పుట:Abaddhala veta revised.pdf/285

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కూడబెట్టిన ధనంతో భూములు కొంటూపోయాడు. శాశ్వత కౌలుదారీ విధానం క్రింద భూములకు విలువ పెరిగింది. ఆ దృష్ట్యా అప్పులపాలైన జమీందార్ల నుండి గ్రామాలకు గ్రామాలే రామమోహన్ కొనేశాడు. 1799 జులైలో జహనాబాద్ పరగణలోని గోవిందపూర్ ను గంగాధర్ఘోష్ వద్ద 3100 రూపాయలు యిచ్చి కొనేశాడు. చంద్రకోన పరగణాలోని రామేశ్వరపూర్ ను రాంతనూరాయ్ వద్ద 1250 రూపాయలకు కొన్నాడు. 1903లో లాంగులాపురాను,1809లో శ్రీరాంపూర్, కృష్ణనగర్ లను కొన్నాడు. కలకత్తా, హుగ్లీ, రంగపూర్ లలో గృహాలు నిర్మించాడు.

జమీందారుగా మారిన రామమోహన్ కు మంచి పేరు రాలేదు. ప్రజల్ని అణచివేస్తాడని ప్రతీతి తెచ్చుకున్నాడు. రాంనగర్ వాసి రాంజోయ్ వాతవ్యాల్ హుగ్లీ కోర్టులో దావావేసి, తన తోట, పొలాన్ని దోచుకున్నందుకు రామమోహన్ పై కేసుపెట్టాడు. అందుకు కోర్టు రామమోహన్ కు డబ్బు చెల్లించమని శిక్ష వేసింది. 2092 రూపాయలు చెల్లించవలసి వచ్చింది. రామమోహన్ చేసిన క్రూర హింసాత్మక చర్యలన్నీ అతని సేవకుడు జగన్నాధమజుందార్ జరిపినవే.

దారుణంగా రైతుల్ని అణచివేస్తూ, అక్రమంగా భూముల్ని ఆక్రమించుకున్న జమీందార్లను వెనకేసుకొని రామమోహన్ ప్రభుత్వానికి దరఖాస్తులు, ఆర్జీలు పెడుతుండేవాడు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలలోని జమీందార్ల పక్షాన అలా పెట్టిన ఆర్జీని బ్రిటీష్ కంపెనీ వారు 1829 సెప్టెంబరు 29న నిరాకరించిన ఘట్టం లేకపోలేదు. (ఏషియాటిక్ ఇంటెలిజెన్స్ 1830 పుట 203-205) ఇంగ్లండ్ లో కూడా జమీందార్ల పక్షాన విఫల పోరాటం జరిపాడు. కరపత్రాలు ప్రచురించాడు.

నీలిమందు తయారుచేసే నిమిత్తం భూములు సంపాదించే అవకాశం బ్రిటిష్ వారికి కూడా వుండాలని రామమోహన్ పోరాడి, బ్రిటిష్ వారి మన్ననలు పొందాడు. దేశీయ జమీందార్ల దోపిడీకి జతగా బ్రిటీష్ జమీందార్లు కూడా చేరడానికి రామమోహన్ బాగా తోడ్పడ్డారు.

బ్రిటిష్ వారు యధేచ్ఛగా వ్యాపరం చేసుకోవాలని కూడా రామమోహన్ కోరాడు. దేశీయ పరిశ్రమలు, కళలు నాశనమైనప్పటికీ, కళాకారులకు బ్రిటీష్ కంపెనీలలో ఉద్యోగాలు, జీతాలు బాగా లభిస్తాయన్నాడు. ఇటలీ, గ్రీసు, స్పెయిన్ దేశాల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కోరిన రామమోహన్ ఇండియాలో బ్రిటిష్ పాలకులు బాగా స్థిరపడి పాలించడానికి మద్దత్తు యిచ్చాడు.

ఢిల్లీలో నామమాత్రంగా బ్రతుకుతున్న మొగల్ చక్రవర్తికి బ్రిటిష్ వారిచ్చే భరణం చాలనందున, అది పెంచమని కోరడానికి రామమోహన్ ను ఇంగ్లండు వెళ్ళమన్నారు. దీనికి ఆయన అంగీకరించాడు. ఇంగ్లండు వెడితే గౌరవంగా వుండాలనే దృష్టితో 1829 ఆగస్టులో 'రాజా' అనే బిరుదును మొగల్ చక్రవర్తి ప్రసాదించాడు. సాలీనా 4 వేల పౌండ్ల ఆదాయం లభించే ఒక జాగీర్ కూడా రామమోహన్ కు యిచ్చాడు. ఆ విధంగా రామమోహన్ మొగలాయి చక్రవర్తి కోసం, ఆయన ఖర్చులతో ఇంగ్లండు వెళ్ళాడే తప్ప, అందరూ భ్రమిస్తున్నట్లు సతీసహగమన నిషేధానికి కాదు!