పుట:Abaddhala veta revised.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషయాలలో ఆధునికులయ్యారు. కాని,అక్కడ కూడా మత ఛాందసులు తిరగదోడి, పునర్వికాసాన్ని దెబ్బతీశారు.

సిరియా, అల్జీరియా, ఇరాక్, ఈజిప్టులలో ముస్లిం కుటుంబ చట్టాలలో విపరీతమైన ఆధునిక మార్పులు వచ్చాయి. అలాంటి సందర్భాలలో ఇంకా ఇండియాలో ముస్లింలు తమ చట్టాలలో ప్రభుత్వ జోక్యం కూడదనడం అర్థంలేని విషయమే.

ముస్లింలలో పునర్వికాసానికి దోహదం చేయగల అంశాలేమిటి? ఇస్లాం సంపూర్ణం అనీ, మార్చడానికి వీల్లేనిదనీ ముస్లిం సనాతనులు నమ్ముతారు. ఆధునిక శాస్త్రీయ ధోరణుల దృష్ట్యా ముస్లింలలో చదువుకున్నవారు యీ విషయాన్ని మళ్ళీ ఆలోచించాలి. ఇతర మతాలలో వచ్చిన విమర్సలు, పరిశీలనలు ఇస్లాంలోనూ రావాలి.

ఇలాంటి విమర్శలు, పరిశీలనలు బయటివారు శాస్త్రీయ దృక్పధం గలవారు పూనుకుంటేనే, త్వరగా పునర్వికాసానికి ఆస్కారం వుంటుంది. పుట్టినప్పటినుండీ చనిపోయే వరకూ హిందువు ఏంచేయాలి, ఎలావుండాలి అని మతం శాసించింది. అదంతా పునర్వికాస ధోరణుల వలన చాలావరకు సడలుతున్నది. ఇంచుమించు ఇస్లాంలోనే అలాంటి నిర్దేశాలు వున్నాయి. వాటినే పునరాలోచించాలి. క్రైస్తవులలోనూ యిలాంటి మూఢాచారాలు,నమ్మకాలు బలంగా వుండేవి. పునర్వికాసం, వివేచన, పారిశ్రామిక శాస్త్రీయ విప్లవాల వలన వారు చాలావరకూ బయటపడ్డారు. ఎటొచ్చీ ముస్లింలపైనే మతగురువుల పట్టు ఇంకా సడలలేదు.

భారతదేశానికి హమీద్ దల్వాయ్ లు ఎందరోకావాలి. అప్పుడే ముస్లింలలో తొందరగా పునర్వికాసానికి అవకాశం లభిస్తుంది.

- హేతువాది,సెప్టెంబరు,నవంబరు 1989
పునర్వికాస పరిణామం
గాంధిభాయి సెక్యులరిజంలో పునర్వికాసం

చైనా, కంబోడియా, వియత్నాంలలో గాంధివంటి అహింసావాది బ్రతికేవాడా? బ్రిటిష్ వారి ఇండియా పాలనలో గాంధివంటివారు తమ ఆచారాలను, అలవాట్లను ప్రచారం చేసుకుంటూ, రాజకీయాలను మతంతో రంగరించి, మహాత్ములనిపించుకున్నారు.

దక్షిణాఫ్రికాలో పరిశోధనలుచేసి విఫలమైన గాంధి, ఇండియాలొ కొంతవరకు సఫలమయ్యారు. 1920 నుండే, తిలక్ మరణానంతరం, గాంధీజీ కాంగ్రెసు నాయకత్వంలోకి వచ్చారు. అప్పటికే ఆయనకు తగినంత ప్రచారం లభించింది. ఆశ్రమాలతో దేశంలో రాజకీయాలు ఆరంభించిన గాంధీజీ, స్త్రీలను యీ రంగంలోకి ఆకర్షించగలిగారు. శాకాహారం,