పుట:Abaddhala veta revised.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభావం అని విడదీసిచెబుతున్నారు. పెద్ద వస్తువులపై ప్రభావం అంటే, బల్లను గాలిలోకి లేవనెత్తడం, చెంచాలను వంచడం మొదలైనవి ఉదాహరణలుగా చెపారు. సూక్ష్మంగా వస్తువులపై ప్రభావం చూపడం అంటే పావులు ఎగరేసి,నాణాలు విసిరేసి,బొమ్మ బొరుసు కావాలనుకున్న తీరులో వచ్చేటట్లు చేయడమన్నమాట. ఛాన్స్ పద్ధతిలో వచ్చే అంచనాకు విరుద్ధంగా ఎక్కువ సార్లు మనోశక్తి ఎలా కావాలనుకుంటే అలా వస్తుందని ప్రచారం చేశారు.

రోగులను మనోశక్తితో నయం చేయడం కూడా సైకొకెనిసిస్ తన శక్తిగా చూపుతున్నది. వీటన్నిటినీ ఆయా సందర్భాలలో పరీక్షకు గురిచేశారు. యూరిగెల్లర్ చేసిన కొన్ని పనులు,స్పూన్ వంచడం వంటివి జేమ్స్ రాండి 1982లోనే చూపాడు. మరికొన్ని శక్తులు,ముఖ్యంగా రోగాలు నయం చేసే అంశాలలో మోసాలు,కప్పి పుచ్చడాలు బయటపడ్డాయి. హెల్మట్ షిమిట్ వంటి వారి పరిశోధనలలో తీవ్రలోపాలని సి.ఇ.ఎం.హాన్సల్ (C.E.M Hansel)చూసి, మూలపద్ధతిలోనే దోషాలు వున్నట్లు వెల్లడించారు. కొందరు పేరా సైకాలజిస్టులు చిత్తశుద్ధితో శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాలు చేసి రుజువులకై తిప్పలు పడుతున్న మాట వాస్తవం. కాని వారికి అడుగడుగునా తీవ్ర ప్రతిబంధాలు ఎదురౌతూనే వున్నాయి.

పళ్ళాలు,చెంచాలు యిత్యాది వస్తువుల్ని వంచడం, తుంచడం, వంటివి శక్తులుగా చూపిన ఉదంతంపై పరిశోధన జరిగింది. 160 గంటల పరిశీలనను ఆల్పా ప్రాజెక్టు అన్నారు. సైకిక్ రీసెర్చ్ కి నిధులు సమకూర్చి సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్శిటీ వారిని పరిశోధించమన్నారు ఈ లాబ్ ను మాక్ లాబ్(MAC LAB) అంటారు. జేమ్స్ రాండి శిష్యులు యిరువురు కూడా ఆ పరిశోధనలో చేరారు. తరువాత జరిగిన ట్రిక్ అంతా డిస్కవరీ పత్రిక వివరంగా వెల్లడించింది.

పేరా సైకాలజి-పబ్లిసిటి

పేరా సైకాలజి పేరిట జరిగే సంఘటనలు నిజమా,కాదా అనే విచక్షణ గాని, విచారణ గాని లేకుండానే పత్రికలు,రేడియో,టి.వి.లలో ప్రచారం విపరీతంగా వస్తున్నది. ఈ విషయంలో పాఠకులకు, ప్రేక్షకులకు వాస్తవాలు తెలిపే దానికంటే,వ్యాపారసరళి బాగా కనిపిస్తున్నది. అతీంద్రియ శక్తులకు చెందిన అద్భుతాలు ఆసక్తి కలిగిస్తాయి గనుక, జనం ఆత్రుతగా చదువుతారుగనుక,వాటికి చాలా ప్రాధాన్యత లభిస్తున్నది. అద్భుతాలు,మూఢనమ్మకాలు, అతీంద్రియశక్తుల విషయమై సందేహవాదులు, సైంటిస్టులు చేసే హెచ్చరికలు, వాస్తవాలు అంత ప్రాధాన్యతను సంతరించుకోవడం లేదు.

ప్రజలు నమ్మడానికి సిద్ధంగా వున్నారు. నిజా నిజాలతో వారికి నిమిత్తం లేదు. అతీంద్రియ సంఘటన వెనుకవాస్తవాన్ని వివరించడానికి సమయం పడుతుంది. పైగా వివరణ చాలా చిక్కులతో, జటిలంగా వుండవచ్చు. ఒక కథ వలె సాగిపోతున్న ఇంద్రియాతీత శక్తి