పుట:Abaddhala veta revised.pdf/235

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

జులై7 (1917) న ఎం.ఎన్.రాయ్ కు శిక్ష విధించినట్లు పేర్కొన్నాడు. ఎటొచ్చీ శిక్ష అనుభవించాల్సిన రాయ్ మెక్సికోలో సురక్షితంగా వున్నాడు! ఆయనతో బాటు ఎవిలిన్ కూడా వున్నది.

మెక్సికోలో ఎం.ఎన్.రాయ్-ఎవిలిన్

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒక ఏడాదిపాటు ఉగ్ర జాతీయవాద భారత రాజకీయాలు కొనసాగించిన ఎం.ఎన్.రాయ్ కొంత మారాడు. విశాల ప్రపంచం చూడడం, వివిధ వ్యక్తులను కలియడం కారణం కాగా, ఎవిలిన్ ను పెళ్ళిచేసుకోవడం ప్రధాన కారణం. జర్మనీ నుండి డబ్బు, ఆయుధాలు సేకరించి బ్రిటిష్ వారి పాలన అంతం చేయాలనే అలోచన యింకా వుంది. జూన్ 15 (1917)నాటికి సరిహద్దులు దాటి మెక్సికో పారిపోయిన ఎం.ఎన్.రాయ్ కు వూపిరి పీల్చుకున్నట్లయింది. అక్కడ రాయ్ గురించి ఆరాతిసిన బ్రిటిష్ రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు అమెరికాకు సమాచారాన్ని అందించింది. మెక్సికోలో రాయ్ ను అరెస్టు చేసి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తీసుకురావాలనే ప్రయత్నం విఫలమైంది.

మెక్సికో రాజధాని మెక్సికో నగరంలో రాయ్ సంపతులు కాలెడికోర్డిబా, 33డి, సిడాడ్ డి మెక్సికోలో వున్నారు. కొన్నాళ్ళపాటు మాన్యుల్ మాండెజ్ అనే పేరుతో రాయ్ ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాడు.

ఎవిలిన్ ఒక పరిచయ లేఖతో మెక్సికోలోని యుకటిన్ రాష్ట్ర గవర్నర్ అల్వరాడొ సాల్వొడార్ ను కలసి, కొన్ని విద్యాపథకాలకు ప్రతిపాదనలు యిచ్చింది. రాయ్ తో పాటు హీరేంద్రనాథ్ సేన్, శైలేన్ ఘోష్ లు కొన్నాళ్ళు మెక్సికోలో వుండి పనిచేశాడు.

చిరకాలంగా జర్మనీ సహాయం కోసం ఎదురు చూడగా, జావాలో అందవలసిన డబ్బు, ఆయుధాలు అందకుండాపోగా, చివరకు మెక్సికోలో డబ్బు మాత్రం రాయ్ కు అందింది. 1917 ఆగస్టు నాటికి ధనసహాయం లభించగా ఎవిలిన్ పేరిట బాంక్ అకౌంట్ తెరిచాడు. 6750 డాలర్లు 15 వేల మెక్సికో పెసోస్ వుండేవి.

ఎం.ఎన్.రాయ్ మెక్సికోలో తొలుత భారత జాతీయోద్యమ ప్రచారం చేబట్టాదు. స్పానిష్ భాషనేర్చి, అందులో కరపత్రాలు, చిన్న పుస్తకాలు ప్రచురించాడు. భారత స్నేహితులు అనే సంఘం స్థాపించి,అందులో ఎం.ఎన్.రాయ్.ఎవిలిన్ డైరెక్టర్లుగా స్వాతంత్ర్యావశ్యకత వివరిస్తూ,బ్రిటిష్-అమెరికా ధోరణి ఖండిస్తూ రచనలు,ఉపన్యాసాలు సాగించారు.

మెక్సికోలో వుండగా రాయ్ తన ఫోటోలు తీయనిచ్చేవాడు కాదని ఆయన స్నేహితులు అనేవారట. చంద్రకాంత చక్రవర్తి, లాలాలజపతిరాయ్ లు మెక్సికోలో వున్న ఎం.ఎన్.రాయ్ తో సంబంధాలు పెట్టుకున్నారు. కొన్నాళ్ళ పాటు రాయ్ ఉత్తరాలు, వ్యాసాలు యంగ్ ఇండియా పత్రికలో ప్రచురణార్ధం లజపతిరాయ్ కు పంపాడు.