పుట:Abaddhala veta revised.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూడలి. బర్ద్వాన్-నీలాచలం మధ్య వున్న ఈ గ్రామం మీదుగా సాధువులు, సన్యాసులు తరచు పయనిస్తుండేవారు. వారు సమీప సత్రంలో విడిది చేస్తుండేవారు. ఆ విధంగా గదాధర్ సాధువులను చూస్తుండేవాడు. తన కుమారుడు సాధువుల్లో కలసిపోతాడేమోనని తల్లి చంద్రమణి భయపడుతుండేది.

గదాధర్ ఇంట్లో కొందరికి మూర్ఛల జబ్బు వుండేది. మేనత్త రాంషేకు, గదాధర్ సోదరి కాత్యాయనికి మూర్ఛలు వచ్చేవి. హిస్టీరియాతో కూడ ఈమె బాధపడుతుండేది. కారణాలేవైనా, గదాధర్ కు కూడా యీ జబ్బులు సంక్రమించాయి. గదాధర్ బక్కప్రాణి. చదువు ఒంటపట్టలేదు. గదాధర్ కు చిన్నతనంలో హఠాత్తుగా ఫిట్స్ రావడం, పడిపోవడం గమనించిన గ్రామస్తులు అతడికి వాయురోగం వచ్చిందన్నారు. కారుమబ్బుల మధ్య మెరుపులు చూచినప్పుడు తొలుత గదాధర్ మూర్ఛవచ్చి పడిపోయాడు. అనూర్ అనే గ్రామానికి స్త్రీల వెంట వెడుతుండగా రోడ్డుమీద రెండో పర్యాయం మూర్ఛ వచ్చింది. స్వగ్రామంలో శివుడుగా నటిస్తున్నప్పుడు మూడోసారి మూర్ఛ వచ్చింది. (మూర్ఛల వివరాలకు శారదానంద "లీలా ప్రసంగ" చూడండి. 5 సంపుటాలు)

చిన్నతనం నుంచీ గదాధర్ కు కామప్రవృత్తి, చింతన ఎక్కువగా వుండేది. గ్రామ స్త్రీలు స్నానంచేసేచోటుకు తరుచు వెళ్ళగా, ఆడవాళ్ళు అభ్యంతరపెట్టారు. చెట్టుచాటున దాగి స్నానంచేసే స్త్రీలను చూచేవాడు. అది గమనించిన స్త్రీలు గదాధర్ తల్లికి చెప్పారు. ఆమె గదాధర్ ని చితక్కొట్టింది. అయినా స్త్రీల సాంగత్యం అంటే గదాధర్ కు మక్కువ తగ్గలేదు. పెళ్ళీ చేసుకోవాలనుకున్నాడు. కబుర్లు చెప్పి, పాటలు పాడి స్త్రీలను ఆకర్షించేవాడు. స్త్రీ వేషాలు వేసేవాడు. ఎక్కువగా స్త్రీలమధ్య గడిపేవాడు.

విపరీత కామవాంఛను అణుచుకోటానికి గదాధర్ చేసిన ప్రయత్నం అతడిని మరింత రోగగ్రస్తుణ్ని చేసింది. శారదను పెళ్ళాడి కూడా ఆమెను తల్లిగా చూడాలని ప్రయత్నించాడు. స్త్రీని చూస్తేనే గదాధర్ కు కామవాంఛ కలిగేది. అది అణచుకోడానికి తీవ్రప్రయత్నం చేసి మరింత రోగగ్రస్తుడైనాడు. ప్రతి స్త్రీని తల్లిగా భావిస్తేగాని కామవాంఛ అణగిపోయేది కాదు. రానురాను కామాన్ని తగ్గించుకోలేక, మెడలో ఒక ఉచ్చును తగిలించుకొని, కోరిక కలిగినప్పుడు ఉచ్చు బిగించుకొనేవాడు. బాధ భరించలేక మూర్ఛపోయేవాడు. అదలా ఉంచండి.

జాన్ బజార్ జమీందారీ కుటుంబానికి చెందిన రాష్ మణి 9 లక్షల రూపాయలతో దక్షిణేశ్వర్ లో దేవాలయ సముదాయాన్ని నిర్మించింది. అందులో జగదాంబ విగ్రహప్రతిష్టాపన చేయించి, అన్న భోగం ఏర్పరచాలని, బ్రాహ్మణ పురోహితుడిని నియమించాలని తలపెట్టింది. ఆమె శూద్రకులానికి చెందినదిగావడంతో బ్రాహ్మణులెవరూ ముందుకు రాలేదు. గదాధర్ అన్న రాంకుమార్ ఆమెకు సలహాయిస్తూ దేవాలయాన్ని బ్రాహ్మణులకు యిచ్చేస్తే సమస్య పరిష్కారమౌతుందన్నాడు. ఆమె ఆ సలహాను పాటించి రాంకుమార్ నే పురోహితునిగా నియమించింది. అతని వెంట గదాధర్ కూడా వూరు విడిచి దక్షిణేశ్వరానికి వచ్చేశాడు. పల్లెటూరు