పుట:Abaddhala veta revised.pdf/218

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శిశుమందిర్ లలో చిన్నారులపై మత మౌఢ్యాన్ని రుద్దుతున్నారు. దీన్ని ప్రభుత్వం అడ్డుకున్న దాఖలాలు లేవు.

? మతాలు రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకునే పావులయ్యాయనే విషయంపై మీరేమంటారు?

  • ఇది అక్షరాలా వాస్తవం. వివిధ మతాల వారి రాజకీయ మద్దతు కూడగట్టుకునేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అనేక సామాజిక సమస్యలకు కారణమౌతున్నాయి. ఒక మతం వారు రోడ్డుపై ప్రార్థనా మందిరాన్ని కట్టుకున్నారని, పోటీగా ఇతర మతాల వారు రోడ్లను ఆక్రమించుకొని గుళ్లు, గోపురాలు, మసీదులు, చర్చిలు నిర్మిస్తున్నా వాటిని అడ్డుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉంది.

? అయోధ్యలో వివాదానికి కారణమైన బిజెపి, దాని అనుబంధ సంస్థలకు ఇప్పటికీ చంద్రబాబు మద్దతును కొనసాగించడం సెక్యులరిజాన్ని అగౌరవపరచడం కాదా?

  • బిజెపి సంకీర్ణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడం రాజకీయ ఎత్తుగడ మాత్రమే. గతంలో ఆయన కమ్యూనిస్టులతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ లో కూడా ఉన్నారు. పరిస్థితులను బట్టి మారే ఈ మద్దతుకూ సెక్యులరిజానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే సెక్యులరిజం పేరుతో రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రంలో అనేక కార్యకలాపాలు సాగుతున్నాయి. సెక్యులరిజంపై పాలకులకు సరైన అవగహన లేని కారణంగా పలు అనర్ధాలు జరుగుతున్నాయి. అన్ని మతాలను దువ్వడం సెక్యులరిజం ఎట్టి పరిస్థితుల్లోనూ కాజాలదు. బిజెపి, విశ్వహిందూ పరిషత్, ఆర్.ఎస్.ఎస్., క్రిస్టియన్, ముస్లిం సంస్థలకు తమ మతాలపై మాత్రమే అపారమైన విశ్వాసం ఉంటుంది. ఇతర మతాలన్నీ నిజం కావు అన్నట్లు కూడా వ్యవహరిస్తాయి. అలాంటి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్న చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా మతతత్వాన్ని ప్రేరేపిస్తోందనే చెప్పాలి. జవహర్ లాల్ నెహ్రూ పాలనలో సెక్యులరిజానికి ఎలాంటి భంగం కలగలేదు. దేశానికి రాష్ట్రపతిగా వున్న జాకీర్ హుస్సేన్ కూడా తన మత విశ్వాసాలను ఎప్పుడూ బహిరంగంగా ప్రదర్శించలేదు. అలాంటి వైఖరి మన పాలకుల్లో రావాలన్నదే మా ఆకాంక్ష.
- వార్త,మార్చి 2002