Jump to content

పుట:Abaddhala veta revised.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీలుగా యిరువురూ కలసి వుంటారు. ఆ సమయంలో అభిరుచులు, అభిప్రాయాలు గ్రహించి, అంగీకరిస్తే పెళ్ళి చేసుకుంటారు. లేకుంటే, ఎవరి దారి వారిది. ఈ పద్ధతిని డేటింగ్ అంటారు. ఇది తల్లిదండ్రులు సమాజం అంగీకరించిన విధానం. రాయ్, ఎవిలిన్ లు అదే పద్ధతి అనుసరించారు. ఇంచుమించు ఒక ఏడాది కలసివున్న తరువాత, పెళ్ళి చేసుకున్నారు. ఎవిలిన్ విషయం రాయ్ తన స్మృతులలో ప్రస్తావించలేదు. ఎవిలిన్ కూడా పుస్తక రూపేణా రాయ్ ను గురించి ఏదీ రాయలేదు. అందువలన పరిశీలన శ్రమతో కూడిన పరిశోధనగా మారింది.

రాయ్ జీవితంలో ప్రవేశించి, రాయ్ లో మార్పులకు ప్రధాన వ్యక్తిగా వున్న ఎ విలిన్ గురించి లోగడ అతిస్వల్పంగా మాత్రమే సమాచారం తెలిసింది. 1992లో ప్రారంభించి, 1994లో కొనసాగింది, ఎవిలిన్ గురించి చాలావరకు పరిశోధన పూర్తి చేయగలిగాను. అమెరికాలో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, లైబ్రరీలు పురావస్తు మ్యూజియంలు ఇందుకు తోడ్పడ్డాయి. వ్యక్తులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొంత ఉపయోగించాయి. మొత్తం మీద ఎవిలిన్ గురించి చాలా వరకు సమాచారం అందించగలుగుతున్నందుకు పరిశోధకుడుగా తృప్తి చెందుతున్నాను.

మొదటి భర్తకు మొదటి భార్యగానే ఎవిలిన్ వున్నట్లయితే ఎం.ఎన్.రాయ్ అమెరికా జీవితం, ఎవిలిన్ పరిశోధన అనవసరం అనిపించేదే కాని, వారిరువురూ అంతర్జాతీయ రాజకీయాలలో ఎంతో ప్రధానపాత్ర వహించారు. ఇతరులపై చాలా ప్రభావం చూపెట్టారు. ఎవిలిన్ గురించి సమరేన్ రాయ్ ఒక్కరే కొంత పరిశీలించి, చాలా పరిమితంగా సమాచారం సేకరించగలిగారు. ఆయనను సంప్రదించాను కూడా. శిబ్ నారాయణ్ రే కొన్ని అడ్రసులు ఇచ్చినప్పటికీ అవి అంతగా తోడ్పడలేదు. చివరకు స్వయంశక్తిపై ఆధారపడి, తిప్పలుపడి కొన్ని మార్గాలు కనుక్కోగలిగాను.

ఎవిలిన్ గురించి, ఆమె కుటుంబాన్ని గురించి క్లుప్తంగా ప్రస్తావించి, ఎం.ఎన్.రాయ్ తో పరిచయం అయ్యే నాటికి ఆమెపట్ల అవగాహన ఏర్పరచడానికి ప్రయత్నిస్తాను.

ఎవిలిన్ లియోనార్ట్ ట్రెంట్ ఆమె పూర్తి పేరు. ట్రెంట్ ఇంటిపేరు. లియోనార్డ్ అని స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో చదివేటంత వరకూ వాడుకలో వున్నా, ఆ తరువాత కేవలం ఎవిలిన్ ట్రెంట్ అనే రాసుకున్నది. ఎవిలిన్ తల్లి అమెరికా స్త్రీ అయినా, తండ్రి బ్రిటిష్ పౌరుడు. ఎడ్విన్, ఆగస్టాలకు 1848 డిసెంబరు 13న లమార్టిన్ కనైనాక్ ట్రెంట్ పుట్టాడు. 12 సంవత్సరాల నాటికే ఓడలో అమెరికా చేరుకున్నాడు. మూడేళ్ళ పాటు సముద్రాల మీద ఓడల్లో పనిచేస్తూ తరువాత అమెరికా సివిల్ వార్ లో పాల్గొని రెండుసార్లు గాయపడ్డాడు. బాగా కష్టపడి, గనుల ఇంజనీర్ అయ్యాడు.

లమార్టిన్ కు గొప్ప పేరు ప్రఖ్యాతులు రాగా, జపాన్, ఆస్ట్రేలియా, టాస్మానియా ప్రభుత్వాలు ఆయన్ను పిలిపించి, సలహాలు స్వీకరించాయి. కలరెడొ రాష్ట్రంలో బౌల్డర్