పుట:Abaddhala veta revised.pdf/268

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చేశాడు. అమెరికా పర్యటనలో వివేకానంద హిందూ ప్రవక్తగా ప్రవచనాలు పలికాడు. అద్వైత వేదాంతాన్ని ఆచరణలోకి తేవాలని కొత్త పదాలతో భాష్యాలు చెప్పాడు.

క్రైస్తవ మత ప్రచారం, మిషనరీల సేవలు కూడా హిందూమతం అవలంబించేటట్లు వివేకానంద కృషిచేశాడు. అమెరికాలో అనేకమంది డబ్బు గుప్పించేశారు. మేరీ బర్క్ వంటివారు శిష్యులయ్యారు.

మనిషిలోని దైవశక్తిని గుర్తించాలని వివేకానంద నినదించాడు. మనిషి ఆశక్తిపై ఆధారపడాలన్నాడు. జతీయవాదులకు యిది కూడా చాలా ఆకర్షణీయంగా పరిణమించింది. సేవాభావాన్ని వివేకానంద భారతీయులకు బోధించాడు. ఇది క్రైస్తవం నుండి స్వీకరించి, వేదాంతానికి జోడించడం వివేకానంద గొప్పతనం. అమెరికాలో క్రైస్తవ మిషనరీలు, యూనిటేరియన్ శాఖతో బాగా పరిచయం చేసుకున్నాడు. షికాగో మతసభలో కొన్ని వ్యాసాలు కూడా ఆయనపై ప్రభావం చూపెట్టాయి. బోస్టన్ లో క్రైస్తవ క్లబ్ లో వివేకానంద ప్రసంగించారు. ఎపిస్కోపల్ చర్చ్ వారితో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. బాపిస్టు చర్చివారితో సన్నిహితత్వం పెంపొందించుకున్నాడు. ఇదంతా ప్రాక్టికల్ వేదాంత భావానికి, రామకృష్ణ మిషన్ స్థాపనకు దారి తీసింది. భారతదేశంలో హిందూమతం బాగా బ్రతకడానికి వేదాంత సోషలిజం పేరిట జనాన్ని ఆకట్టుకోదలచాడు. ప్రతి మనిషీ దేవుడే గనుక, మనిషిని ప్రేమిస్తే దైవాన్ని ప్రేమించినట్లే అని చెప్పాడు. మనిషికి సేవచేస్తే దైవసేవ చేసినట్లే అన్నాడు. భారతదేశం ఆధ్యాత్మికమనీ, పాశ్చాత్యలోకం భౌతికమనీ, కనుక వారందరికీ భారతదేశమే ఆధ్యాత్మికత చెప్పగలదనీ అన్నాడు. ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా జయించాలనే వివేకానంద హిందూ నెపోలియన్ అయ్యాడు. పాశ్చాత్య పదార్ధవాద వ్యామోహం కూడదన్నాడు. ఇది కూడా జాతీయవాదులకు మరింత ఉత్తేజాన్నిచ్చింది.

వివేకానంద భారత ఆధ్యాత్మికవాదాన్ని ఎం.యన్.రాయ్ ఉత్తరోత్తరా ఖండించారు. సోదాహరణగా, భారతదేశం కూడా పాశ్చాత్యలోకానికి ఏ మాత్రం తీసిపోని పదార్థ భౌతికవాదంతో వున్నదని చూపారు. డిరోజియా, రాం మోహన్ రాయ్ లు ఆరంభించిన పునర్వికాసోద్యమానికీ వివేకానంద అడ్డుకట్ట వేశాడు. పాశ్చాత్య లోకం నుండి సైంటిఫిక్ స్పిరిట్ నేర్చుకోవాలనే ధోరణికి వివేకానంద ప్రతిభందకమయ్యాడు. దేశాన్ని వెనక్కు నడిపించాడు. ఆయన ఆదర్శాలతో సాగిన జాతీయోద్యమం మానసికంగా, సామాజికంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయలేకపోయింది. కేవలం ఉద్రేకం మాత్రమే గాక, నమ్మకాన్ని జోడించి వివేకానంద వివేచనను చంపేశారు? చిత్తవృత్తి నిరోధం యోగానికి మూలం. అదే చిట్కాగా వివేకానంద స్వీకరించి, ఆకర్షణీయ కరపత్రాలు వ్రాసి ప్రచారం చేశారు. రాజయోగం పేరిట ఆయన రాసిన చిట్కాలు బాగా అమ్ముడుపోయాయి. డబ్బు వచ్చింది. గురువు లేకుండా యోగం అభ్యసించరాదంటూనే, అదొక చిట్కామార్గంగా రాజయోగం అనే పేరిట ప్రచారం చేయడం విశేషం.