పుట:Abaddhala veta revised.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరచిందట. ఈ రహస్యాలన్నింటికీ కొందరు దేవతలు కాపలావుండగా, వారితో బ్లావట్ స్కీ మానసికంగా సంబంధం పెట్టుకున్నదట. హిమాలయాలలోని రుషులతో దివ్యజ్ఞాన సమాజం వారికి సంబంధాలున్నాయన్నారు. ఇలాంటి వారిలో సి.డబ్లు.లెడ్ బీటర్, ఎ.పి.సిన్నెటు, కల్నల్ ఆల్కాటు మొదలైనవారున్నారన్నారు. దివ్యజ్ఞాన సమాజంవారు దూరశ్రవణ, దూరదృష్టి, అతీంద్రియ శక్తుల్ని నమ్మారు. ఇలాంటి అనేక ఆకర్షణలతో అనిబిసెంట్ ఎట్టకేలకు 1889లో దివ్యజ్ఞాన సమాజీకురాలైంది. 1891లొ బ్లావట్స్కీ లాడ్జి అధ్యక్షురాలైంది.

దివ్యజ్ఞాన సమాజం ప్రపంచ వ్యాప్తంగా సోదరభావాన్ని పెంపొందించాలని, ఆర్య సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని, మానవుడిలో దాగివున్న ప్రతిభలను బయటకు తీయాలని ఉద్దేశించింది.

దివ్యజ్ఞాన సమాజ స్థాపకురాలు మాడం బ్లావట్ స్కీ 1891లో మరణించింది. అప్పటికే ఇండియాలో బెట్రాం కెట్లే ప్రధాన కార్యదర్శిగానూ, ఆల్కాటు అధ్యక్షుడుగానూ దివ్యజ్ఞాన సమాజ వ్యవహారాలు చూస్తున్నారు. వీరికి తోడుగా ఎడ్ అనే వ్యక్తి వున్నాడు.

1893లో అనిబిసెంటు ఇండియా చేరుకున్నది. అప్పటినుండీ దేశంలో అనేక నగరాలలో పర్యటించి తన వాగ్ధోరణితో చదువుకున్న కొద్ది మందిని ముగ్ధుల్ని చేసింది. అప్పటికే దివ్యజ్ఞాన సమాజకేంద్రం కూడా ఇంగ్లండ్ నుండి ఇండియాకు మారింది.(1879)

దివ్యజ్ఞాన సమాజానికి అనిబిసెంటు నాయకత్వం వహించిన తరువాత ఇండియాలోని నగరాలలో బాగా ప్రచారం లభించింది. చదువుకున్న వారిలో అగ్రకులాలవారు దివ్యజ్ఞాన సమాజంలో చేరారు. బ్రహ్మసమాజంలో కొందరు చీలిపోయి, అనిబిసెంటుతో చేరారు. అల్కాట్ అనిబిసెంటులు పర్యటనలు చేశారు. అంతవరకూ దేశంలో సాంఘిక సంస్కరణలకు వున్న అనుకూలత కాస్తా వెనుకంజ వేసింది హిందూమతాన్ని,పవిత్రగ్రంథాల్ని ఆకాశానికెత్తి శ్లాఘించిన అనిబిసెంటు, సాంఘిక సంస్కరణల్ని వ్యతిరేకించింది. సనాతనులు యీ ధోరణి ఆసరాగా తీసుకొని దివ్యజ్ఞాన సమాజాన్ని పొగిడారు. హిందూ నాగరికతకు పొందికగా వుండేట్లు హిందూమత,సంఘాభివృద్ధికి తోడ్పడతామని అనిబిసెంటు నాయకత్వాన 1904 లో మద్రాసు హిందూ సంఘం ప్రతిజ్ఞ చేసింది. అంతవరకూ సంస్కరణలు కావాలన్న వారంతా పాశ్చాత్య నాగరికతాప్రేరణలో, వ్యామోహంలో పడినట్లు ప్రచారం జరిగింది. డిరోజియో-రామమోహన్ రాయ్ ప్రభృతుల సంస్కరణలు, అభ్యుదయ ఆలోచనలు వెనుకంజ వేశాయి. అనిబిసెంటు భారత సమాజానికి తీరని ద్రోహం చేసింది.

కులం, భోగం వృత్తి, బాల్యవివాహాలు, విధవా పునర్వివాహాలు మొదలైనవన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయాలని అనిబిసెంటు వాదించింది. 20వ శతాబ్దం ఆరంభంలో సంస్కరణ ఉద్యమం వెనక్కు మళ్ళింది.