పుట:Abaddhala veta revised.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రపంచ విషయాలపై అనేక ఫీచర్స్ నడిపింది. 1935 వరకూ అలా రాస్తూనే పోయింది. 1928 అక్టోబరు నుండి శాన్ ఫ్రాన్ సిస్కో కె.పి.ఓ. రేడియో నుండి ప్రతివారం ప్రపంచ విషయాలపై ప్రసారాలు, చర్చలు సాగించిన ఎవిలిన్ కార్యక్రమాలు బాగా ఆకర్షించాయి. న్యూయార్క్ లో మక్లూర్ న్యూస్ పేపర్ సిండికేట్ వారి నవలలకు ఎవిలిన్ సంపాదకురాలుగా పనిచేసింది. పాశ్చాత్య నృత్యంలో తొలి ప్రావీణ్యత పొందిన యాగ్నిస్ బూన్ అనే ఆమెను గురించి స్టాన్ ఫర్డ్ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ఎవిలిన్ మంచి వ్యాసం వ్రాసింది. ఎవిలిన్ అన్న వాల్టర్ ఎడ్విన్ న్యూయార్కులో వ్యాపారం చేస్తూ, రాయ్-ఎవిలిన్ తొలిపరిచయ రోజుల్లో విముఖంగా వున్నాడు. ఎవిలిన్ తిరిగి వచ్చిన తరువాత ఆయనలో మళ్ళీ సోదర సుహృద్భావంతో ఉత్తరాలు రాసి సత్సంబంధాలు నెలకొల్పింది.

ఎవిలిన్ తల్లిదండ్రులు వృద్ధులు కాగా విరామం విశ్రాంతి కోసం ఆబర్న్ (శాన్ ఫ్రాన్ సిస్కో దగ్గర) స్థిరపడ్డారు. ఎవిలిన్ వారితో అప్పుడప్పుడూ గడిపి శుశ్రూషలు చేసింది. న్యూయార్క్ లో స్థిరపడింది. సీరియస్ పనిచేబట్టాలని అవిలిన్ ఉద్దేశించింది. అందుకు పూనుకునే లోపే 1931 జులైలో ఎవిలిన్ తల్లి చనిపోయింది. అప్పటి నుండి తండ్రికి ఆసరాగా ఎవిలిన్ ఆబర్న్ లో వుండిపోయింది. అదే నెలలో ఎం.ఎన్.రాయ్ ను ఇండియాలో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఎవిలిన్ వెంటనే అరెస్టును ఖండిస్తూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తెగనాడుతూ రివల్యూషనరీ ఏజ్ పత్రిక (న్యూయార్క్)లో వ్యాసం రాసింది. 1931 అక్టోబరులో యీ వ్యాసం అచ్చయింది. దీనిని బట్టి అంతర్జాతీయ విషయాలలో బాగా శ్రద్ధ వహించిన ఎవిలిన్, రాయ్ పట్ల అభిమానంతో వున్నదని గ్రహించవచ్చు. అయితే ఎవిలిన్-రాయ్ ల మధ్య 1925 చివర నుండే ఉత్తర ప్రత్యుత్తరాలుగానీ, మరే విధమైన సంబంధాలుగానీ వున్నట్లు ఆధారాలు లభించలేదు. ఉభయులూ తమ విషయాలు ఎక్కడా ప్రస్తావించలేదు.

ఎం.ఎన్.రాయ్ పట్ల అమెరికాలో స్పందన

అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నత స్థాయికి చేరుకున్న ఎం.ఎన్.రాయ్ 1923 నుండీ స్టాలిన్ కు దూరమౌతువచ్చాడు. చైనాలో తన వైఫల్యాలకు స్టాలిన్ ఇతరులను కొరముట్లు చేసే ప్రయత్నం యిందుకు కారణం. ఇండియాలో అప్పటికే రాయ్ పరోక్షంలో ఆయనపై కుట్రకేసులు విచారణ చేసి,దొరికితే శిక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధంగా వుంది. అలాంటి తరుణంలో కె.సి.బెనర్జి అనే సి.ఐ.డి.ని కమ్యూనిస్టు విప్లవకారుడుగా నటించమని, అతడిని జైలులో పెట్టారు. తోటి విప్లవఖైదీల నుండి అతడు సమాచారం సేకరించాడు. అతడు పత్రికా విలేఖరులకు విడుదల చేసిన సమాచారం డిటెక్టివ్ కథవలె వుంది. దానికి విపరీత ప్రచారం లభించింది. వాస్తవాలు అబద్ధాలు కలిపి చేసిన కథనం పత్రికలకు మంచి ఆకర్షణీయంగా మారింది.