పుట:Abaddhala veta revised.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్ పవన బ్రాహ్మణులు పౌరోహిత్యంలొ,వ్యవసాయంలో,వాణిజ్యంలో, విద్యలో, న్యాయ,వైద్య వృత్తుల్లో అల్లుకపోయారు. ప్రభుత్వోద్యోగాలలో అత్యధికసంఖ్యలో బ్రాహ్మణులే వున్నారు. ఈ విధంగా ఇంగ్లీషు విద్యవలన లభించిన సదవకాశాలను బ్రాహ్మణులే పొందారు. పత్రికారంగంలో కూడా యీ అవకాశాల్ని వారు వినియోగించుకున్నారు. విపరీతంగా సాహిత్య, చరిత్ర రచనలు కూడా బ్రాహ్మణుల కలంనుండే వెలువడ్డాయి.

అయితే బ్రిటిష్ వారు తెలివిగా సామాజిక మతరంగాల జోలికి పోలేదు. వాటిపై పూర్తి ఆధిపత్యం బ్రాహ్మణులదే. దేవాలయాల పెత్తనం బ్రాహ్మణులదే. వీటి ఆధారంగా సమాజ ఆలోచనారంగంపై వీరికి పట్టు వుండేది.

మహారాష్ట్రలో మహదేవ్ గోవింద రనడే, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర తిలక్, అగార్కర్ లు చిత్ పవన బ్రాహ్మణులే. వీరు భారత పునర్వికాస రంగంలో భిన్న పాత్రలు వహించారు. అందులో ప్రముఖంగా పేర్కొనదగింది పూనాలో స్థాపించిన సార్వజనిక సభ, 1870లో యిది ఆరంభమైంది. ఇది అన్ని కూలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నా, పెత్తనం చిత్ పవన బ్రాహ్మణులదే.

సార్వజనిక సభను ఆదర్శంగా స్వీకరించి బెంగాల్, మద్రాసు తదితర చోట్ల సభలు వెలిశాయి. ఉత్తరోత్తరా వివిధ సభల మధ్య కొంత సమన్వయం కూడా సాధించారు. ప్రభుత్వ చర్యలలో అనుకూలమైన వాటిని సమర్ధించడం సమాజ వ్యతిరేకమనుకున్న వాటిని ప్రతిఘటించడం, సార్వజనిక సభ కార్యకలాపాలుగా వుండేవి. లిట్టన్ ప్రభువు తెచ్చిన దేశభాషల పత్రికాచట్టాన్ని ఈ సభ వ్యతిరేకీంచింది. ఉన్నత విద్యకు ప్రభుత్వ సహాయం ఉపసంహరింపవలసి వచ్చినప్పుడు కూడా వీరు ప్రతిఘటించారు. స్థానిక స్వపరిపాలన విస్తరించాలని సభ కోరింది. మొత్తం మీద రాజకీయ, సామాజిక రంగాలలో సార్వజనిక సభ చాలా కీలకపాత్ర వహించింది. తరువాత భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు యీ సభ దారి తీసిందనే విషయం గుర్తుంచుకోవాలి.

సార్వజనిక సభలో చిత్ పవన బ్రాహ్మణాధిపత్యం వున్నప్పటికీ దృక్పథాలలో తీవ్ర విభేదాలున్నాయి. అవి సభా కార్యకలాపాలలో బయటపడ్డాయి. ఇక్కడే తిలక్, గోఖలే, అగార్కర్, రనడే పాత్రలు పరిశీలించాలి. వీరి ప్రభావం దేశంలో చదువుకున్నవారిపై బడింది.

బ్రిటిష్ పాలకుల దృష్టిలో చిత్ పనవ్ బ్రాహ్మణులు ప్రమాదకారులు. 1897లో ఇద్దరు బ్రిటీష్ అధికారుల్ని చేపేకర్ సోదరులు చంపేయడంతో బ్రిటిష్ పాలకులు వీరిపై నిఘా వేశారు. చిత్ పవన బ్రాహ్మణులలో తిలక్ వర్గం దేశానికి స్వాతంత్ర్యం ముందు అవసరమని, ఆ తరువాత సాంఘికసంస్కరణల సంగతి చూచుకోవచ్చనీ అన్నారు. రాజ్యాంగబద్ధంగా రాజకీయాలలో పాల్గొంటూ, సాంఘిక సంస్కరణలు కొనసాగించాలని ఒక వర్గం తలపోసింది. రాజకీయాలలో మతం వుండరాదని, సెక్యులర్ గా వుండాలని గోఖలే, మతంలోనే దేశీయ జాతీయ భావన రేకెత్తించాలని తిలక్ ఉద్యమించారు. ఈ అభిప్రాయాలే సార్వజనిక సభలో బయటపడి