పుట:Abaddhala veta revised.pdf/270

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రదర్శించారు. అప్పుడు జరిగిన సభలో రామనాధపురం రాజాకు రాజర్షి బిరుదును వివేకానంద ప్రసాదించారు.

ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేయడంలో రామనాధ్ రాజా పెట్టింది పేరు. కరువు కాటకాలతో జనం విలపిస్తుంటే, విలాసజీవితం గడిపిన రామనాడ్ రాజా తెలివిగా తన ఆధ్యాత్మికతను, వివేకానందను అడ్డం పెట్టుకొని జనానికి చూపాడు. ఆధ్యాత్మికం అనగానే నోరు మూసుకొనే అమాయకుల్ని ఆకట్టుకోవడం రాజాలకు బాగా తెలుసు. ఆ తరువాత రాజాలందరూ మద్రాసులో వివేకానందకు ఘన స్వాగత సభ జరిపారు. గైక్వాడ్ మహారాజా స్వయంగా అధ్యక్షత వహించారు.

బెంగాల్ రాష్ట్రానికి వచ్చిన వివేకానందకు మళ్ళీ జమిందార్ల స్వాగతమే లభించింది. ఉత్తర పర రాజా (పియరి మోహన్ ముఖోపాధ్యాయ), సోవా బజార్ మహారాజా (బినాయ్ కృష్ణ దేవ్ బహుదూర్) దర్భంగా మహరాజా, మహరాజా నరేంద్ర కృష్ణ బహదూర్, మహరాజా గోవిందలాల్ రాయ్ బహదూర్ లు ఆహ్వానసంఘంగా ఏర్పడి స్వాగతం పలికారు. గ్వాలియర్ మహారాజా వచ్చి చేరారు.

డార్జిలింగ్ లో బర్ ద్వాన్ మహారాజా తన అంతఃపురాన్ని వివేకానంద సేవలకు యిచ్చారు. కాశ్మీర్ మహారాజా వివేకానంద గృహనిర్మాణానికి ఒక స్థలం కేటాయించారు. కలకత్తాలో జమిందార్లు విందులిచ్చారు. స్వదేశీ సంస్థానాలలో జమిందార్లు చూపిన ఆదరణ వివేకానంద కృతజ్ఞతలతో స్వీకరించారు.

1897లో రామకృష్ణ మఠం ఏర్పరచారు. జమిందార్ల డబ్బు పుష్కలంగా వచ్చి పడింది. వివేకానంద విలాస జీవితం, జమిందార్లతో స్నేహం రామకృష్ణ ఆశ్రమ సన్యాసులకు నచ్చలేదు. నిరసన తెలిపారు. బేలూరు మఠంతో సంబంధాలు తెంచుకొని పేదల రామకృష్ణ సభ ఏర్పరుచుకున్నారు. గిరీంద్ర, హరధకాలు యిందుకు ఆధ్వర్యం వహించారు. సంపన్నుల మఠానికి వివేకానంద ఆధిపత్యం వహించారన్నమాట. జమిందార్లు యీ చీలిక చూసి కలవరపడ్డారు. రామకృష్ణ జయంతి కూడా ఎవరికి వారే జరుపుకున్నారు. ఇదంతా వివేకానంద మూలంగానే జరిగిందని వేరే చెప్పనక్కరలేదు. పేదల కోసం ఎన్నో మాటలు చెప్పిన వివేకానంద, అప్పుడూ జమిందార్ల పక్షం వహించడమే యిందుకు మూలం అని గ్రహించాలి.

మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చిన వ్యక్తి వివేకానందుడే. జాతీయోద్యమకారులకు, బెంగాల్ విప్లవకారులకు ఆయన ఉత్తేజాన్నిచ్చాడు. బెంగాల్ లో ప్రారంభమైన సెక్యులర్, పాజిటివిస్ట్, హేతువాద ఉద్యమాలు కూడా వివేకానంద ఉద్రేక నినాదాలతో ఆగిపోయాయి. ఇండియా ఆధ్యాత్మికంగా గొప్పది గనుక పాశ్చాత్యుల నుండి నేర్చుకోవల్సిందేమీ లేదనే ధోరణికి ఆద్యుడు వివేకానందుడే. సైన్స్ వ్యాపించకపోడానికి, వివేచనతో ఆలోచించకపోడానికి, వివేకానందుడు ఆజ్యం పోశాడు.