పుట:Abaddhala veta revised.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయుర్వేదం, ప్రకృతివైద్యం, ఉపవాసాలు, కఠోరనియమాలు, ఖద్దరు వడకటం, ధరించడం, లైంగిక కట్టుబాట్లు, రామరాజ్యం యిలాంటివన్నీ ఆశ్రమ స్త్రీలకు ఆకర్షణలే. అందుకే గాంధీజీ ఆశ్రమాలకు అంకితమైపోయిన స్త్రీలు కొందరుకాగా, దేశవ్యాప్తంగా గాంధేయ పద్ధతులలో ఆయన శిష్యరికం చేసిన మధ్యతరగతి స్త్రీలు కొల్లలుగా వున్నారు.

గాంధీజీ ఆశ్రమాల పోషణ చాలా ఖరీదైన విషయం. సమాజానికి ముఖ్యంగా కొందరు గాంధేయ వ్యాపారస్తులకు యిందుమూలంగా ఖర్చు చాలా అయింది. గాంధీని పేదరికంలో అట్టిపెట్టడానికి, మూడవతరగతి రైలు ప్రయాణాలకు విపరీతంగా ఖర్చయ్యేది. ఆశ్రమాలను సమాజం పోషించి, గౌరవించి,ఆరాధించడం చిరకాలంగా దేశంలో వస్తున్న సంప్రదాయమే. దీని ఆధారంగా గాంధీజీ తన రాజకీయల్ని బాగా ప్రచారంలోకి తెచ్చాడు. ఆశ్రమ జీవనానికి ప్రచారం లభించింది,లాభించింది. సబర్మతి-వార్దా ఆశ్రమాలు దేశంలో రాజకీయాన్ని నడిపిన కేంద్రాలుగా మారాయి.

గాంధీజీ రాజకీయాల్లో ప్రవేశించి స్తబ్ధతలోవున్న కాంగ్రెసును ప్రజా ఉద్యమంగా మార్చడానికి మతపరమైన విధానాలు ఉపకరించాయి. సత్యాగ్రహం,సహాయనిరాకరణ, నిరసనపత్రం, నిరాహారదీక్షలు, అహింసాయుత ఆందోళనల్ని గాంధీజీ తన ఆయుధాలుగా ప్రయోగించారు. ఇవన్నీ చిరకాలంగా మతాలు వాడుతున్నవే. కాని స్వాతంత్ర్యోద్యమంలోకి వాటిని తెచ్చి ప్రయోగించడం గాంధీ వివేచనకు తార్కాణం.

గాంధీజీ ఏ ఉద్యమాన్ని ఆరంభించినా, అది ఎంత అహింసాయుతంగా వుండాలన్నా, చివరకు హింసకే దారితీస్తుంది. ఉద్యమాలను మొదలుపెట్టిన గాంధీజీ వాటిని హింసాయుతం కాకుండా ఆపలేకపోయారు. మతం సహనం పేరిట ఎంత ప్రబోధం చేసినా, అవసరమైనప్పుడు చాలా అసహనాన్ని హింసను చూపగలదు. గాంధీజీ ఉద్యమాలలో మతం పేరిట ప్రవహించిన రక్తం మత అసహనానికి తార్కాణమే. హిందూ-ముస్లిం భాయిభాయి అని గాంధీజీ నినదించి, జీవితమంతా కృషిచేశాడుగదా! ఆయన కళ్ళెదుట హిందూ-ముస్లింలు వూచకోత కోసుకున్నారు. దేశవిభజన వలన 60 లక్షల హిందూ-ముస్లింలు బలిఅయ్యారు. చివరకు మత ఛాందసుడి చేతిలో గాంధి హతమయ్యారు. రాముడు-రహీం ఒక్కడేనని, ఈశ్వర అల్లా తెరేనాం అనీ, ఒకచేతిలో భగవద్గీత మరో చేతిలో ఖురాన్ పెట్టుకున్న గాంధీ ఎందుకు విఫలమయ్యారు? రెండు మతాలవారూ గాంధీజీ మతపరంగా చెప్పింది అంగీకరించలేదు. రాజకీయ ప్రయోజనంకోసం గాంధీజీ బోధిస్తున్నాడని వారికి తెలుసు. కనుక ఎవరి మతాన్ని వారి అంటిపెట్టుకున్నారు. సమయంచూచి చంపుకున్నారు. భాయి-భాయి అనేది వేదికలపై నినాదంగా మిగిలింది.

మతాన్ని రాజకీయాల్ని వేరుగా వుంచాలని గాంధి భావించలేదు. ప్రజలపై మతప్రభావం ఏమిటో ఆయనకు బాగా తెలుసు. అతితక్కువగా వస్త్రాలు ధరించడం, ఆశ్రమ జీవనం గడపడం, పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తరువాత బ్రహ్మచర్యం పాటించడం, శాకాహారానికే అంకితం