పుట:Abaddhala veta revised.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1966లో యు షల్ బి యాజ్ గాడ్స్ అనే రచన చేశారు. అప్పుడే తొలిసారి గుండెపోటు వచ్చింది. చనిపోయేలోగా మొత్తం 4 పర్యాయాలు ఫ్రామ్ గుండెపోటుకు గురయ్యారు.

1968 ది రివల్యూషన్ ఆఫ్ హోప్ రాసి,రాజకీయాలలో చురుకుగా పాల్గొనడం విరమించేశారు. స్విట్జర్లాండ్ లో నివాసం ఏర్పరచుకొని తరచు అక్కడ వుంటూ,విశ్రాంతి తీసుకునేవారు.

1973లో "ది అనాటమీ ఆఫ్ హ్యూమన్ డిస్ట్రక్టివ్ నెస్" అనే విశ్లేషణాత్మక పెద్ద రచన చేశారు. 1975లో టు హేవ్ ఆర్ టు బి అనే రచనలో మానవుడు తనకు తానుగా నిలబడగలగడం అవసరమనీ, కేవలం సంపద ఆర్జించినంతమాత్రాన వ్యక్తిగా వుండజాలడని అన్నాడు.(1976)

1977లో ఒకసారి 1978లో మరోసారి గుండెపోటుతో ఎరిక్ ఫ్రామ్ బాధపడుతూనే జర్మనీ, ఇటలీలలో ప్రత్యామ్నాయ ఉద్యమాలలో పనిచేశారు. 1980లో మరోసారి గుండెపోటు రాగా మరణించిన ఫ్రామ్ ను స్విట్జర్లాండ్ లో సమాధి చేశారు.

ఎరిక్ ఫ్రామ్ కు తత్వం వుందా?

ఎరిక్ ఫ్రామ్ కేవలం మనో విశ్లేషణకారుడుగా, విమర్శకుడుగా మిగులుతాడా? లేక అతనికి తత్వం కూడా ఏదైనా వుందా?

ఫ్రామ్ రచనల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అతని మానవవాద తత్త్వం స్పష్టంగా అవగహన అవుతుంది.

మనిషి సహజ పరిణామంలో నుండి వచ్చాడు. ప్రకృతిలో భాగంగా వుంటూనే దానికి మించి పోవాలని మనిషి ప్రయత్నిస్తున్నాడు. ఇందుకు కారణం ఏమంటే, మిగిలిన వాటికి లేని వివేచన మనిషిలో వుండడమే.

ప్రతిక్షణమూ మనిషి బయటి ప్రపంచంతో సంపర్కం వలన, ప్రకృతిలోనూ, తోటివారితోనూ పొందికగా యిమడడం ఎలా అని సంఘర్షణ పడుతూనే వున్నాడు.

మానవుడు తన ఉనికి విషయంలో పరిష్కార మార్గాలను అన్వేషించిన ఫలితంగా రెండే రెండు మార్గాలు మిగిలాయి. ఒకటి మానుషం. అదే మానవవాదం.రెండవది అమానుషం. ఈ అమానుష పరిష్కారాల ఫలితంగానే దైవాన్ని, అతీత శక్తుల్ని ఆత్మను,అమరత్వాన్ని వూహించుకున్నాడు. వాటికి క్రమేణా బానిసగా మారి కొట్టు మిట్టాడుతున్నాడు.

మానవవాదంలో మనిషి కేంద్రంగా వుంటాడు. ప్రకృతిని క్రమంగా పొరలు విప్పుకుంటూ, ఒక్కొక్క అరలో ఏముందో తెలుసుకుంటూ సాగుతాడు. అలా తెలుసుకోవడం నిరంతరంగానూ, అనంతంగానూ సాగుతుంది.