పుట:Abaddhala veta revised.pdf/166

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రష్యన్ యువతి బ్లావట్ స్కీ 17 సంవత్సరాల ప్రాయంలోనే తనకంటె ఎంతో ఎక్కువ వయస్సుగల వ్యక్తిని పెళ్ళాడింది. కాని, కొన్ని మాసాలకే అతడిని వదిలేసింది. ఆ చేదు అనుభవం తరువాత, ప్రపంచ పర్యటన జరిపింది.

1831లో బ్లావట్ స్కీ రష్యాలో పుట్తి 1875లో అమెరికా చేరి దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది. ఆ సమాజ కార్యదర్శినిగా ఇండియాలో ఆర్యసమాజ్ స్థాపకుడు దయానంద్ కు ఉత్తరాలు రాసింది. తమ సమాజాన్ని ఆర్యసమాజ్ లో విలీనం చేస్తామన్నారు. 1879లో భారతదేశం చేరుకుని, చెప్పిన ప్రకారం ఆర్యసమాజ్ లోకలసిపోయారు కాని, ఆ కలయిక అట్టేకాలం సాగలేదు. అభిప్రాయభేదాలు రాగా, అతిత్వరలో విడిపోయారు. కల్నల్ ఆల్కాట్, మాడం బ్లావట్ స్కీలు తమను క్రైస్తవ విరోధులుగా చిత్రించుకున్నారు. తరువాత బౌద్ధంలోకి మారారు. ఆర్యసమాజ్ తో విడిపోయిన అనంతరం దేశంలో పర్యటించి, చివరకు మద్రాసులో అడయార్ కేంద్రంగా దివ్యజ్ఞాన సమాజస్థాపన చేశారు. సంస్కృతాన్ని పునరుద్ధరించాలని, ప్రాచీన మతం, తత్వం, కళలు తిరగదోడాలని ఉద్బోధించారు. హిందూ మత ధర్మాలు ఉన్నతమైనవన్నారు.

దివ్యజ్ఞాన సమాజం విదేశాలలో కొద్దిమంది చదువుకున్నవారిని ఆకట్టుకున్నది. అయితే దివ్యజ్ఞాన సమాజానికి బహుళ ప్రచారం రావడానికీ,అనేకమంది ఆకర్షితులు కావడానికీ అనిబిసెంట్ కీలకపాత్ర వహించింది. ఈమె 1889లో బ్లావట్ స్కీ గ్రంథం చదివి, సమ్మోహితురాలైంది. వారి సమాజంలో అదొక మలుపు. 1891లో బ్లావట్ స్కీ మరణించింది. ఆ తరువాత అనిబిసెంట్ తిరుగులేని సమాజ నాయకురాలైంది. కనుక అనిబిసెంట్ గురించి కొంత విపులంగా తెలుసుకోవడం అవసరం.

అనిబిసెంట్ 1847 అక్టోబరు 15న పుట్టింది. ఐర్లండ్ దేశీయురాలు, ప్రైవేట్ విద్యాభ్యాసం చేసింది. ఒక క్రైస్తవ మతాచార్యుడిని పెళ్ళి చేసుకున్నది. అతడితో సంతానం పొందింది. తొలి ఆకర్షణలకు గురిఅయ్యే ఉద్వేగిగా అనిబిసెంట్ జీవితమంతా ప్రవర్తించింది. 1873 నాటికి తన భర్తకు విడాకులిచ్చివేసింది.

1874లో ఫ్రీథాట్ సొసైటీలో చేరి, ఛార్లస్ బ్రాడ్లా ఉపన్యాసాలు విని, ఆకర్షితురాలైంది. అప్పటినుండి బ్రాడ్లాపట్ల విపరీత ఆకర్షణ పెంచుకొని, తానూ నాస్తికురాలుగా ప్రచారం చెసింది. హేతువాదిగా ఉపన్యాసాలు చేసింది. కుటుంబ నియంత్రణ ప్రచారం మొదలుపెట్టింది.

బెర్నాడ్ షా ప్రబావంతో ఫేబియన్ సోషలిస్ట్ అయింది. ఎవరి ప్రభావంలో వుంటే ఆ బావాలు భుజాన వేసుకొని ప్రచారం చేయడం ఆమెకు ఆనవాయితీ అయింది. భావాలు బాగా అవగాహన చేసుకొని, నచ్చి, ప్రచారం చేయడం వేరు.తాత్కాలిక ఆకర్షణలకు, వ్యక్తుల సమ్మోహనాలకు లోబడి ప్రచారం సాగించడం వేరు. ఎత్తువారి చేతిబిడ్డవలె అనిబిసెంట్ ప్రవర్తించింది. బ్రాడ్లా తొలి ఉపన్యాసం విని, తానూ నాస్తికురాలినే అంటూ సభలలో పాల్గొన్నది. ఇంగ్లండ్ లో పర్యటించి నాస్తికత్వం ప్రచారం చేసింది. దేవుని రుజువుకై చెబుతున్న సాక్ష్యాధారాలు