పుట:Abaddhala veta revised.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెవాడ యూనివర్శిటీలో పేరా సైకాలజిస్టు డీన్ రాడిన్ పరిశోధనలు చేబట్టి, ఒకానొక వ్యక్తికి చెమట పోసే రీతులలో ఉద్వేగ స్థాయిని కొలవ వచ్చునన్నాడు. కంప్యూటర్ ముందు ఒక వ్యక్తిని కూర్చోబెట్టి కొన్ని గందరగోళపరచే బొమ్మల వలన ఎలా వూహలు మారతాయో చూడవచ్చునన్నాడు. అంతటితో ఆగక, రానున్న బొమ్మను వ్యక్తి వూహించడం ద్వారా అతడిలో ఉద్వేగాలు మారతాయన్నాడు. కొందరు ముందే ఎలాంటి బొమ్మ రానున్నదో సరిగా చెప్పగలుగుతారన్నాడు.

అమెరికాలో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ 1987 లో పేరా సైకాలజీని క్షుణ్ణంగా పరిశీలించి, 130 సంవత్సరాల పరిశోధనలలో ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ జరగలేదని స్పష్టం చేశారు.

న్యూజెర్సీలోని ప్రిన్స్ టన్ యూనివర్శిటీలో రాబర్ట్ జాన్ పేరా సైకాలజీ పరిశోధనలు చేశారు.

ఒక బల్ల ముందు గైలిన్ (Guillen) కూర్చొని, ఒక బొమ్మ కప్పను తన మనోబలంతో తన దగ్గరకు రప్పించాలని ప్రయత్నించాడు. దూరంగా జరిగినప్పుడు మనోబలం తీవ్రంగా లేనట్లు, సమీపంగా వచ్చినప్పుడు మనోబలంతోనే అది చెంతకు వచ్చినట్లు పేర్కొన్నారు. సైకోకెనిసిస్, వస్తువులపై మనోబలం చూపే విధానానికి యిదొక నిదర్శన అని చూపదలచారు. అలాగే నీళ్ళ పంపులలో నీటిచుక్కలపై మనోబలం గురించి పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో పాల్గొనే అసిస్టెంట్లు చాలా సందర్భాలలో తమ "బాస్" ల తృప్తి కోసం అనుకూల ఫలితాలు చూపినట్లు బయటపడింది.

లాంగ్ మూర్ యీ పేరా సైకాలజీని పేథలాజికల్ సైన్స్ గా చిత్రించారు.

పేరా సైకాలజి ఒక ఫాషన్ గా,అంటువ్యాధిలా వ్యాపించింది. దీనికి సైంటిఫిక్ ముసుగు తొడిగి గౌరవం ఆపాదించాలనే ప్రయత్నంలో కోట్లాది ధనం వెచ్చించి,వృధా ప్రయాసకు గురి అయ్యారు. ఫలితాలు మాత్రం శూన్యం.

పేరా సైకాలజీ చరిత్ర

తొలుత పేరా సైకాలజీలో అనేకాంశాలు పరిశీలనలోకి స్వీకరించారు. దూరదృష్టి, దూరశ్రవణం, భవిష్యత్తును చెప్పడం,మనోబలంతో వస్తువుల్ని కదిలించడం, దయ్యాలు, భూతాలు,ఆత్మలు, పునర్జన్మ, గాలిలో తేలడం, మనోశక్తితో ఇతరుల మనస్సులలో ఆలోచనలు గ్రహించడం యిత్యాదులన్నీ చేర్చారు. ఇలాంటివి అన్ని సమాజాలలో పూర్వకాలం నుండి వున్నాయి. యూరోప్ లో ఆధ్యాత్మికత పేరిట అధ్యయనాలు బాగా సాగాయి. కొందరు తమ వృత్తులు సైతం వదలి,అదే పనిగా ఇంద్రియాతీతశక్తులపై దృష్టి సారించారు.