పుట:Abaddhala veta revised.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తీవ్రస్థాయికి పోయాయి. ఒకదశలో సభ కార్యదర్శి పదవికి తిలక్ రాజీనామా యివ్వక తప్పలేదు. గోఖలే ఆ స్థానానికి వచ్చారు. తిలక్ పంతంతో, పగబట్టినట్లుగా తన ప్రత్యర్ధులైన అగార్కర్, గోఖలే, రనడేలపై ధ్వజమెత్తాడు. మరాఠిలో కేసరి పత్రికను, ఇంగ్లీషులో మరాఠ పత్రిక పెట్టి, తిలక్ తన భావాలు ప్రచారం చేశారు.

పూనాలో సార్వజనిక సభను ఆక్రమించుకోడానికి తిలక్ ప్రయత్నించి, తనవారిని ఎంపిక చేయించారు. గోఖలే బయటకు పోయారు. బ్రిటిష్ వారు హిందూ వివాహ వయోపరిమితి చట్టం తేడానికి ప్రయత్నిస్తే తిలక్ వ్యతిరేకించారు.

కాంగ్రెసు మహాసభలతో బాటుగా ఏటా అదే ప్రాంగణంలో సాంఘిక మహాసభలు జరిగేవి. రనడే వీటిలో చాలా ప్రముఖపాత్ర వహించాడు. కాంగ్రెసు సభలను సాంఘిక సభలను, వేరుచేయాలని పట్టుబట్టిన తిలక్ 1885 పూనా కాంగ్రెసు సమావేశాలనాటికి తన పంతం తగ్గించుకున్నాడు.ఆ విధంగా పునర్వికాసానికి తోడ్పడుతున్న రనడేను తగ్గించి, తిలక్ సంఘాన్ని కొంత వెనక్కు తీసుకెళ్ళాడు. సార్వజనిక సభ తిలక్ నాయకత్వాన పనిచేయలేక, స్థంభించిపోయింది. ఈ నష్టాన్ని తీర్చడానికి సాంఘిక మార్పుల దృష్ట్యా, డక్కన్ సభను స్థాపించి రనడే, గోఖలేలు కృషిచేశారు. అయితే సార్వజనిక సభ చేకూరలేదు. మరోవైపు తిలక్ పూర్తిగా రాజకీయాలలో నిమగ్నుడై, మతాన్ని ఆధారంగా ప్రజలతో రాజకీయ చైతన్యత తీసుకురావాలనుకున్నాడు.

- హేతువాది, జూలై 1989
పునర్వికాస పరిణామం
మూఢనమ్మకాలకు దివ్యజ్ఞానసమాజ సిమెంట్

భారతదేశంలో పునర్వికాసం రాకపోగా,మనల్ని అతివేగంగా వెనక్కు తీసుకెళ్ళే సమాజాలు విజృంభించి పనిచేశాయి. అందులో దివ్యజ్ఞాన సమాజం ఆరితేరింది.

విదేశాలలో పుట్టిన దివ్యజ్ఞాన సమాజం, మనదేశంలో ప్రవేశించి పాతుకపోయింది. దీని స్థాపకులు బ్లావట్ స్కీ అనే రష్యన్ స్త్రీ, అల్కాట్ అనే అమెరికన్ 1875 నవంబరు 17న అమెరికాలో దివ్యజ్ఞాన సమాజానికి అంకురార్పణ చేశారు. ప్రకృతిలోనూ, మానవునిలోనూ బయలుపడని శక్తులు కనుగొనాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమాజం వారికి బ్లావట్ స్కీ రాసిన ది సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథం మూలాధారం. అనంతమూల స్వరూపమనేది భావానికీ, ఆలోచనకూ అందనిదని పేర్కొన్నారు. విశ్వంలో మార్పులన్నీ దైవలీలలుగా చెప్పారు.

ఆత్మలు,పునర్జన్మలు,కర్మలలో వీరికి నమ్మకం వున్నది. రుజువుకు నిలబడని దివ్యజ్ఞాన సమాజంవారి రచనలు కొందరిని ఆకర్షించాయి. ఈ రహస్యాలనేవి మీకెలా తెలుసు అని అడిగితే, దివ్యజ్ఞానం వారు తెల్లముఖం వేస్తారు.