పుట:Abaddhala veta revised.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1921 మే 21న అలా రహస్యంగా, ఎలెన్ అనే మారుపేరుతో ఇంగ్లండ్ రాగానే పొలీసులు పట్టుకున్నారు. లోగడ ఎవిలిన్ మెక్సికో నుండి రష్యా వెళ్ళినప్పుడు, మెక్సికో పాస్ పోర్టు వున్న దృష్ట్యా మెక్సికో రాయబార కార్యాలయం వారు ఆమెను మెక్సికోవాసిగా గుర్తించారు. ఇంగ్లండ్ నుండి 1921 జూన్ 11న ఎవిలిన్ ను ప్లిమత్ రేవు నుండి బలవంతంగా వేరాక్రుజ్(పనామా)కు పంపేశారు. ఇంగ్లండ్ లో కేవలం 18 రోజులు మాత్రం ఎవిలిన్ వున్నది.

ఎవిలిన్ ఆరోగ్యం బాగాలేదనీ కనుక ఆమెను జాగ్రత్తగా చూచుకోవలసిందిగా ఎస్తోనియన్ కమ్యూనిస్టు డబ్లు ఇకాస్టరె టెలిగ్రాంలు పంపాడు. అందులో ఒకటి ఎవిలిన్ సోదరి హెలెన్ కు తెలియపరుస్తూ,బాంక్ ఎక్కౌంట్ న్యూయార్క్ కు మారుస్తున్నామని, మెక్సికోలో ఆమెతో సంబంధం పెట్టుకోమని కోరాడు. మెక్సికో వాలోడెజ్ కి మరో టెలిగ్రాం యిచ్చాడు. మాంట్రియల్ లో మెన్ బ్రోసన్ కు టెలిగ్రాం యిస్తూ ఎవిలిన్ కు సహాయపడమన్నాడు. ఎవిలిన్ ఆరోగ్యం గురించి టెలిగ్రాంలో ప్రస్తావించినదంతా కేవలం నమ్మించడానికి చెప్పిన అబద్ధమని పోలీసులు గ్రహించారు.

క్యూబా నుండి అమెరికాకు రావడానికి ఎవిలిన్ ప్రయత్నిస్తే అరెస్టు చేయాలని అమెరికా పోలీస్ సిద్ధపడ్డారు. కాని అట్లా రాకుండానే ఎవిలిన్ మాస్కో వెళ్ళిపోయింది. ఇంతకూ ఎవిలిన్ ఇంగ్లండ్ కు ఎందుకు వచ్చిందో, ఎవరిని కలిసిందో, ఏం చేసిందో, తెలియదు. జులై 22(1921) వరకూ క్యూబాలో వుంది,తరువాత రష్యా వెళ్ళింది. మొత్తం మీద ఎవిలిన్ 1921లో తన తాత-తండ్రి స్వదేశాన్ని సందర్శించగలిగింది. భవిష్యత్తులో పరిశోధన చేయాల్సిన అంశంగా యిది మిగిలిపోయింది. తిరిగి రష్యా వెళ్ళిన ఎవిలిన్ కమ్యూనిస్టు ఉద్యమంలో నిమగ్నమైంది. రష్యా నుండి తల్లిదండ్రులకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతుండేది. అట్లాంటా సిటిలో ఒక మధ్యవర్తి ద్వారా ఒకసారి తల్లిదండ్రులకు జాబు చేరవేసింది.

ఎవిలిన్ అన్ని విషయాలలో ఎం.ఎన్.రాయ్ కు చేదోడువాదోడుగా రష్యాలో యూరోప్ లో నిలచింది. మాస్కోలోని టాయిలర్స్ ఆఫ్ ది యీస్ట్ యూనివర్శిటీలో బోధిస్తూనే, యూరోప్ లోని వివిధ ప్రాంతాల నుండి సాహిత్యాన్ని, పత్రికలను, డబ్బును భారత కమ్యూనిస్టులకు పంపేవారు. ఇంప్రెకార్, వాన్ గార్డ్, అడ్వాన్స్ వాన్ గార్డ్, ది మాసెస్ ఆఫ్ ఇండియా పత్రికలలో "శాంతిదేవి" అనే పేరుతో ఎవిలిన్ వ్యాసాలు రాస్తుండేది. అందులో లెనిన్ పై,గాంధీపై వ్రాసినవి, భారతదేశంలో బొంబాయి మిల్లు వస్త్రాల కార్మికుల సమ్మె రచన ప్రసిద్ధమైనది. అలా యూరోపియన్ దేశాలు వెంటబడుతుండగా, స్థలాలు మార్చేసి, పత్రికలు ఆపకుండా నిర్వహించడంలో ఎవిలిన్ కృషి చాలా వుంది. బెర్లిన్, స్విట్జర్లాండ్, పారిస్ మొదలైన చోట్ల వీరి కేంద్రాలుండేవి.

"వాన్ గార్డ్" పత్రికను అమెరికాలో 127 మందికి,చైనాలో 11 మందికి,వర్ష్యాలో ఒకరికి పంపేవారు. అమెరికాలో భగవాన్ సింగ్,చంద్రకాంత చక్రవర్తి, కొలంబియా యూనివర్శిటీలో ఇద్దరు ప్రొఫెసర్లు,న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ మొదలైన చోట్లకు పంపేవారు. 1924 వరకూ యిలా సంబంధాలు పెట్టుకున్నారు. ఇండియాకు విపరీతంగా ప్రచార పత్రికలు, సాహిత్యం గుప్పించారు.