పుట:Abaddhala veta revised.pdf/197

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అనకుండా, తమ పాఠశాలల్లో నీతిపేరిట క్రైస్తవేతరులకు బైబిల్ చెప్పినట్లే, హిందువులు ఆధ్యాత్మిక విలువల పేరిట చెప్పాలని కొందరు పేర్కొన్నారు. సి. రాజగోపాలాచారి మాత్రం మతపరమైన విద్య వుండాలన్నారు. ఏదో ఒక విధంగా మత విద్య వుండాలన్న వారిలో జాన్ మత్తై, ఎస్.ఆర్.దాస్ (భారత ప్రధాన న్యాయమూర్తి) రుక్మిణి అరుండేల్, డా॥సంపూర్ణానంద్ మొదలైనవారున్నారు. విద్యాసంఘాలు, ముఖ్యంగా రాధాకృష్ణన్ సంఘ నివేదిక సైతం ఏదో ఒక రీతిలో అన్ని మతాల కలగాపులగపు చదువునే కోరింది. అన్ని మతాల ఐక్యతా సూత్రాలు చెప్పాలన్నారు. అయితే క్రైస్తవులు ఇందుకు అంగీకరించలేదు. అన్ని మతాలు ఒకటే అనే సూత్రం ఏ మతానికీ అంగీకారం కాదని గ్రహించాలి.

ఒక మతం చెప్పిందే ఇంకోమతం కూడా చెబితే ఇక మతమార్పిడి దేనికి? "మా మతం, మా దేవుడు, మా వ్యవస్థ గొప్పది" అనే సూత్రం, నమ్మకంపైనే మతప్రచారం సాగుతుంది. మతమార్పిడి కూడా అంతే. అన్ని మతాల సారాంశం ఒక్కటే అనడం రాజకీయాల్లో వేదికలపై ఉపన్యాసాలకు పనికిరావచ్చు. మతకలహాల అనంతరం యిలాంటి ఉపన్యాసాలు తరచు చేస్తుంటారు. కాని మత నాయకులు, ముల్లాలు, పూజారులు, ఫాదరీలు ఎవరూ అన్ని మతాలు ఒకటే అనే సూత్రం అంగీకరించరు. గాంధి తన జీవితాంతం యీ సూత్రాన్ని ప్రచారం చేశారు. బేసిక్ విద్యలో సైతం యీ సూత్రమే ప్రతిపాదించారు. అయితే కొన్ని క్రైస్తవ పాఠశాలల్లో సాధారణ ప్రార్థనలకు అంగీకరించారు. ఇది ఎదురీత వద్దనుకొని చేసిన పనిమాత్రమే నీతిబోధన తరగతులకు తప్పనిసరిగా రానక్కరలేదని క్రైస్తవ విద్యాసంస్థలు పెర్కొన్నాయి. క్రైస్తవ విద్యాసంస్థలలో క్రైస్తవేతర ప్రార్థనలు వుండకపోయినా తప్పులేదని కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పింది.(1957 ఎ.ఐ.ఆర్. కలకత్తా పుట 524)

దేశంలో క్రైస్తవులు విద్యారంగంలో తీవ్ర కృషి చేశారు,చేస్తున్నారు. 'వారి క్రమశిక్షణపై' జనానికి, ముఖ్యంగా మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు సదభిప్రాయం వున్నది. ప్రాథమిక, నర్సరీ స్థాయి నుండే కాన్వెంట్ విద్యకు పిల్లల్ని పంపడం విలాసమై పోయింది. ప్రతిష్ఠతో కూడిన విద్యగా కాన్వెంట్ చదువులు వున్నాయి. క్రైస్తవులను అనుకరిస్తూ గ్రామాలలో, నగరాలలో విపరీతంగా కాన్వెంట్లు తలెత్తాయి. కేరళలో విద్యారంగంలో అక్షరాస్యతలో అగ్రస్థానంలోవున్న క్రైస్తవులు, నాగాలాండ్ వంటి కొండ ప్రాంతాల్లో తమ విద్యావిధానంతో జనాన్ని ఆకట్టుకున్నారు. కాలాగుణంగా క్రైస్తవులు మారి, దేశీయభాషలలో మతబోధ చేయడం కూడా వారి మత లౌక్యానికి, ఎత్తుగడకూ, పట్టుదలకూ సూచనలే. అవసరమైతే హిందూ ఆచార వ్యవహారాలతో రాజీపడి కట్టుబొట్టు పాటిస్తూనే, మతప్రచారం సాగిస్తున్నారు.

క్రైస్తవులలో మతం మినహాయిస్తే మిగిలిన హిందూ దోషాలన్నీ అంటుకునే వున్నాయి. ముఖ్యంగా కులాన్ని, అంటరానితనాన్ని పాటించడం ఘోరం. వారి దేవాలయాలలో సైతం ఉన్నత కులాలు, అంటరానివారిని వేరుగా కూర్చున్న సందర్భాలున్నాయి. కులాంతర వివాహాలు