పుట:Abaddhala veta revised.pdf/183

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గావడం, సొంతలాభం మానుకోవడం ఇలాంటివన్నీ ప్రజల దృష్టిలో పవిత్రమైనవి. గాంధీజీ యీ లక్షణాలు పాటిస్తూ ప్రజల్ని ఆకర్షించి, రాజకీయాల్లోకి మతాన్ని తెచ్చారు. రామరాజ్యం కోరిన గాంధీజీ హిందూమతవాది. మత ఐక్యత కోరిన గాంధి, హిందూమతంలో ఇస్లాం, బౌద్ధం, క్రైస్తవం యిముడుతాయనుకున్నాడు. ముస్లింలను హిందువులను మతపరంగా కలపాలని గాంధీజి నినదించారు. అక్కడే ఆయన విఫలమయ్యారు. ఆయన పిలుపును అందుకొని రాజకీయోద్యమాల్లో ప్రవేశించిన హిందువులు, ముస్లింలు తమ మతాల్ని గట్టిగా పట్టుకొనే వచ్చారు తప్ప వదులుకొనిరాలేదు. హిందువులు, ముస్లింలు ఒకటేననిగాని, ఖురాన్-బైబిల్-గీత చెప్పేదంతా ఒకే సత్యమనిగాని ఏ మతస్తుడూ ఒప్పుకోలేదు, పైగా గాంధీజీ చెప్పేదంతా హిందూమత ప్రచారంగానే ఇతర మతస్తులు భావించారు. దేశ ఐక్యతకు, స్వాతంత్ర్యానికి మతపరమైన ఆయుధాలతో గాంధీజీ పోరాడుతున్నప్పుడే, పాకిస్తాన్ కోసం ముస్లింలీగ్ ఏర్పడి, పోరాడి, సాధించిందికూడా.

గాంధి భావాల ప్రభావం విపులంగా పరిశీలించేముందు, సంక్షిప్తంగా ఆయన జీవితాన్ని, తన భావాలు సంతరించుకోడానికి తోడ్పడిన తీరును చూద్దాం.

గుజరాత్ లోని పోరుబందరులో గాంధి ఒక వైశ్య కుటుంబంలో పుట్టాడు. గాంధి తండ్రి పోరుబందరు సంస్థాన ప్రధాని. వీరు ఐదుగురు అన్నదమ్ములు. అందరి కుటుంబాలు ఒకే యింట్లో వుండేవి. గాంధి తండ్రి నాలుగు పెళ్ళిళ్ళు చెసుకున్నాడు. గాంధి తల్లి పుత్లిబాయి నాలుగో భార్య. గాంధి తండ్రి 47వ ఏట 24 సంవత్సరాల పుత్లిబాయిని పెళ్ళాడాడు. గాంధికి రెండు సంబంధాలు నిశ్చయిస్తే, వారిరువురూ చనిపోయారు. మూడో సంబంధం కస్తూరిబాతో కుదిరింది. గాంధికి 13వ ఏట పెళ్ళి అయింది. కస్తూరిబా పొరుగునే వుండేది. ఇద్దరూ ఆడుకునేవారు. తల్లికి ఎప్పుడూ తీరనిపని. పూజలు, ఉపవాసాలు, వైష్ణవ సంప్రదాయం, శాకాహారం, తండ్రిపట్ల గాంధీకి ప్రేమ, ఆదరణ, తండ్రి వృద్ధుడై, జబ్బు పడగా సేవలు చేస్తుండే గాంధీకి జుగుప్స కలిగించే సంఘటన జరిగింది. ఒకసారి తండ్రికి సేవలుచేస్తూ మధ్యలో భార్యవద్దకు వచ్చాడు. మామ తన స్థానంలో తండ్రివద్ద వున్నాడు. భార్య చెంతవుండగా తలుపులుకొట్టి తండ్రి పోయినట్లు ఎవరో చెప్పారు. వచ్చిచూచిన గాంధీకి చివరి సమయంలో తాను తండ్రివద్ద లేకపోవడం, భార్యతో సంభోగంలో వుండడం వలన, ఏదోనేరం చెసినట్లు, సెక్స్ చర్య పాపం అన్నట్లు భావించాడు.

గాంధీకి పాఠశాల మిత్రుడు షేక్ మెహతాబ్ వుండేవాదు. అతడు ఒక పోలీస్ అధికారి కుమారుడు. గాంధీకి సంరక్షకుడిగా వుండాలని నిర్ణయించుకొని, అన్నీ నేర్పాలనుకున్నాడు. మాంసాహారం తినిపించాడు. ధైర్యంగా వుండాలంటూ మగతనం నిరూపించుకోమని గాంధిని వ్యభిచారగృహాలకు తీసుకెళ్ళాడు. వైఫల్యాలు, సఫలతలు చవిచూచిన గాంధీకి, కామవాంఛ ఎక్కువగానే వుండేది. ఆ దృష్టితోనే లండన్ లో కూడా యీ పరిశోధన సాగించాడు.