పుట:Abaddhala veta revised.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలంగానూ, నమ్మదగినవిగానూ లేవని ఆమె తన స్వీయచరిత్రలో పేర్కొన్నది. 1875 నుండీ యీ ప్రచారంలో పాల్గొన్న అనిబిసెంట్ నేషనల్ సెక్యులర్ సొసైటీకి ఉపాధ్యక్షురాలైంది.

డా॥ ఛార్లస్ నోల్టన్ రాసిన పుస్తకంలో కుటుంబనియంత్రణ బోధనలు వున్నాయి. అవి క్రైస్తవులకు నచ్చలేదు. అతడి పుస్తకంలో ప్రచురణకర్త కొన్ని అశ్లీల చిత్రాలు వేసి అమ్మాడు. రచయితను ఇంగ్లండ్ లో శిక్షించారు! ఆ దశలో అనిబిసెంట్ ముందుకొచ్చి రచయిత తన భావాలు స్వేచ్ఛగా వెల్లడించే హక్కువుండాలంటూ, అతడి పుస్తకాన్ని తిరిగి ప్రచురించింది. రచయిత అభిప్రాయాలన్నింటితో పూర్తిగా ఏకీభవించకపోయినాసరే, భావస్వేచ్ఛ ముఖ్యమని హేతుబద్ధంగా వాదించింది. ఈ పుస్తకం ప్రచురించిన నేరానికి అనిబిసెంట్, బ్రాడ్లాలు ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించారు కూడా.

అనిబిసెంట్ ఆనాడు క్రైస్తవ మత ధోరణులకు ఎదురీదింది. కుటుంబ నియంత్రణ కావాలంటూ ఒక రచన చేసింది. అయితే ఆమె తన భావాలతో తన సంతానాన్ని చెడగొడుతున్నదంటూ తండ్రి కోర్టులో కేసు వేసి, ఆమెను పిల్లల్ని వేరుచేయాలన్నారు. కోర్టు అందుకు అంగీకరించింది. 1879లో అనిబిసెంట్ అప్పీలుపై కూడా కోర్టు తీర్పు చెబుతూ, తల్లి పిల్లల్ని చూడొచ్చుగాని, పూర్తి హక్కులు తండ్రివేనన్నది.


అనిబిసెంట్ యీ విధంగా సాహసోపేత జీవితం గడుపుతుండగా సందేహాలకు, అనుమానాలకు గురైంది. నాస్తికత్వం, హేతువాదం ఆమెకు పూర్తిగా అవగాహన కాలేదు.

ఛార్లస్ బ్రాడ్లా శక్తివంతమైన ఆకర్షణ, వాగ్ధోరణి వాదనాబలానికి అనిబిసెంట్ సమ్మోహితురాలైంది. అంతేగాని హేతువాదం, నాస్తికత్వం శాస్త్రీయ దృక్పధం పూర్తిగా ఆకళింపు చేసుకొని ఆమె ప్రచారానికి దిగలేదు. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, ఎదురుదెబ్బలు ఆమెను మానసికంగా కుందదీశాయి. అలాంటి సన్నివేశంలో బ్లావట్ స్కీ రాసిన సీక్రెట్ డాక్ట్రిన్ (రహస్య సిద్ధాంతం) అనే పుస్తకం అనిబిసెంట్ చదివింది. అంతవరకూ వున్న హేతువాదాన్ని వదలేసింది. ప్రశ్నించకుండా ఆ రచనను గుడ్డిగా ఆమోదించింది. హేతువాదులు బ్లావట్ స్కీని,ఆమె రచనల గురించి వేసిన ప్రశ్నలు కూడా అనిబిసెంట్ ప్రక్కన బెట్టింది. తనకు నచ్చితే ఇక ఎలాంటి వాదమూ అక్కరలేదనే ధోరణిలో ఆమె సాగిపోయింది.

దివ్యజ్ఞాన సమాజం ఏర్పడినప్పుడు మనోతత్వశాస్త్రం బాల్యదశలో వున్నది. విజ్ఞానరంగంలో ఇంకా నిర్ధారిత వాదమే ప్రబలివున్నది. జీవశాస్త్రం కొంతమేరకు పెంపొందినా, జన్యుశాస్త్రం వరకూ రాలేదు.

అలాంటి ఘట్టంలో హెచ్.పి. బ్లావట్ స్కీ రచన రహస్య సిద్ధాంతం రెండు సంపుటాలు అనిబిసెంటు చదివింది. పునర్జన్మను సమర్ధిస్తూ గత అనుభవాల్ని గురించి కథలుగా అల్లిన యీ పుస్తకం ఆమెను ఆకట్టుకున్నది. మానవుడిలో ఏడు విధాలైన దశలుంటాయని యి పుస్తకం పేర్కొన్నది. ఆత్మపరిణామం చిత్రవిచిత్రాలుగా వర్ణించిన యీ రచన అనిబిసెంట్ ను దిగ్భ్రాంతి