పుట:Abaddhala veta revised.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నారు. గీత-ఖురాన్ లలో దైవం ఒక్కటేనన్నారు. (చూడు : ఆనంద్ టి.హింగోరాని సంపాదితంలో టు ది హిందూస్ అండ్ ముస్లింస్-ఎం.కె.గాంధీ 1942 అలహాబాద్) ఇక్కడే ముస్లింలు గాంధీని వ్యతిరేకించారు. హిందువులూ ఆయన్ను అనుసరించలేదు. దేశంలోని ముస్లింలు అందరూ పాకిస్తాన్ వెళ్ళిపోవాలని సనాతన హిందువుల ఉద్దేశం. న్యాయం సమకూర్చడంలో, శాంతిభద్రతలు అందించడంలో,మురికి నీటిపారుదల, పరిశుభ్రత, రోడ్లు, రవాణా వంటి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ దృష్టిలో ముస్లింలని, హిందువులని తేడా వుంటుందా అంటారు గాంధి. కనుక ప్రభుత్వం మతరహితంగానే వ్యవహరించాలంటారు.

గాంధి చివరి దశలో తన అభిప్రాయాలు బాగా మార్చుకొని, సెక్యులరిజం అమలు జరగాలన్నారు. మత విషయాలలో ప్రభుత్వ జోక్యం ఏ మాత్రం వుండరాదన్నారు, కాని కాంగ్రెసులో సైతం నాయకులు పాకిస్తాన్ కు అనుకూలత చూపారు. దేశం విభజన జరిగితే శాంతి వుంటుదనుకున్నారు. బలవంతంగా గాంధీని ఒప్పించారు. మతపరంగా జరిగిన విభజన వలన లక్షలాది మంది చంపుకున్నారు. మతద్వేషాలు ఇంకా పెరిగిపోయాయి. బెంగాల్ లో గాంధీ పుణ్యమా అని కొంతవరకు తాత్కాలికంగా మతహింస ఆగింది. గాంధీ కోర్కెలకు విరుద్ధంగా దేశ విభజన జరిగింది. గాంధి సెక్యులరిజం విఫలమైంది.

గాంధి యిలా విఫలం గావడానికి మూలకారణాలు తెలుసుకోవడం అవసరం.

గాంధీ వైఫల్యం

మతంలోని సారాంశాన్ని సరిగా అర్థం చేసుకుంటే, హిందువులు ముస్లింలు కలసిమెలసి వుంటారని గాంధి నమ్మారు. ఈ "నిజం" అనేది ఎవరికి ఎట్లా అర్థమైనా,ఎవరి మతం యొక్క గొప్పతనం వారికి అట్టిపెట్టుకోవాలని, ఇతర మతాల కంటె తమది గొప్పదనీ భావించారు. అలా అనుకోకపోతే మతాలు పుట్టవు, పుట్టిన తరువాత వుండవు. మూర్ఖంగా నమ్మడం, ప్రశ్నించకపోవడం అనేవి మతానికి పునాదులు. మతం పట్ల మౌలికమైన అవగహన, పరిశీలన, పుట్టుపూర్వోత్తరాలు తెలిస్తే మతం సడలిపోతుంది. గాంధి కూడా హిందూమత సంప్రదాయాలలో మునిగి తేలిన వ్యక్తే. అందుకు ఆయన హిందూమతాన్ని ఏనాడూ శాస్త్రీయంగా పరిశీలించలేదు. అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. లౌకికంగా సమస్యల్ని చూచాడు. అది మతవాదులకు నచ్చలేదు.

జీవితమంతా మతాన్ని అంటిపెట్టుకున్న గాంధీకి,చివరిదశలో జ్ఞానోదయమైంది. పాకిస్తాన్ విభజనతో, లక్షలాది హిందూ-ముస్లింలు చనిపోయిన తరువాత గాని మతంలోని ప్రమాదాలు గాంధీకి తెలిసిరాలేదు.

"మతం వ్యక్తిగత విషయం వ్యక్తి స్థాయిలో మతాన్ని అట్టిపెట్టగలిగితే రాజకీయ జీవన రంగమంతా చక్కబడుతుంది" అని గాంధీ 1947లో హరిజన్ పత్రికలో రాశారు (మే 16, 23, ఆగష్టు 31 సంచికలు) ప్రభుత్వం ఏ విధంగానూ మతం జోలికి రాకూడదని,సహాయం