పుట:Abaddhala veta revised.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థిరపడలేదు. 1930లో ఉప్పు సత్యాగ్రహం పేరిట జరిపిన దండి మార్చి, గాంధీ నాయకత్వాన్ని బ్రిటిష్ వారు గుర్తించేటట్లు చేసింది. జవహర్ లాల్ నెహ్రూను తన వారసుడుగా గాంధీ పేర్కొన్నారు.

1940 నుండి 42వరకు మరోసారి గాంధి దేశాన్ని కదిలించేశారు. వ్యక్తిగత సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు గాంధి ప్రజా సైకాలజీ వాడుతున్న దానికి ఉదంతాలే. క్విట్ ఇండియా తరువాత స్వాతంత్ర్యం వచ్చేవరకూ గాంధీ ఉద్యమాలెవీ లేవు.

మొత్తంమీద దేశ స్వాతంత్ర్యోద్యమంలో మతాన్ని కలిపి, ప్రజల్ని రంగంలోకి తెచ్చిన గాంధి, రెండు విషయాలలో సెక్యులర్ ధోరణులు అలవరచలేకపోయారు. అంటరానితనం పోవాలని గాంధి ఎంతచెప్పినా ప్రయత్నించినా హిందూమతం వినలేదు. హిందూ-ముస్లింలు ఒకటేనని గాంధి నినదించినా ఉభయమతాలూ పెడచెవిన పెట్టాయి. స్వాతంత్ర్యోద్యమంలో ఒకపిలుపు యిస్తే గాంధీ పేరిట వీధుల్లోకివచ్చి, త్యాగం చేయడానికి సిద్ధపడినవారు, మతవిషయంలో గాంధీని ఎందుకు నిరాకరించారు! ఈ విషయం వివరంగా పరిశీలిస్తే, సెక్యులర్ ధోరణులు దేశంలో ఎందుకు అలవాటు కాలేదో స్పష్టపడుతుంది.

అంటరానితనం

అంటరానితనం అమానుషమని,అది అడుగంటిపోవాలని గాంధిభాయి అన్నారు. అంటరానితనం నశించకపోతే హిందూమతమే పోతుందన్నారు. భారత రాజకీయాల్లోకి ప్రవేశించినది మొదలు అంటరానితనంపై గాంధీజీ పోరాడారు. కాని అంటరానితనానికి అమ్మ ఎవరు? కులం. ఈ రెండింటికీ మూలం ఏది? మతం. అటువంటిది హిందూమతం జోలికి పోకుండా, అంటరానితనం ఎలా పోతుంది? ఇది అంబేద్కర్ ప్రశ్న.

కులాన్ని వదలేయండి అంటే మతాన్ని వదలేయమనే అర్థమని అంబేద్కర్ ఉద్దేశం. కులానికి హిందూమత ప్రమాణ గ్రంథాలు, ముఖ్యంగా వేదాలు, శాస్త్రాలు కొమ్ముకాస్తున్నాయి. వాటినికాదంటే హిందువుగా ఎలా నిలబడతారు? సమానత్వాన్ని అంటరానివారికి తెచ్చిపెట్టాలంటే హిందూమతంలో సాధ్యంకాదు. అందుకని, ఎన్నికలలో అంటరానివారికి ప్రత్యేక నియోజకవర్గాలు వుండాలని అంబేద్కర్ పట్టుబట్టాడు. 1930-31లో లండన్ లో జరిగిన ప్రథమ రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ వాదనల్ని బ్రిటిష్ పాలకులు అంగీకరించారు.

అప్పుడు జైలులోవున్న గాంధి 'ససేమిరా' అంటూ, అంటరానివారు హిందువులకు దూరం కారాదన్నారు. బ్రిటిష్ వారి ప్రతిపాదన వ్యతిరేకిస్తూ ఆమరణనిరాహారదీక్ష పూనారు. అంబేద్కర్ తన పట్టు మానాలన్నారు. కులనాయకులు, మతనాయకులు గాంధీపట్ల సానుభూతి ప్రకటించారు. గాంధీ చనిపోతే దేశం నాశనమౌతుందన్నారు. అంబేద్కర్ వత్తిడికి లొంగిపోయి,గాంధీజీ కోరినట్లు హరిజనులకు ప్రత్యేక నియోజకవర్గాలు కోరబోనన్నాడు. శాసనసభలలో అంతకుముందు 71 స్థానాలుంటే వాటిని 148 వరకూ కేటాయించడానికి ఒప్పుకొని, హరిజనులకు