పుట:Abaddhala veta revised.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూపడంలేదు. విదేశాలలో ఇస్లాం విమర్శలు ఖురాన్ పరిశీలనలు, మహమ్మద్ జీవితాన్ని నిశితంగా గమనించిన సందర్భాలు వున్నాయి. అలాంటప్పుడు సనాతన ముస్లింలు అభ్యంతరపెడుతూనే వున్నారు. ఇటీవల సాల్మన్ రష్డీ రాసిన శాటనిక్ వెర్సస్ పుస్తకాన్ని అందరికంటె ముందు ఇండియా నిషేధించింది. రచయితను చంపేయమని ఇరాన్ నేత అయొతుల్లా ఖొమినీ శాసించాడు, మతవిమర్శలపట్ల అసహనం ఆ స్థాయికి చేరుకునంది.

మార్క్సిజాన్ని ఇష్టపడిన ముస్లింలు, కమ్యూనిస్టు పార్టీలోవున్న ముస్లింలు సైతం ఇస్లాంను, అమానుష ముస్లిం మతధోరణులను విమర్శించకపోవడం ఆశ్చర్యకరం. మతం మత్తుమందు వంటిదన్న మార్క్స్ ప్రవచనాన్ని వీరు పట్టించుకోలేదు. అవకాశవాదం తప్ప యిందులో మరో కారణం కనిపించదు.

పాకిస్తాన్ ఏర్పడగానే అక్కడ కమ్యూనిష్టుల్ని తుదముట్టించారు. ఆ ఉద్యమాన్ని కాపాడదామని వెళ్ళిన భారత కమ్యూనిష్టు ముస్లింలు సజ్జాద్ జహీర్, అశ్రఫ్ లను జైళ్ళలో పెట్టారు. పదేళ్ళ తరువాత వారు ఇండియాకు తిరిగి రావలసి వచ్చింది. కమ్యూనిష్టు పార్టీలో వున్న ముస్లింలు మతేతరంగా వ్యవహరించలేకపోయారు. క్రమేణా కమ్యూనిష్టుపార్టీలో ముస్లింలు క్షీణించారుకూడా. కమ్యూనిష్టు ముస్లింలు ఎవరూ ఇస్లాంను,మహమ్మద్ ను, ముస్లిం వాదనను, షరియాను నిశిత పరిశీలనకు గురిచేయలేదు. కమ్యూనిష్టు పార్టీలోవున్న ముస్లిం నాయకులు ముస్లిం నాయకులుగానే ప్రవర్తించారు. పశ్చిమబెంగాల్ లో మహ్మద్ ఇలియాస్ ఒక ఉదాహరణ.

భారతదేశాన్ని 800 సంవత్సరాలు పరిపాలించిన ముస్లింలు, నేటికీ శాశ్వత అల్ప సంఖ్యాకులుగా వుండాలనే ధోరణి దారుణమైంది. ఆధునిక సెక్యులర్ మానవ విలువలు వారిచే పాటించజేయదం చాలా కష్టమైపోతున్నది. ఇందుకు వారి మతమే వారికి ప్రధానంగా అడ్డొస్తున్నది. ఆధునిక పాశ్చాత్య విద్యను ముస్లింలు అభ్యసించాలని సర్ సయ్యద్ అహమ్మద్ కోరాడు. ముస్లింలలో పునర్వికాసానికి అది ఆరంభదశ అయింది. కాని తొలుతనే సర్ సయ్యద్ ను ఛాందస ముస్లింలు కాఫిర్ అని బోర్డు కట్టేశారు. పునర్వికాస ప్రవాహం ఆగింది.

నేడు ముస్లింలలో పునర్వికాసం కావాలి. వీటికి అడ్డొస్తున్న విషయాలేమిటి? ఒకటి బహుభార్యాత్వం, చారిత్రకంగా జరిగిపోయిన విషయాన్ని ఆధునికంగా పాటించాలనడం, స్త్రీ-పురుష సమానతకు భంగమని వారికి నచ్చచెప్పాలి. దేశ పరిస్థితుల దృష్ట్యా, మతధోరణి ప్రక్కనబెట్టి, కుటుంబాలను పరిమితం చేసుకోవాలి.

ఒకప్పుడు, ఖురాన్ ప్రకారం కూడా, బానిసల్ని అట్టిపెట్టుకొనేవారు. బానిసలలో లైంగిక సంబంధాలుండడం యజమానులకు తప్పుకాదు. నేడు అది కొనసాగాలని ముస్లింలు అనగలరా? అది మార్చుకోడానికి వారుసంసిద్ధత వ్యక్తపరచారుగదా! అలాగే మిగిలిన రంగాలలోనూ ఆధునీకరణకు పూనుకుంటే పునర్వికాసానికి దోహదం చేసినట్లే.