పుట:Abaddhala veta revised.pdf/189

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మేలు చేసినట్లు నటించారు. పూనా ఒడంబడిక పేరిట హరిజనుల్ని మనుషులుగా సమానత్వంతో బ్రతకడానికి వీల్లేకుండా గాంధిభాయి కృషిచేసి, హిందూమతంలో హెచ్చుతగ్గుల్ని తెలివిగా, జాగ్రత్తగా కొనసాగించారు. సనాతనులు సంతోషించారు.

హిందూ-ముస్లిం భాయి భాయి

గాంధి చేసిన కృషిలో పాకిస్తాన్ ఏర్పడకుండా వుండాలని, హిందువులు ముస్లింలు కలసిమెలసి వుండాలనేది ముఖ్యం. ఈ విషయంలో గాంధి స్పష్టంగా విఫలమయ్యారు. రాజకీయంగా ఆయన యిచ్చిన పిలుపుల్ని గౌరవించి, రంగంలోకి దూకినవారు, మతపరంగా ఆయన ఉద్దేశాలను ఆచరణలో పెట్టడానికి సిద్ధపడలేదు.

మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చిన గాంధి, తెలిసి, కావాలని ఆ పని చేశారు. రాజకీయాలకు మతానికి సంబంధం లేదనే వారికి మతం అంటే ఏమిటో తెలియదని గాంధి తన సత్యాన్వేషణ స్వీయగాధల్లో అన్నారు. భారతదేశంలో రామరాజ్యం ఏర్పరచాలని నినదించిన గాంధి, శాకాహారం, అహింస, అర్ధనగ్నంగా వుండడం, మతగ్రంథాలు పట్టుకొని ప్రార్థనా సమావేశాలు జరపడం, ఉపవాసాలు, నిరాహారదీక్షలు ఇత్యాదులన్నీ చేశారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని గాంధి పదేపదే చెప్పారు. ఈ విషయాన్ని ఏ మత సనాతనులూ అంగీకరించలేదు. ఎవరి మతం వారికి గొప్ప. ఇంకో మతాన్ని గొప్పది అనడం, వేదికలపై రాజకీయ ప్రయోజనాల నిమిత్తం పైపైకి చెప్పే విషయమే. గాంధిచేసిన ప్రతి పని వెనుక హిందూ ప్రభావాన్ని చూచిన ముస్లింలు, ఆయన్ను అంగీకరించలేదు. కాంగ్రెసులో హిందూ ఆధిపత్యాన్నే వారు చూచారు.

ముస్లింలను కాంగ్రెసులో అట్టిపెట్టాలని, దేశ స్వాతంత్ర్య పోరాటంలో కలుపుకపోవాలని చేసిన ప్రయత్న ఫలితంగా లక్నో ఒడంబడిక వచ్చింది. ముస్లింలకు ప్రత్యేక ఎన్నికలు జరపడానికి ఒప్పుకున్నారు. ఖిలాఫత్ ఉద్యమాన్ని గాంధి సమర్ధించడంలోనూ యీ ఉద్దేశ్యం వున్నది. ముస్లింల కొరకు గాంధి చాలాదూరం పోతున్నాడని,హిందువుల ఆసక్తులు పట్టించుకోవడం లేదని, సనాతనులు విమర్శించారు. గోవధ నిషేధం కూడా ముస్లింలకు వర్తించరాదని గాంధి అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని అంటిపెట్టుకొని వుండరాదని, అన్ని మతాలు ఒకటే గనుక,ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలని గాంధి ఉద్దేశం. భారతదేశంలో యిలాంటి అభిప్రాయం వలన,పైకి ఎలా చెప్పినా, హిందూ మతానిదే పైచేయిగా వుంటుందని ముస్లింల ఉద్దేశం.

పాకిస్తాన్ కావాలనడంలో హిందూ వ్యతిరేకత వున్నదని, ఇస్లాం ప్రత్యేకతను కోరుకుంటున్నదనీ, కనుక పాకిస్తాన్ కు తాను వ్యతిరేకినని గాంధీ పదేపదే చెప్పారు. హిందూమతం-ఇస్లాం రెండు భిన్న సిద్ధాంతాలకు ప్రతినిధ్యం వహిస్తున్నట్లు తాను అంగీకరించనని గాంధీ