ఇంగ్లీషు పుస్తకాలు చదివాడు. ఇక్కడే ఆంగ్ల గ్రంథాల లిబరల్ ఆలోచన వలన ప్రభావితుడైనాడు, అయితే హేతువాదాన్ని ఆమోదించక, మతపరమైన విషయాలను అర్థం చేసుకోడానికి హేతువు తోడ్పడదని రామమోహన్ వ్రాశాడు. దైవసాక్షాత్కారం వంటివాటిలో అతడికి నమ్మకం వున్నది.

రామమోహన్ ను ఇంగ్లీషు పాలకులు బాగా వాడుకున్నారు. కూచ్ బీహార్, భూటాన్ రాజులకు వచ్చిన సరిహద్దు తగాదాలు తీర్చడానికి 1809, 1811, 1815 లో రామమోహన్ ఆ ప్రాంతాలకు వెళ్ళాడు, భూటాన్ రాజు నేపాల్ ను సమర్ధిస్తున్నందున, అతన్ని ఆకట్టుకోడానికి బ్రిటిష్ వారు రామమోహన్ ను వినియోగించారు. భూటాన్ రాజుకు విలువైన బహుమతుల్ని రామమోహన్ ద్వారా బ్రిటిష్ వారు పంపారు. నేపాల్ ను బలపరచకుండా భూటాన్ రాజును మళ్ళించడంలో రామమోహన్ సఫలీకృతుడైనాడు.

ఫ్రెంచివిప్లవంతో ఉత్తేజితుడైన రామమోహన్, ఆ భావాలను ఇండియాకు అన్వయించదలచలేదు. బ్రిటీష్ సామ్రాజ్యం ఇండియాలో సుస్థిరంగా వుండడానికి యధాశక్తి కృషిచేశాడు.

పాట్నాలో వుండగా టిబెట్ లామాల గురించి, బుద్ధిజాన్ని గురించి తెలుసుకొని, ఉత్తరోత్తరా రామమోహన్ టిబెట్ వెళ్ళివచ్చాడు. 1788-90 ప్రాంతాల్లో యీ ప్రయాణం చేశాడు.

సతీసహగమనం - రామమోహన్ పాత్ర

1812లో తన పెద్దన్న భార్య అలకామంజరి భర్త చితిపై చనిపోవడం చూచి, సతీసహగమన అలవాటును మాన్పించాలని కంకణం కట్టుకున్నాడని ఒక కథ ప్రచారంలో వున్నది. అన్న జగన్ మోహన్ చనిపోయినప్పుడు రామమోహన్ అక్కడలేదు. ఈ ఉద్యమాన్నీ తరువాత ఆరేళ్ళకు,అంటే 1818లో గాని రామమోహన్ ఆరంభించలేదు. ఆయన గురువు హరిహరానంద ముందుగా సతీసహగమనాన్ని నిరసిస్తూ ఇండియా గజట్ లో వ్రాశాడు. (1818 మార్చి 27) తాంత్రికులు సతీసహగమనాన్ని వ్యతిరేకిస్తారు. ఆ సంప్రదాయంలో రామమోహన్ వచ్చాడు. బ్రిటీష్ వారు, క్రైస్తవమిషనరీలు అంతకు ముందు యీ అమానుష ఆచారాన్ని వ్యతిరేకించారు. సతీసహగమన విషయమై రామమోహన్ రచనల్ని చదివిన బెంటింగ్, కలకత్తాలో ఆయన్ను సంప్రదించిన మాట వాస్తవం. అంతేగాని యీ ఉద్యమాన్ని ప్రారంభించింది రామమోహన్ కాదు. సాంఘిక ఆచారాలలో కూడా రామమోహన్ అభ్యుదయవాదికాదు.