పుట:Abaddhala veta revised.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యయనం చేయాలి. అప్పుడుగాని అసలు గాంధీ మనకు అర్థంకారు. గాంధీ జీవితంపై అనేక గ్రంథాలు వచ్చాయి. దేశ విదేశ రచయితలు ఎన్నో పుస్తకాలు రాశారు. ఇందులో ప్రసిద్ధులుకూడా కొందరున్నారు. గాంధీజీ రాసిన స్వీయ చరిత్ర ఆధారంగానే వీరిలో చాలా మంది తమ రచనలు చేశారు. అక్కడే వచ్చింది చిక్కు. గాంధీజీ సంపూర్ణ రచనలు వెలువడ్డాయి, సంపూర్ణ పరిశోధన మాత్రం యింతవరకూ వెలువడలేదు! "మహాత్మ" అని భావించిన వారు పరిశోధన చేయలేరు. గాంధీ తన తొలి జీవితాన్ని గురించి రాసిందే వీరుకూడా స్వీకరించారు. అయితే అందులో దోషం ఏమిటి? అనే ప్రశ్న రావచ్చు. ఇక్కడ ఆగి, "మహాత్మ" విషయం కొద్దిగా గమనిద్దాం.

"మహాత్మ" అనే బిరుదు నన్ను బాధపెడుతున్నది............నేను సంపూర్ణత్వాన్ని జీవితంలో ఎన్నడూ ఆపాదించుకోలేదు. నా సహచరులలో వున్న అపవిత్రత నాలోని దోషాన్ని సూచిస్తున్నది. "మహాత్మ" అనే మాట నాకు తిట్టుగా వుంటుంది-ఇదీ గాంధీజీ అభిప్రాయం. ఆ మాత్రం గ్రహింపు పరిశోధకులకు,రచయితలకు వుంటే యీ పాటికి స్వతంత్రంగా గాంధీజీ జీవిత చరిత్ర వచ్చివుండేదే.

1922లోనే సంపూర్ణ స్వరాజ్యం వస్తుందన్న గాంధీజీ, కేవలం తన మనస్సాక్షికి దైవం చెబుతున్న దృష్ట్యా అలా ఘంటాపధంగా చెప్పగలుగుతున్నామన్నారు. కాని, శాస్త్రీయాధారాలతో మనస్సాక్షి మాటల్ని పరిశీలించలేదు. స్వాతంత్రం 1922లో రాలేదు, హిమాలయాలంతటి తప్పుచేశానన్నాడు గాంధీజీ. కాని, అనుచరులు మాత్రం యింకా అలాంటి తప్పులుచేస్తూనే వున్నారు.

గాంధీజీ తన తొలి జీవిత వాస్తవాలు లండన్ డైరీ పేరిట ఇంగ్లీషులో రాశారు. 20 సంవత్సరాలు జాగ్రత్తగా అట్టిపెట్టి 1909లో 120 పేజీల లండన్ డైరీని తన బంధువు భగన్ లాల్ కు అప్పగించారు గాంధీ కార్యదర్శిగా సేవలు చేసిన మహదేవ దేశాయికి 1920లో అవి చేరాయి, ఉత్తరోత్తరా అది ప్యారీలాల్ కు చేరిందో లేదో తెలియదు. కాని,గాంధీజీ స్వయంగా నోట్ పుస్తకాలలో ఇంగ్లీషులో నిర్మొహమాటంగా రాసిన నిజాలు అదృశ్యమయ్యాయి కేవలం 20 పేజీలు అట్టిపెట్టి గాంధీజీ శీలాన్ని కాపాడదలచిన భక్తులు, మిగిలిన లండన్ డైరీని నామరూపాలు లేకుండా చేశారు. ఎందుకిలా జరిగింది? లండన్ లో విద్యార్థి జీవితాన్ని యధాతధంగా గాంధీ రాస్తే, భక్తులకు షాక్ కొట్టి అదంతా బయటకొస్తే కొంప మునుగుతుందని, రచన కనబడకుండా చేసి తృప్తిపడ్డారు! గాంధీజీకి సంబంధించిన నిజాలు నాశనం చేయడంలో ఆయన శిష్యులు ఎప్పటికప్పుడు తగిన పాత్ర వహిస్తూనే వున్నారు. మహాత్మగాంధీ రచనల సంపుటాలలో ఇట్లాగే కొన్ని వాస్తవాలను 1938లో నాశనంచేస్తే, గాంధీజీకి తెలిసికూడా వూరుకున్నారు!

లండన్ డైరీలో మిగిలిన 20 పేజీల ఆధారంగా లండన్ ప్రయాణం గురించి కొన్ని వివరాలు లభిస్తున్నాయి, దక్షిణాఫ్రికా గురించి 30 ఏళ్ళ తరువాత జ్ఞాపకం వున్నంతవరకూ గాంధీజీ రాస్తే, అదే మిగిలిన వారికి ఆధారమైంది.